ఇండియన్ పాంపనో చేపలు పడుతున్న రైతు
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ముక్కుడు పార(ఇండియన్ పాంపనో) చేపలు సిరులు కురిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్లలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దీనికి మంచి డిమాండ్ వచ్చింది. వైరస్‌లు, తెగుళ్లు దరిచేరని ఈ సముద్రపు చేపల సాగు ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. వీటిలో అంతర పంటగా రొయ్యలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు. ఇండియన్ పాంపనో.. శాస్త్రీయ నామం ట్రాచినోటుస్మూకలీ.. వాడుక భాషలో ‘ముక్కుడు పార’గా పిలుస్తారు. ఈ చేపలో ప్రొటీన్స్, వైట్‌మీట్ అధికంగా ఉంటుంది. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఎఫ్‌ఆర్‌ఐ)లో 2016లో అభివృద్ధి చేసిన ‘ఇండియన్ పాంపనో’.. సంప్రదాయ చేపలు, రొయ్యలకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ప్రస్తుతం పలుచోట్ల తీరప్రాంత లోతు జలాల్లో వీటిని సాగు చేస్తున్నారు.
ప్రయోగాత్మకంగా కృష్ణా, తూ.గోదావరిలో..
సీఎంఎఫ్‌ఆర్‌ఐ ద్వారా కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భవదేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా కొమరిగిరిపట్నంలో ప్రయోగాత్మకంగా 6 ఎకరాల్లో సాగు మొదలుపెట్టగా.. ప్రస్తుతం అక్కడి పరిసర గ్రామాల్లో మరో 50 ఎకరాల్లో రైతులు ఈ చేపలను పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. 2 నుంచి 10 గ్రాముల సైజులో ఉన్న చేప పిల్లలను ఎకరాకు 4 వేల నుంచి 4,500 వరకు వేసుకోవచ్చు. ఇవి 7 నెలలకు 900 గ్రాముల నుంచి కేజీ వరకు పెరుగుతాయి. రోజుకు 4 సార్లు మేత వేస్తే సరిపోతుంది. ఈ చేప.. ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతుంది. 600 గ్రాముల నుంచి పట్టుబడి మొదలు పెడతారు. కిలో సైజుండే చేపకు మార్కెట్‌లో రూ.300 నుంచి రూ.330 వరకు ధర పలుకుతోంది.
అంతరపంటగా రొయ్యలు..
ఇండియన్ పాంపనోతో పాటు అంతర పంటగా రొయ్యలు సాగు చేస్తున్నారు. కిలో సైజులో ఉండే పాంపనో ఎకరాకు 4 టన్నులు వస్తుండగా, అంతర పంటగా వేసే రొయ్యలు 18–20 కౌంట్‌లో టన్ను వరకు దిగుబడి వస్తున్నాయి. పెట్టుబడి హెక్టార్‌కు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు అవుతుండగా.. రొయ్యలతో కలిపి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం వస్తోంది. పెట్టుబడి పోనూ హెక్టార్‌కు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. కేరళ, బెంగాల్‌లో వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.
అవసరమైన సహకారమిస్తాం..
ఇండియన్ పాంపనో సాగును మరింత విస్తరించాల్సిన అవసరముంది. మంచి పోషక విలువలున్న ఈ చేపల సాగు పట్ల ఏపీలో ఇప్పుడిప్పుడే రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాంకేతికంగా అవసరమైన సహకారం అందించేందుకు సీఎంఎఫ్‌ఆర్‌ఐ సిద్ధంగా ఉంది.
– డాక్టర్ సుభదీప్‌ఘోష్, విశాఖ రీజనల్ హెడ్, సీఎంఎఫ్‌ఆర్‌ఐ
హేచరీలను ప్రోత్సహించాలి..
రొటేషన్ పద్ధతిలో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ పాంపనోను పెంచవచ్చు. అపారమైన సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ఇండియన్ పాంపనో సాగుకు విస్తారమైన అవకాశాలున్నాయి. అవసరమైన సీడ్ ఉత్పత్తి కోసం హేచరీలను ప్రోత్సహించాల్సిన అవసరముంది.
– డాక్టర్ శేఖర్ మేఘరాజన్, సీనియర్ శాస్త్రవేత్త, సీఎంఎఫ్‌ఆర్‌ఐ
రూ.8 లక్షల ఆదాయం వచ్చింది
ఎకరాకు 6 వేల పిల్లలు వేశాను. ఐదు టన్నుల వరకు వచ్చింది. వీటిని కేరళకు ఎగుమతి చేశా. కిలోకి రూ.330 వరకు ఆదాయం వచ్చింది. అంతర పంటగా 10 వేల రొయ్య పిల్లలు వేశాను. 20 కౌంట్‌లో టన్ను వచ్చింది. మొత్తమ్మీద పెట్టుబడి పోగా రూ.8 లక్షలు మిగిలింది.
– ఉప్పలపాటి కృష్ణప్రసాద్, రైతు, కొమరిగిరిపట్నం
Comments
Please login to add a commentAdd a comment