సాక్షి, హైదరాబాద్: మార్కెట్లోకి త్వరలో తెలంగాణ రొయ్యలు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన రొయ్య ఇప్పుడు రాష్ట్రంలోనూ ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రొయ్యలను పెంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మత్స్యశాఖ 12 రిజర్వాయర్లలో 85 లక్షల నీలకంఠ రొయ్య పిల్లలను వదిలింది.
నాలుగైదు నెలల్లో అవి మార్కెట్లోకి రాబోతున్నాయి. దాదాపు 6 లక్షల కిలోల రొయ్య ఉత్పత్తి కానుందని అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్లలో వదిలిన రొయ్యలను నిర్ణీత పరిమాణంలో పెరిగాక స్థానికంగా ఉండే మత్స్య శాఖ సొసైటీ సభ్యులు మార్కెట్లకు తరలిస్తారు. ఇప్పటివరకు తెలంగాణకు అవసరమైన రొయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచే దిగుమతి చేసుకునేవారు. దీంతో తాజా రొయ్యలు అందుబాటులో లేక వినియోగదారులు వాటి పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు వనామి ఉప్పునీటి రొయ్యను ఉత్పత్తి చేశారు.
మున్ముందు చెరువుల్లోనూ..
రొయ్యల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని మత్స్యశాఖ భావిస్తోంది. రిజర్వాయర్లలోనే కాకుండా చెరువుల్లోనూ రొయ్యలను పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే 50 కోట్ల చేపలను దాదాపు 12 వేల చెరువులు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరుల్లోకి వదిలారు. ప్రభుత్వం రొయ్యలపై దృష్టిసారిస్తే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. పైగా రొయ్యలను, చేపలను కలిపి కూడా సాగు చేయొచ్చని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే మత్స్యకారులకు లాభసాటి వ్యాపారంగా రొయ్యలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment