వివాదాస్పదంగా రొయ్యల చెరువులు | Controversial shrimp ponds | Sakshi
Sakshi News home page

వివాదాస్పదంగా రొయ్యల చెరువులు

Published Mon, Jun 5 2017 3:29 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

వివాదాస్పదంగా రొయ్యల చెరువులు - Sakshi

వివాదాస్పదంగా రొయ్యల చెరువులు

తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులు 
అనమతించింది 16, తవ్వేసింది 150 ఎకరాలు
ఎదురుచెప్పిన వారిపై పోలీసు కేసులు
సిరిపురం ప్రజల తిరుగుబాటుతో వెనుదిరిగిన పోలీసులు
కలెక్టర్‌ కలుగజేసుకోవాలని వినతి
 
కరప (కాకినాడ రూరల్‌) :  కరప మండలం సిరిపురంలో రొయ్యల చెరువు తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. రొయ్యల చెరువులు తవ్వొద్దని ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా తవ్వకం పనులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పనులు జరగకుండా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. రొయ్యల చెరువుల వల్ల తాగు నీరు, పంచాయతీ చెరువులు, పంట కాలువలు కలుషితమై పోతున్నాయని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు, పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. 16 ఎకరాలకు అనుమతి తీసుకుంటే 150 ఎకరాలు రొయ్యల చెరువులుగా తవ్వేశారని సిరిపురం, జి.భావారం తదితర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వందలాది ఎకరాలు రొయ్యలు చెరువులు తవ్వేస్తున్నా నాదస్వరం విన్న నాగుపాము తలాడించినట్టుగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసుశాఖాధికారులు ఆనాయకుడికి వంతపాడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

పంట కాలువలు మూసేసినా, రహదారులు «ఇస్టానుసారంగా తవ్వేస్తున్నా, ప్రభుత్వ స్థలంలో 11 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫారమ్‌లు ఏర్పాటు చేసినా, దిగువ నుంచి ఎగువకు రొయ్యల చెరువుల్లోని మురికినీరు పోయేందుకు డ్రెయిన్లు తవ్వేస్తున్నా ఇరిగేషన్, పంచాయతీరాజ్‌శాఖ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు, రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎదురుచెప్పిన వారిపై అధికారపార్టీ అండదండలతో పోలీసు, కోర్టు కేసులు బనాయిస్తున్నారని, ఇలాగైతే గ్రామంలో ఉండాలా, వద్దా అని సిరిపురం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పంట పొలాలు చెరువులుగా తవ్వేస్తుండటంతో ఉపాధికోల్పోతున్నామని కౌలు రైతులు, పనుల్లేక పస్తులుండాల్సి వస్తోందని కూలీలు, పంట, మురుగు కాలువ లు ఆక్రమించేసుకోవడం వల్ల తమ భూములకు సాగునీరందడం లేదని రైతులు, రొయ్యల చెరువులవల్ల తాగునీరు కలుషితమవుతున్నాయని, దుర్వాసనతో, దోమలతో గ్రామంలో ఉండలేకపోతున్నామని గ్రామస్తులు ఇలా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.

తహసీల్దార్‌ బూసి శ్రీదేవి గ్రామానికి వచ్చినప్పుడు తమ బాధలు చెప్పుకున్నా, పనులు ఆపలేదని  గ్రామస్తులు ఆరోపించారు. ఈ నెల ఒకటో తేదీన పొక్లెయిన్‌తో రోడ్డు తవ్వుతుంటే ఆపామని, అయినా వీఆర్వో పట్టించుకోలేదన్నారు. శనివారం రాత్రి కరప ఎస్సై మెల్లం జానకిరాం సిబ్బందితో వచ్చి బెదిరించారని, గ్రామస్తులంతా రావడంతో చేసేదేమీలేక వెనుదిరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. ఒకటో తేదీన రాత్రి పని ఆపితే 3న రోడ్డు తవ్వడానికి పర్మిషన్‌ ఉందని సంబంధిత అధికారి స్టాంపు కానీ, పూర్తి సంతకంకానీ లేని పత్రాన్ని పోలీసులు చూపించారని, ప్రజలు మూకుమ్మడిగా తిరగబడడంతో పోలీసులు వెనుదిరిగారు.

ఆదివారం గ్రామస్తులంతా సిరిపురం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఎట్టి పరిస్థితుల్లోను చెరువులు తవ్వనీయమని తీర్మానించుకున్నారు. పంచాయతీ అనుమతివ్వలేదని, అవసరమైతే ప్రజల తరఫున నిలబడతామని ఉప సర్పంచ్‌ నున్న రాంబాబు, ఎంపీటీసీ నున్న శ్రీనివాస్‌లు ప్రజలకు మద్ధతుతెలిపారు. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా ఏమిచేసుకుంటారో చేసుకోండని చెరువులు తవ్వుతున్న చిక్కాల దొరబాబు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గ్రామస్తులు తెలిపారు.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అండతోనే గ్రామస్తులు వ్యతిరేస్తున్నా చెరువులు అక్రమంగా తవ్వేస్తున్నట్టు ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీల సంతకాలతో సోమవారం కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రజలు తెలిపారు. కలెక్టర్‌ స్పందించి సిరిపురంలో ఉన్నతాధికారితో విచారణ జరిపించి, అనధికారికంగా తవ్విన చెరువులు ధ్వంసంచేయించాలని, ఇకపై పరిసర గ్రామాల్లో రొయ్యల చెరువులు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
 
అన్యాయంగా కేసు పెట్టారు
తనకున్న నాలుగుకుంచాల భూమి చెరువులు తవ్వడానికి ఇయ్యలేదన్న కక్షతో అన్యాయంగా పోలీసు కేసు పెట్టించారు. సొంత భూమి పక్కనే 8.60 ఎకరాలు కౌలుకు చేస్తున్నారు, తనతో చెప్పకుండా కౌలుభూమిని తవ్వేశారు. ఎదురు చెప్పానని ధాన్యం అమ్మేసుకున్నట్టు అక్రమ కేసుపెట్టి 10 రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పారు. చెరువులవల్ల పక్కపొలాలు దెబ్బతిని పండకుండా పోతున్నాయి. అధికారులు కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement