కీలెరిగి వాత | Donald Trump May Face Additional Tariffs Retribution From Various Countries | Sakshi
Sakshi News home page

కీలెరిగి వాత

Published Thu, Jun 20 2019 4:25 AM | Last Updated on Thu, Jun 20 2019 4:25 AM

Donald Trump May Face Additional Tariffs Retribution From Various Countries - Sakshi

ఆయుధాలతో సాగించే యుద్ధాలతో పోలిస్తే వాణిజ్య యుద్ధాలు ప్రారంభంలో పెద్ద సమస్యగా కనబడవు. కానీ వాటిని తేలిగ్గా తీసుకుంటే, మొండి వైఖరితో ముందుకెళ్తే అవి వైషమ్యాలకు దారితీస్తాయి. చివరకు అసలైన యుద్ధాలుగా పరిణమిస్తాయి. చరిత్రలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల వెనకా ఉన్న అనేకానేక కారణాల్లో వాణిజ్య వైరం కీలకమైనది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దీన్ని గ్రహించకుండా ఇష్టానుసారం వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న అదనపు సుంకాలకు ప్రతీకార చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి. మన దేశం సైతం ఇప్పుడు ఆ మార్గాన్నే అనుసరించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, యాపిల్స్, బాదం, ఉక్కు, ఇనుము తదితర 29 ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తూ నిరుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఈ నెల 16 నుంచి అమలు చేయడం ప్రారంభించింది. దాన్ని వెనువెంటనే అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికి 8 దఫాలు వాయిదావేసింది.
(చదవండి : టారిఫ్‌లపై దూకుడు వద్దు!!)

మనం అమెరికాకు ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున ట్రంప్‌ సర్కారు నిరుడు అదనపు సుంకాలు విధించినప్పుడు ఆ నోటిఫికేషన్‌ వెలువడింది. కానీ ట్రంప్‌ వైఖరి మారుతుందన్న భ్రమ వల్ల కావొచ్చు... దాని అమలులో జాప్యం చేసింది. అయిదు దశాబ్దాలుగా మన దేశానికి సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ)కింద కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలని మొన్న మార్చిలో ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశాక ఇక వేచి చూడటం అనవసరమన్న నిర్ణయానికి మన దేశం వచ్చినట్టు కనబడుతోంది. అయితే ఇప్పుడు విధించిన ఈ అదనపు సుంకాల వల్ల అమెరికాకు వచ్చే నష్టం పెద్దగా లేకపోవచ్చు. ఎందుకంటే వీటి విలువ 24 కోట్ల డాలర్లకు మించదు. అమెరికా నుంచి నిరుడు దిగుమతైన సరుకుల విలువ 3,300 కోట్ల డాలర్లకు మించి ఉన్నదని గుర్తిస్తే ఇది ఏపాటి చర్యనో సులభంగానే అర్ధమవుతుంది. 

ట్రంప్‌ ఆలోచనలు విలక్షణమైనవి. అమెరికా ప్రారంభించిన ప్రపంచీకరణ వల్ల నానా అగచాట్లూ పడుతున్నామని  ప్రపంచ ప్రజానీకం అనుకుంటుంటే... ఆయన మాత్రం తమను అలుసుగా తీసుకుని ప్రపంచదేశాలన్నీ ఇన్నాళ్లూ ఇష్టానుసారం ప్రవర్తించాయని, ఎదిగిపోయా యని నమ్ముతుంటారు. అధికారం దక్కితే వాటి ఆట కట్టిస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఆయన పదే పదే చెప్పారు. చివరకు ఆ ఎజెండానే ఆయన అమలు చేస్తున్నారు. కానీ ఇదంతా స్వీయ ఇష్టాయిష్టాలతో ఏకపక్షంగా సాగదు, అవతలి నుంచి కూడా ప్రతీకార చర్యలు మొదల వుతాయని ఆయన గుర్తించలేకపోయారు. నిరుడు జనవరి మొదలుకొని చైనా వివిధ సందర్భాల్లో విధించిన అదనపు సుంకాలు సగటున 20.7 శాతం. అంతక్రితం ఇవి కేవలం 8 శాతం మాత్రమే.

చైనాతో లావాదేవీలు సాగిస్తున్న అనేక అమెరికన్‌ సంస్థలు ఈ ధోరణితో బేజారెత్తుతున్నాయి. చైనాతో వైరం వద్దని ట్రంప్‌కు సలహాలిస్తున్నాయి. అమెరికాపై అది అదనపు సుంకాలు విధిం చడంతో ఆగలేదు. వేరే దేశాల ఉత్పత్తులపై విధించే 8 శాతం సుంకాలను 6 శాతానికి కుదించింది. ట్రంప్‌ యూరప్‌ యూనియన్‌(ఈయూ) దేశాలకు కూడా సుంకాల వాత పెట్టారు. అక్కడినుంచి అమెరికాకు వచ్చే ఉక్కుపై 25శాతం అదనపు సుంకాలు విధించారు. ఒకపక్క బ్రెజిల్‌లో ఆనకట్ట కూలి అక్కడినుంచి రావలసిన ఇనుప ఖనిజం దిగుమతులు తగ్గిపోగా, మరోపక్క అమెరికా విధించిన అదనపు సుంకాలు ఈయూ దేశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ రెండిటికీ తోడు ఈయూలో వాహనాలకు గిరాకీ పడిపోయి, ఆ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బ్రిటన్‌లో రెండో అతిపెద్ద సంస్థ బ్రిటిష్‌ స్టీల్‌ కుప్పకూలింది. మరో పెద్ద సంస్థ ఆర్సెలర్‌ మిట్టల్‌ ఉక్కు ఉత్పత్తిపై కోత విధించుకుంది. అమెరికా చర్యకు ప్రతీకారంగా ఈయూ దేశాలు ఇప్పటికే అక్కడి నుంచి వచ్చే సరుకులపై అదనపు సుంకాలు వడ్డించాయి. ఇంకేం చర్యలు అవసరమో నిర్ణయించడానికి ఈ నెల 26న అవి బ్రస్సెల్స్‌లో సమావేశమవుతున్నాయి.

అమెరికన్‌ సంస్థలన్నీ దేశంలో ఉత్పత్తయ్యే సరుకులు మాత్రమే కొనడం మొదలుపెడితే తయారీ రంగం వృద్ధి చెందుతుందని, అందువల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని ట్రంప్‌ భావిస్తున్నారు. కానీ ఆ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ కూడా ఉంటే తప్ప అవి మనుగడ సాగించలేవని, అందుకు తాను ప్రారంభించిన సుంకాల యుద్ధం అవరోధమవుతున్నదని ఆయన గుర్తించడం లేదు. నిరుడు అదనపు సుంకాల కారణంగా చైనాలో అమెరికా నుంచి వచ్చే చేపలు, రొయ్యలు, పీతలు వగైరా సముద్ర ఉత్పత్తుల గిరాకీ 70 శాతం మేర పడిపోయింది. అదే సమయంలో కెనడాపై సుంకాలు తగ్గించడంతో అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులు రెట్టింపయ్యాయి.

వీటన్నిటినీ గమనించబట్టే ఈ నెల మొదట్లో ట్రంప్‌కు వివిధ రంగాలకు చెందిన 600 అమెరికన్‌ సంస్థలు సుంకాల బాదుడును వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా లేఖ రాశాయి. మెక్సికోపై ఆయన కత్తులు నూరి సుంకాల రణం ప్రారంభించారుగానీ అక్కడి సంస్థల్లో సగానికి పైగా అమెరికన్లవే. అంటే ఆ భారం మోయాల్సింది అమెరికన్‌ పౌరులే.  చైనాపై అమెరికా విధించిన అదనపు సుంకాల విలువ ఇప్పటికే 25,000 కోట్ల డాలర్లు దాటింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై చైనా విధించిన అదనపు సుంకాల విలువ దాదాపు 11,000 కోట్ల డాలర్లు. అంతేకాదు...ఇరాన్‌ నుంచి ముడి చమురు కొనడానికి వీల్లేదని అమెరికా పెట్టిన ఆంక్షల్ని చైనా బేఖాతరు చేసింది. మనం కూడా ఆ తరహాలోనే కఠినంగా వ్యవహరించడానికి సిద్ధపడాలి. జపాన్‌లోని ఒసాకా నగరంలో ఈనెల 28, 29 తేదీల్లో జరగబోయే జీ–20 శిఖరాగ్ర సదస్సులో ట్రంప్‌తో చైనా, ఈయూ దేశాల అధినేతలు సమావేశం కాబోతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆయన్ను కలుస్తారు. ట్రంప్‌ తీరుతెన్నులపై నిర్మొహమాటంగా మాట్లాడితేనే, దీటుగా చర్యకు దిగితేనే ఆయన దారికొస్తారని అధినేతలంతా గుర్తించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement