పూట గడవదు
సముద్రంలో చేపల వేటకు అడుగడుగునా అడ్డంకులే
పూడిక దశకు చేరుకున్న సముద్రపు మొగ
వేటపై ఈదురుగాలుల ప్రభావం
హార్బర్ వద్దనిలిచిపోయిన బోట్లు
ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
ఇంకా అందని నిషేధకాలపు జీవనభృతి
మచిలీపట్నం సబర్బన్ : సముద్రంలో చేపలు, రొయ్యల వేటకు ఈ ఏడాది అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వేట నిషేధకాలం పూర్తయినా సముద్రంలోకి బోట్లను తీసుకెళ్లి వేట కొనసాగించే వీలు లేకపోవటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రపు మొగ పూడిక దశకు చేరుకోవటం, ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు ప్రధాన కారణంగా వారు చెబుతున్నారు. దాదాపు మూడు నెలలుగా వేట లేకపోవటంతో అందినకాడికి అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడి బోట్లు అక్కడే...
జిల్లాలో సుమారు 80 కిలోమీటర్లు విస్తరించిన సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు 99 మెకనైజ్డ్, 850 మోటరైజ్డ్ బోట్లలో వేట కొనసాగిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఒక్కో మెకనైజ్డ్ బోటుకు 8 నుంచి 10 మంది, మోటరైజ్డ్ బోటుకు 3 నుంచి 5 మంది కళాసీలు పనిచేస్తుంటారు. నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లోని మత్స్యకారులు దాదాపు 4,500 మంది అత్యధికంగా సముద్రంలో చేపల వేటపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి తరతరాలుగా బతుకు బండిని లాగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో మత్స్య సంపద వేటపై నిషేధం కొనసాగింది. జూన్ 15 నుంచి వేటకు ప్రభుత్వ అనుమతి వచ్చినా ప్రకృతి, ప్రభుత్వ సహకారం లేకపోవటంతో ఎక్కడి బోట్లు అక్కడే నిలిచిపోయి కనిపిస్తున్నాయి.
కారణాలు ఇవీ...
→సముద్రంలో 5 నుంచి 10 రోజుల వేటను కొనసాగించే మెకనైజ్డ్ బోట్లు స్థానిక గిలకలదిండి హార్బర్ నుంచి బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా సముద్రంలోకి చేరుకుంటాయి.
→కెనాల్ సముద్రంలో కలిసే ప్రాంతం (మొగ) పూర్తిగా పూడిక దశకు చేరింది.
→గత కొన్నేళ్లుగా పూడికతీత పనులు చేపట్టకపోవటంతో సముద్రపు ఆటుపోటుల ప్రభావానికి మట్టి తీవ్రస్థాయిలో మేట వేసింది.
→బోటు సజావుగా సముద్రంలోకి చేరుకోవటానికి కనీసంగా ఆరడుగుల లోతు ఉండాలి. ప్రస్తుతం మొగ వద్ద సముద్రపు పోటు నీరు వచ్చే సమయంలో నాలుగడుగులు, పాటు సమయంలో రెండడుగులు మాత్రమే ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
→దీని కారణంగా బోటు నీటిలో నడిచేందుకు సహాయంగా ఉండే పంకాలు, చక్రాలు నేలకు తగిలి విరిగిపోతున్నాయని బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
→నెల రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా మోటరైజ్డ్ బోట్లు వేటకు దూరంగా ఉంటున్నాయి.
→మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను మండలాల్లో ఈ బోట్లు అత్యధికంగా ఉంటాయి. మూడు రోజుల పాటు సముద్రంలో వేటను కొనసాగించే ఈ చిన్న బోట్లు రాత్రి సమయంలో బలంగా వీస్తున్న ఈదురు గాలులకు నిలబడలేకపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నామని చెబుతున్నారు.