వరి పండాలంటే.. ఎప్పుడూ మడి నిండా నీళ్లుండాలి. మరి అన్ని నీళ్లున్న మడిని మరో పనికీ వాడుకోగలిగితే.. సింపుల్‌గా చేపలు పెంచితే.. ఇటు రైతులకు అదనపు ఆదాయం, అటు పర్యావరణానికీ ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో, మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వరి చేన్లతో ‘చేపలు పండిస్తున్నా’రని అంటున్నారు. రాష్ట్రంలోనూ వరి చేన్లలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కథనం..
– సాక్షి సెంట్రల్ డెస్క్
వరికి ‘అదనం’గా..
ప్రపంచవ్యాప్తంగా సగం జనాభాకు అన్నమే ప్రధాన ఆహారం. వ్యవసాయం చేసే భూమిలో దాదాపు పావు వంతు వరి సాగు చేస్తున్నట్టు అంచనా. ఇలా వరి పండిస్తూనే.. అదనపు ఆదాయం పొందడానికి ఎన్నోఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరి చేన్లలో చేపలు పెంచితే ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. ఇప్పటికే చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి పలు దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. మన దేశంలోనూ పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికంగా కొందరు రైతులు ఇలా చేపలు పెంచుతున్నారు. దీనితో ఎంతో ప్రయోజనం ఉన్నా రైతులకు పెద్దగా అవగాహన లేదు.
చేన్లలో పెంచడం ఎలా?
వరికి నీళ్లు ఎక్కువ కావాలి. పంటకాలమంతా మడులు నీటితో నిండే ఉండాలి. ఇతర అంతర పంటలు వంటివి వేయడం కష్టం. కానీ కాస్త అదనపు శ్రమ తీసుకోగలిగితే.. చేన్లలో చేపలు పెంచొచ్చు. ప్రతి మడిలో వరి చుట్టూ.. గట్టు వెంట ఐదారు అడుగుల వెడల్పుతో (పెరెన్నియల్ ట్రెంచ్)గానీ.. ఏదో ఓ పక్కన గుంత (రెఫ్యూజ్ పాండ్) లాగా గానీ నిర్ణీత పరిమాణంలో కందకాలు తవ్వి చేపలు పెంచవచ్చు.
వరి–చేపల పంట ఇలా...
►సాధారణంగా వరి మడులు ఒక అడుగు నుంచి అడుగున్నర వరకు లోతు ఉంటాయి. దీనికి అదనంగా.. చేపల కోసం తవ్వే కందకాలు 3–4 అడుగుల లోతు ఉంటాయి.
►ఈ నీటిలో రోహు, తిలాపియా, బొచ్చె, కొరమీను, కామన్ కార్ప్ వంటి రకాల చేపలను పెంచవచ్చు. ఎకరానికి 400 కిలోల నుంచి 900 కిలోల వరకు చేపల దిగుబడి వస్తుందని అంచనా.
►ఒక ఎకరంలో 70 శాతం స్థలంలో వరి, మిగతా 30 శాతం స్థలంలో కందకాలు తవ్వి చేపలు వేయవచ్చు. ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల గడువులో.. ఒక్కో ఎకరంలో 400 కిలోల నుంచి 700 కిలోల వరకు చేపల దిగుబడి వస్తుందని అంచనా. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక ఎకరంలో.. కేవలం వరిసాగు చేస్తే సగటున
రూ.20 వేల ఖర్చుతో.. రూ.48 వేల వరకు ఆదాయం వస్తుంది. అదే వరితోపాటు చేపలు కూడా వేస్తే సగటున రూ. 60 వేల ఖర్చుతో.. రూ.80 వేల నుంచి రూ.1.7 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
దిగుబడి.. చేపలు.. రెండూ పెరుగుతాయి
►చేపలు తినగా మిగిలే ఆహారం, చేపల విసర్జితాలు వంటివి వరికి ఎరువుగా ఉపయోగపడతాయి. పంట దిగుబడి 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. రసాయన ఎరువుల అవసరం కూడా తగ్గిపోతుంది.
►పురుగులు, ఇతర కీటకాలు, నాచు వంటివాటిని చేపలు తినేయడం వల్ల వరి దెబ్బతినకుండా ఉంటుంది. పైగా చేపలు బాగా ఎదుగుతాయి.
►చేన్లలో లోతుగా తవ్వి నీళ్లు నింపడం వల్ల ఎలుకల బెడద కూడా తగ్గిపోతుంది.
►వరి చేన్లలో చేపల పెంపకానికి మరీ ఎక్కువ ఖర్చుగానీ, శ్రమగానీ అవసరం ఉండదు. పైగా రెండు విధాలా ఆదాయం పొందవచ్చు.
►వరి కోతలు పూర్తయిన తర్వాత కూడా చేపల పెంపకాన్ని ఏడాది పొడవునా కొనసాగించవచ్చు.
►ఇండోనేషియాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. కేవలం వరిసాగుతో పోలిస్తే, ‘వరి–చేపలు’ కలిపి వేయడం వల్ల ఆదాయం కనీసం 30శాతం ఎక్కువ.
చైనాలో
ఈ ఇబ్బందులను అధిగమిస్తే..
►వరి చేన్లలో చేపల పెంపకానికి నిరంతరాయంగా తగిన స్థాయిలో నీటి సరఫరా ఉండాలి.
►మొదటిసారి చేపలు వేసినప్పుడు మడుల్లో చుట్టూ తవ్వి గుంతలు చేయడం, గట్లను బలోపేతం చేయడానికి పెట్టుబడి, శ్రమ అవసరం ఉంటాయి.
►చేప పిల్లలు వేయడానికి, వాటికి ఆహారానికి కాస్త పెట్టుబడి అవసరం.
►నిరంతరం నీటి తడి ఉన్నా తట్టుకునే రకాల వరినే వేయాల్సి ఉంటుంది.
►కొన్నిరకాల నేలల్లో నీరు సరిగా నిలవదు. మరికొన్ని చేపల పెంపకానికి అనువు కాదు. అందువల్ల నిపుణులతో పరిశీలన చేయించాలి.
►వరదలు వచ్చే అవకాశమున్న చోట్ల చేపలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది.
పర్యావరణానికీ లాభమే.. వరి చేన్లలో చేపల పెంపకం వల్ల రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. సాగుభూములు ఏవైనా కొంతకాలానికి సారం కోల్పోతాయి. అదే ‘వరి–చేపల పంట’ వల్ల.. నేల సారం కోల్పోకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వరిసాగు వల్ల పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు వెలువడుతోందని..
వియత్నాంలో...
ఇది భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడానికి (గ్లోబల్ వార్మింగ్‌కు) కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వరి చేన్లలో చేపల పెంపకం వల్ల మిథేన్ విడుదల 35శాతం వరకు తగ్గినట్టు తమ ప్రయోగాల్లో గుర్తించామని ఇటీవలే ప్రకటించారు. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా వరి మడుల్లో చేపలతోపాటు రొయ్యలు కూడా పెంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment