జిల్లాలో రొయ్యల సాగు జిల్లాలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుంది. రొయ్యల సాగు విస్తీర్ణం 21,951.16 హెక్టార్లు (54,887 ఎకరాలు)
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: రొయ్యల ఇగురు.. చూడగానే ఎవరికైనా లొట్టలేస్తూ తినేయాలనిపిస్తుంది. ఇక ఆక్వాకు పేరుపడ్డ పశ్చిమగోదావరి జిల్లాల్లో రొయ్యల వంటకాలు భోజన ప్రియుల నోరూరిస్తుంటాయి. అయితే కొందరు ఆక్వా రైతులు ఇష్టానుసారం యాంటీ బయాటిక్స్ వాడడంతో రొయ్యల్లో ఉండిపోతున్న వాటి అవశేషాలు మన శరీరంలోకి నేరుగా చేరి అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. యాంటీ బయోటిక్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నా అంతకుముందే వాటిని గుర్తించే వ్యవస్థ మన వద్ద లేదు. జిల్లాలో యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడుతూ వేలాది టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే మందుల తయారీ సంస్థలపై చర్యలు లేవు.
సరుకు తిప్పిపంపాక అప్రమత్తం
నిషేధిత యాంటీబయోటిక్స్‌పై రైతులకు అవగాహన లేక దుకాణాల నుంచి వాటిని ద్రావణం, పొడి రూపంలో తెచ్చి చెరువుల్లో వాడుతున్నారు. మన జిల్లా నుంచి కంటైనర్లలో విదేశాలకు ఎగుమతి చేసిన రొయ్యల నాణ్యతను అక్కడ పరీక్షించి వాటిలో యాంటీబయోటిక్స్ అవశేషాలు గుర్తిస్తే సరకును వెనక్కి తిప్పి పంపుతున్నారు. పంపే ముందు నాణ్యత పరీక్షించడం, రైతులు యాంటీ బయాటిక్స్ వాడకుండా అవగాహన కల్పించడం చేయకుండా తిప్పిపంపాక అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది.
గతంలో పలుమార్లు తిప్పిపంపిన విదేశాలు
మన రొయ్యలను విదేశాలు వెనక్కి పంపడం కొత్త కాదు. ఏడాది క్రితం అమెరికా, యూరోపియన్ దేశాలు తిరస్కరించిన రొయ్యల్లో 11 కంటైనర్లు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవే. ఇటీవల అమెరికా, యూరప్ దేశాల నుంచి రాష్ట్రానికి 9 కంటైనర్ రొయ్యలు తిరిగి రాగా.. వీటిలో జిల్లాకు చెందిన కంటైనర్లు రెండు ఉన్నాయి. మత్స్యశాఖ జిల్లా సంయుక్త అధికారిణి ఎస్.అంజలి, ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఈ కంటైనర్లు వచ్చిన విషయాన్ని ఈ నెల 6న ఆకివీడులో జరిగిన ఆక్వా సదస్సులో ప్రస్తావించారు. రొయ్యల సాగులో ఎంతో పురోగతి సాధిస్తున్నామని చెప్పుకుంటున్నా రొయ్యల్లోని యాంటీ బయాటిక్స్‌ను ముందుగా గుర్తించడంలో మనవద్ద ఉన్న సాంకేతికత అంతంతమాత్రమే. దశాబ్దంన్నర క్రితం మన రొయ్యల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలను గుర్తించిన ఆస్ట్రేలియా నేటికి దిగుమతి చేసుకోవడం లేదు.
పరిజ్ఞానం అంతంతమాత్రమే
రొయ్యల ఉత్పత్తిలో యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించే పరిజ్ఞానం మన వద్ద అంతంత మాత్రంగా ఉంది. పట్టుబడికి ముందు ఫ్రీ హార్వెస్ట్ టెస్ట్ (పీహెచ్‌టీ) చేస్తారు. ఎంపెడా ఆధ్వర్యంలో రాష్ట్రంలో 7 చోట్ల ఇలాంటి ప్రయోగశాలలున్నాయి. భీమవరం ఒకటి, నెల్లూరులో (లిక్విడ్ క్రొమిటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రిక్) ఒక ప్రయోగశాల ఉన్నాయి.
యాంటీ బయోటిక్స్‌తో ముప్పు
కొన్ని జాతుల సూక్ష్మజీవుల్ని ఉపయోగించి వాటి జీవన ప్రక్రియ ఆధారంగా తయారు చేసే రసాయనిక మందులే ఈ యాంటీ బయాటిక్స్. ఇవి మిగిలిన సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. వాటి ప్రభావం 21 రోజుల వరకూ మాత్రమే ఉండాలి. ప్రస్తుత యాంటీబయోటిక్స్ ప్రభావం అంతకు మించి ఉంటున్నాయి. అలాంటి రొయ్యలు తినడంతో మానవ శరీరంలోకి యాంటీబయోటిక్స్ అవశేషాలు ప్రవేశిస్తున్నాయి.
అలాంటి రొయ్యలతో రోగాలు ఫ్రీ
క్లోరామ్‌ఫెనికాల్, ప్యూరాజోలిడాన్ తదితర మందుల వల్ల అప్లాస్టిక్ ఎనిమియా తరహా వ్యాధులు వస్తాయి. జీర్ణకోశంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎముక మూలుగులో రక్త తయారీ ప్రక్రియ నిలిచిపోయి రక్తహీనతకు గురవుతాం. నిషేధిత యాంటీబయోటిక్స్ శరీరంలో ఉంటే మరే మందులు పనిచేయవు. ఒక్కోసారి క్యాన్సర్‌కు దారితీయవచ్చని వైద్య నిపుణులు ఇప్పటికే గుర్తించారు.
అనుమతి లేకుండా..
రొయ్యలకు మేలు చేసేందుకు నీటిలో, మేతలో, చెరువు నేలలో వాడే ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఈ పేరు చెప్పి యాంటీబయోటిక్స్ అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండా హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తితో యాంటీబయోటిక్ అవశేషాలు బయటపడుతున్నాయి. పొలాల్లో పురుగుమందుల వాడకంతో వ్యర్థ జలాలు పంట కాల్వలు, బోదెల్లోకి ప్రవేశించడం, ఆ నీరు రొయ్యల చెరువులకు మళ్లించడంతో కూడా ఈ అవశేషాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు.
ఆక్వా ఉత్పత్తుల పెంపకంలో మొత్తం 20 రకాల యాంటీ బయోటిక్స్‌ను నిషేధించారు.
1. క్లోరామ్‌ఫెనికాల్
2. నెట్రోప్యూరాన్స్, ప్యూరాజోలిడాన్, నెట్రోప్యూరాజోన్, ప్యూరాల్టోడాన్, నెట్రో ప్యూరాన్‌టాయిన్, ప్యూరైల్ ప్యూరామైడ్, నెప్యూరటల్, నెపురోగ్జిమ్, నైఫర్‌ప్రజైన్, వాటి నుంచి వచ్చే ఉత్పాదనలు
3. నియోమైసిన్
4. నాలిడిక్సిక్ ఆసిన్
5. సల్ఫా మిథాక్వోజిల్
6. అరిస్టాలోకియా మొక్కల నుంచి తయారు చేసే మందు
7. క్లోరోఫాం
8. క్లోర్‌ప్రోమజైన్
9. కోల్చిసిన్
10. డాప్సోన్
11. డైమిట్రీ డాజోల్
12. మెట్రోనిడాజోల్
13. రోనిడాజోల్
14. ఇప్రానిడాజోల్
15. ఇతర నైట్రోమిడాజోల్స్
16. క్లెన్ బ్యుటరాల్
17. డైఇథైల్ స్టిల్ బిన్‌స్టిరాల్
18. సల్ఫోనమైడ్
19. ఫ్లోరిక్వినోలోన్స్
20. గ్లైకోపెప్టిడ్స్
Comments
Please login to add a commentAdd a comment