అభిప్రాయం
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అల్ప ఉద్యోగిత. అర్హత, నైçపుణ్యాలకు తగిన ఉద్యోగానికి బదులు... తక్కువ స్థాయి ఉద్యోగం లభించే స్థితినే అల్ప ఉద్యోగిత అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగానికి కొలమానం. అల్ప ఉద్యోగితకు అనేక కారణాలు ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్‌లో మార్పుల కార ణంగా పాత నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి దొరకదు.
భౌగోళిక అసమానతలు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. లింగ, జాతి లేదా వయస్సు ఆధారంగా చూపే పక్షపాతం వ్యక్తులు తగిన ఉపాధిని పొందకుండా అడ్డుకుంటుంది. కొన్ని రంగాలలో అధిక పోటీ కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులు తమ నైపుణ్యానికి సరి పోయే ఉద్యోగాలను పొందడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త రంగంలోకి మారి తగిన ఉద్యోగాలు సంపాదించాలన్నా... ఆ రంగా నికి అవసరమైన నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది.
అల్ప ఉద్యోగిత వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ నష్టదాయకం. వ్యక్తులు తరచుగా ప్రాథమిక అవసరాలు తీరడానికి కూడా ఖర్చు చేయలేరు. అందువల్ల అప్పుల పాలవుతారు. ఆర్థిక అభద్రతకూ గురవుతారు. అల్ప ఉద్యోగిత ఎక్కు కాలం కొనసాగడం వల్ల వ్యక్తుల నైపుణ్యాలు క్షీణిస్తాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఎక్కువ ఆధారపడటానికి అల్ప ఉద్యోగిత దారి తీస్తుంది. ప్రజా వనరులపై భారం పడుతుంది. ఈ స్థితి ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వ్యక్తుల నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకోలేని కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పాదకత క్షీణించవచ్చు. అల్ప ఉపాధి వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కనుక వస్తు వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
నిరుద్యోగం లాగానే అల్ప ఉద్యోగిత కూడా ప్రపంచ దేశాల సమస్య. దేశాలు, ప్రాంతాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.ముఖ్యంగా స్పెయిన్, గ్రీస్, ఇటలీ దేశాలలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులు తక్కువ జీతాలు పొందుతున్నారు లేదా పార్ట్‌టైమ్ ఉద్యో గాలు చేస్తున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అల్ప ఉద్యోగిత 15–20 శాతం ఉన్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను బట్టి... కేరళలో 10–15%, తమిళ నాడులో దాదాపు 10–20%, గుజరాత్, మహా రాష్ట్రల్లో 10–15% వరకు అల్ప ఉద్యోగిత ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం ఎక్కువగా ఉండి ఉద్యోగాల కల్పన పరిమితంగా ఉన్నందున 20–30% అల్ప ఉద్యోగిత ఉంది. బిహార్‌లో వ్యవ సాయంపై ఆధారపడి ఉండటం, తక్కువ పారిశ్రా మిక వృద్ధి జరగడం వల్ల అక్కడ, బహుశా 30% కంటే ఎక్కువ అల్ప ఉద్యోగిత ఉంది.
అనేక దేశాలు అల్ప ఉద్యోగితను తగ్గించే లక్ష్యంతో కొన్ని విధానాలను అమలు చేశాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కోసం కార్మికులు సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి వృత్తి శిక్షణ–నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడిని ప్రోత్సహించడం అందులో ఒకటి.
ఉద్యోగ భద్రతను పెంచే విధానాలు చేపట్టడం, పని పరిస్థితులను మెరుగు పరచడం, న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం; గ్రాంట్లు, రుణాలు, శిక్షణ ద్వారా చిన్న వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం; పార్ట్ టైమ్ లేదా గిగ్ వర్క్‌కు మద్దతు ఇచ్చే విధానాలు రూపొందించడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అల్ప ఉద్యోగితను పరిష్కరించడానికి తరచుగా నైపుణ్యాల శిక్షణ, ఆర్థిక మద్దతు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే బహు ముఖ విధానం అవసరం. ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకుంటే కొంత పరిష్కారం లభిస్తుంది.
డా‘‘ పి.ఎస్. చారి
వ్యాసకర్త బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మొబైల్: 83090 82823
Comments
Please login to add a commentAdd a comment