బోటులో హుషారుగా..
లైఫ్ బోర్ కొడుతోందా.. ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికైనా జాలీగా వెళ్లాలనుకుంటున్నారా.. సముద్రం మధ్యలో వినీలాకాశాన్ని చూస్తూ కొద్ది రోజులు గడపాలనుకుంటున్నారా.. అయితే ఎంచక్కా ఈ బోట్‌లో హాయిగా గడిపేయండి. ఇటలీకి చెందిన జెట్‌క్యాప్సూల్ అనే కంపెనీ ఈ బోట్‌ను తయారు చేసింది. దాదాపు ఇంట్లో ఉండే అన్ని రకాల సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
సముద్రంపై అలా అలా తేలియాడుతున్నట్లు ఈ పడవ వెళుతూ ఉంటుంది. ఎందుకంటే దీని వేగం గంటకు కేవలం 6.5 కిలోమీటర్లే. ఇందులో 215 చదరపు అడుగుల వైశాల్యమున్న ఓ గది ఉంటుంది. వంట గది, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్.. ఇలా మనకు ఎలా అవసరముంటే అలా మార్చేసుకోవచ్చు. సముద్రపు అలల తాకిడికి కదలకుండా నిలకడగా ఉంచేలా ప్రత్యేకమైన లంగరు వ్యవస్థ కూడా ఉంది. ఆఖరికి ఇందులోనే కూరగాయలు పండించుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.