చిరునవ్వులు
ఏటా బడ్జెట్‌కు ముందు ‘ఎకనమిక్ సర్వే’ విడుదలౌతుంది. మర్నాడో, ఆ తర్వాతి రోజో ‘బడ్జెట్’ బయటికి వస్తుంది. గడిచిన ఏడాది ఎలా ఉందన్నది ‘ఎకనమిక్ సర్వే’. ఈ ఏడాది ఎలా ఉండబోతున్నదన్నది ‘బడ్జెట్’. ఈ రెంటినీ కేంద్ర ఆర్థిక శాఖే సమర్పిస్తుంది. విషయం ఇది కాదు. ఎకనమిక్ సర్వే ఫైల్ కవరు ఈసారి లేత గులాబీ రంగులో ఉంది. దాన్ని మహిళా వాదులు ఎలా తీసుకున్నా.. (స్త్రీ, పురుషులు సమానం అయినప్పుడు ‘పింక్’ కలర్‌తో మహిళల్ని ఇండికేట్ చేయడం ఏంటని కొంతకాలంగా వాదన ఒకటి వినిపిస్తోంది)... ప్రభుత్వం మాత్రం స్త్రీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పింక్ లుక్‌తో ఒక సంకేతం పంపింది.
ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ, మొన్నటి ‘ఎకనమిక్ సర్వే’లో ఆర్థిక శాఖ స్త్రీ, శిశు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే మన్ కీ బాత్‌లో మోదీ మంచి ఆకాంక్షలు వ్యక్తపరిస్తే, అందుకు భిన్నంగా ఆ ఆకాంక్షల్ని తుంచేస్తున్న చేదు నిజం ఒకటి ఎకనమిక్ సర్వేలో వెల్లడయింది. మగపిల్లవాడు పుట్టడం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల కారణంగా, వారికి ఇష్టం లేకుండా పుట్టిన ఆడపిల్లల సంఖ్య దేశంలో రెండు కోట్లకు పైగా ఉందట! వీళ్లను ‘అన్ వాంటెడ్’ చిల్డ్రన్ అని సర్వేలో పేర్కొన్నారు. సమాజంలో ఈ ‘అసమాన దృష్టి’ పోవాలని ఎకనమిక్ సర్వే ఆశించింది. ఆ ఆశ నెరవేరే విధంగా రేపటి బడ్జెట్‌లో బాలికల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాలు ఏమైనా ఉంటే బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment