ముగిసిన విరామం నేటినుంచి చేపలవేట
- 981 బోట్లు సముద్రంలోకి
- మత్స్యకారులకు నేటికీ అందని భత్యం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : నెలన్నర రోజుల విరామం అనంతరం సముద్రంలో చేపల వేట జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టే సమయం కావటంతో ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు సముద్రంలో చేపలవేటపై మత్స్యశాఖ నిషేధం విధించింది. నిషేధం సమయం ముగియటంతో మత్స్యకారులు చేపల వేటకు సంసిద్ధులయ్యారు.
38 గ్రామాలు..1.12 లక్షల మంది మత్స్యకారులు...
జిల్లా వ్యాప్తంగా 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. సముద్రతీరంలోని 38 గ్రామాల్లో 1.12 లక్షలమంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. 95 మెకనైజ్డ్ బోట్లతో పాటు 886 మర పడవల ద్వారా సముద్రంలో చేపల వేట ద్వారా వచ్చే ఆదాయమే వారికి ప్రధాన ఆధారం. ఒక రోజు ముందే బయలుదేరిన బోట్లు...
గిలకలదిండి హార్బర్ వద్ద సముద్ర ముఖద్వారం మేట వేయటంతో సముద్రంలోకి మెకనైజ్డ్ బోట్లు వెళ్లి రావటం ఇబ్బందికరంగా మారింది. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రపోటు అధికంగా ఉంటుంది. ఈ నెల 28న అమావాస్య వచ్చింది. అమావాస్య అనంతరం రెండు, మూడు రోజులకు సముద్రపు పోటు తగ్గుతుంది.
ఈ నేపథ్యంలో విదియ రోజునే గిలకలదిండి హార్బర్ నుంచి మెకనైజ్డ్ బోట్లు సముద్రంలోకి వెళ్లాయి. శనివారం మరిన్ని బోట్లు వెళ్లే అవకాశం ఉన్నట్లు బోటు యజమానులు చెబుతున్నారు. సముద్ర తీరంలోని నాగాయలంక, కోడూరు, మోపిదేవి, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి మరో 886 మోటారైజ్డ్(ఫైబర్) బోట్ల ద్వారా చేపల వేటను మత్స్యకారులు కొనసాగిస్తూ ఉంటారు. తీరం నుంచి 15 నాటికల్ మైళ్ల పరిధి వరకు వీరు చేపల వేటను కొనసాగించేందుకు వెసులుబాటు ఉంది. మెకనైజ్డ్ బోటు చేపల వేటకు వెళితే తిరిగి రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. ఫైబర్ బోట్ల ద్వారా చేపల వేట కొనసాగించేవారు వేకువజామున మూడు గంటలకు బయలుదేరి వెళ్లి అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరిగి వస్తారు.
సమాచారం కరువు...
సముద్రంలో చేపల సంచారాన్ని శాటిలైట్ ద్వారా తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. చేపలు, రొయ్యలు సముద్రంలో ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయో శాటిలైట్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని సముద్రంలో చేపలవేట చేస్తున్న మత్స్యకారులకు అందజేయాలి. ఈ ప్రక్రియ అంతగా కొనసాగటం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో మత్స్యశాఖ అధికారులు చేపల వేట కొనసాగించేవారికి ఎస్‌ఎంఎస్ ద్వారా, హ్యామ్ రేడియోల ద్వారా సమాచారం అందించేవారని పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సమాచారం ఇవ్వటం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. గిలకలదిండి హార్బర్, గిరిపురంలలో ఈ సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసినా ఉపయోగం లేకుండాపోయింది.
బియ్యం పంపిణీ లేదు...
వేట నిషేధం సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు జీవనం కోసం ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 31 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. ఈ పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది చేయలేదని మత్స్యకారులు చెబుతున్నారు. చేపలవేట కొనసాగించే మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ముందుకు సాగటం లేదు. గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల చేపల వేట సమయంలో అధికారులు తనిఖీ చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.