కొత్తగా 9 జలాశయాల్లో రొయ్యల పెంపకానికి సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది నుంచి చేప విత్తనాన్ని లబ్ధిదారులకు ఉచి తంగా పంపిణీ చేసి చెరువులు, జలాశ యాల్లో పెంచుతున్న సర్కారు... ఈ ఏడాది నుంచి రొయ్య విత్తనాన్ని కూడా ఉచితంగా ఇచ్చి తొమ్మిది జలాశయాల్లో పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఒకవైపు చేపలు, మరోవైపు రొయ్యలను రాష్ట్ర మార్కెట్లో దింపాలని భావిస్తోంది. జలాశయాల్లో 1.51 కోట్ల రొయ్య పిల్లల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. రొయ్య విత్తనాన్ని కొనుగోలు చేసేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి కూడా ఇచ్చిందన్నారు.
రొయ్యల ఉచిత పంపిణీకి రూ. 2 కోట్ల మేరకు ఖర్చు కానుందని అంచనా వేశామన్నారు. రాష్ట్రం లో గతేడాది 5,189 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయినా వాటిల్లో ఎక్కువ భాగం ఎగుమతి అయ్యాయి. మిగిలిన వాటిని నెల్లూరు తదితర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. స్థానిక ప్రజలు ఏపీ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రొయ్యలను కొను గోలు చేసి తింటున్నారు. దీంతో ఈ ఏడాది 9 జలాశయాల్లో రొయ్యలను పెంచాక లాభనష్టాలను అంచనా వేసి వచ్చే ఏడాది నుంచి అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లోనూ పెంచుతామని అధికారులు తెలిపారు.