China Communist Party
-
డ్రాగన్ నుంచి షిఫ్ట్ అవ్వాలనే యోచనలో దిగ్గజ సంస్థలు.. ఎందుకంటే..
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా తర్వాత చైనా జీరో కొవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో అక్కడి కంపెనీల్లో ఉత్పత్తి కుంటుపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో తయారీ రంగంలో డ్రాగన్‌కు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలు ముందుకొచ్చాయి. ఈ విషయంలో విదేశీ సంస్థలకు భారత్ మెరుగైన గమ్యస్థానంగా కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో భాగంగా తన విధానాల నుంచి వెనక్కు మళ్ళేది లేదని పలుమార్లు జిన్‌పింగ్ కరాఖండీగా చెప్పారు. మానవ వనరులు అధికంగా ఉండటంతో ప్రపంచంలోని వేలాది కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేశాయి. 2020లో వుహాన్‌లో కరోనా వ్యాప్తి చెందిన తరవాత దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు స్తంభించిపోయాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టిన తరవాత ప్రపంచ దేశాల్లో వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగింది. చైనాలో జీరో కొవిడ్ లాక్డౌన్ల వల్ల వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయి, సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచానికి చైనా ఉత్పత్తి కేంద్రంగా మారింది. డ్రాగన్ అనుసరిస్తున్న విధానాలు దానికి ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలను ముందుకు తెచ్చాయి. ఆ ప్రయత్నాల్లో భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ ముందున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఇప్పటికే తన విధానాలను భారత్ సవరించింది. ఇండియాలో 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవడంలో వియత్నాం నుంచి భారత్‌కు తీవ్ర పోటీ ఉంది. భౌగోళికంగా చైనాకు వియత్నాం చాలా చేరువలో ఉంది. పెద్దగా ఖర్చు లేకుండానే కర్మాగారాలను అక్కడకు తరలించవచ్చు. అయితే, వియత్నాంలో మౌలిక వసతుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. మౌలిక వసతుల విషయంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఏటా దేశంలో జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. దిల్లీ-ముంబయిల మధ్య నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ రహదారి, సరకులను తరలించే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గాలు, దేశ తీర ప్రాంతాల్లోని ఓడరేవులు..ఇలా పలు సంస్థలు మన దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనువుగా ఉన్నాయి. మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం చైనాలోని కొన్ని విభాగాలను భారత్‌కు తరలించాలని యోచిస్తోంది. 2025 కల్లా 25శాతం ఐఫోన్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ యోచిస్తుంది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వారికి అందించాలన్న చట్టంపై కొన్ని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మానవవనరుల పరంగా ఇప్పటికే భారత్ చైనాను దాటేసిందని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లోని ముఖ్యపట్టణాలతో పాటు ఇతర నగరాలను కలుపుతూ రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. వెరసి ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు భారత్‌వైపు చూసేందుకు ప్రధానకారణం అవుతుంది. -
చైనా ప్రధానిగా కియాంగ్
బీజింగ్: చైనా ప్రధానిగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడైన లీ కియాంగ్ (63) నియమితులయ్యారు. పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) తీసుకున్న ఈ నిర్ణయానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ఈ మేరకు లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. లీ పేరును జిన్‌పింగ్ స్వయంగా ప్రతిపాదించారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం విశేషం! మొత్తం 2,936 మంది ఎన్పీసీ సభ్యుల్లో ముగ్గురు లీకి వ్యతిరేకంగా ఓటేయగా మరో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం లీ నియామక ఉత్తర్వులపై జిన్‌పింగ్ సంతకం చేశారు. ఆ వెంటనే ప్రస్తుత ప్రధాని లీ కీ కియాంగ్ నుంచి లీ బాధ్యతలను స్వీకరించారు. ఒడిదుడుకులమయంగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే గురుతర బాధ్యత ఆయన భుజస్కందాలపై ఉంది. అందుకు చేపట్టబోయే చర్యలను మార్చి 13న మీడియా సమావేశంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు. లీకి వ్యాపారవేత్తల పక్షాన నిలుస్తారని పేరుంది. తాజా మాజీ ప్రధాని లీ కి కియాంగ్‌కు కొన్నేళ్లుగా జిన్‌పింగ్‌తో దూరం పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు అధ్యక్ష పీఠానికి పోటీదారుగా నిలిచిన ఆయన ప్రధానిగా తన అధికారాలకు జిన్‌పింగ్ పూర్తిగా కోత పెట్టడంపై అసంతృప్తిగా ఉన్నారు. పదవి నుంచి వైదొలగిన ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతున్నారు. -
చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే!
బీజింగ్: చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ అక్టోబర్ 16 నుంచి 22 వరకు జరగనుంది. మరో ఐదేళ్లకు అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 2,296 మందికిపైగా ప్రతినిధులు ఆదివారం ప్రారంభమయ్యే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టి చరిత్ర సృష్టించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లకోసారి జరిగే సీపీసీ సదస్సు ఆదివారం ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవం అనంతరం అధ్యక్షుడు జిన్పింప్ ప్రసంగించనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రానున్న ఐదేళ్లకు రోడ్‌మ్యాప్‌ను వివరించనున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా అరుదైన ఘనత సాధిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సదస్సును కఠినమైన కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రెండు రోజుల పాటు కోవిడ్ బబుల్‌లో ఉండాలి. చదవండి: బొగ్గ గనిలో పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య -
ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా.. వందల కోట్లు కట్టాల్సిందే...!
చైనాలో సెలబ్రిటీలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారిపై ఆంక్షలు విధిస్తూ వేధిస్తుంది. ఇంతకీ అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎందుకు అలా చేస్తుంది..? చర్యలతో ఏం సాధించాలని చూస్తుంది..? చైనా కమ్యూనిజానికి మించి అక్కడి సెలబ్రిటీలు పాపులర్ కావడం సహించలేక పోతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలబ్రిటీలపై గుర్రుగా ఉంది. వారిపై కొత్త ఆంక్షలు విధించి వేధిస్తుంది. సోషల్ మీడియాలో వారి సంపద, లైఫ్‌స్టైల్ పై గొప్పలు చెప్పకుండా నిషేధం విధించింది. అందుకే సెలబ్రిటీ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు కొత్తరూల్ తెచ్చినట్లు సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా తెలిపింది. సెలబ్రిటీ కల్చర్ చాలా ప్రమాదం.. సెలబ్రిటీ కల్చర్, సంపాదించాలనే అత్యాశ పాశ్చాత్య దేశాలకు చెందిందని, అది ప్రమాదకర అంశం అనేది చైనా ప్రభుత్వ బావన. ఇదే చైనా దేశ కమ్యూనిజానికి ముప్పు తెస్తుందనేది వారి వాదన. అందుకే సెలబ్రిటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. కొందరి సెలబ్రిటీలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చి కదలికలను కనిపెడుతోంది.అంతేకాదు ట్యాక్స్‌లు ఎగ్గొట్టారంటూ అక్రమ కేసులు బనాయించి..సెలబ్రిటీలకు భారీగా జరిమానా విధిస్తుంది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తుంది. వారి వాదనలు ప్రజల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. వెబ్సైట్ల నుంచి సెలబ్రిటీల వీడియోల్ని తొలగించి వారిని ఫ్యాన్స్‌కి దూరం చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే జెంగ్ షువాంగ్ ఉదంతం. 2009లో తైవాన్ టీవీ సీరిస్ 'మేటర్ షవర్' (Meteor Shower) రీమేక్ తో 'జెంగ్ షువాంగ్' బుల్లితెరకు పరిచయమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె చైనా దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలబ్రిటీలలో తొలిస్థానంలో ఉంది. మిగిలిన సెలబ్రిటీల కంటే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగే ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. డ్రాగన్ కంట్రీ సెలబ్రిటీలపై తెచ్చిన కొత్త చట్టం జెంగ్ షువాంగ్ను ఆకాశం నుంచి అథఃపాతాళానికి..చేర్చింది. చైనా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నటిపై చర్యలు తీసుకుంది. ఆమె పన్నులు చెల్లించడం లేదనే కారణంతో ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రూ.337 కోట్లు జరిమానా విధించి, చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ రెగ్యూలేటర్ టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను నిలిపివేసింది. నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వరాదని డ్రాగన్ కంట్రీ హెచ్చరికులు జారీ చేసింది. చదవండి: చైనా మీదే జోక్.. భారీ డ్యామేజ్ భయంతో ముందే క్షమాపణలు! -
చైనాపై జోక్.. నోరు జారి నాలిక కర్చుకున్నాడు
JPMorgan CEO Comments On China: ‘కమ్యూనిస్ట్ పార్టీ కంటే మా బ్యాంక్ దీర్ఘకాలం కొనసాగుతుంది.. కావాలంటే పందెం’ అంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ ఆపై నాలిక కర్చుకున్నాడు. భారీ నష్టం జరగక ముందే తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మంగళవారం బోస్టన్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్లో డిమోన్ మాట్లాడుతూ.. నేను హాంకాంగ్‌లో ఉన్నా. అప్పుడు ఓ జోక్ చేశా. కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సంబురాలు చేస్తోంది. జేపీ మోర్గాన్ కూడా అంతే. కానీ, మేం వాళ్ల (కమ్యూనిస్ట్ పార్టీ) కంటే ఎక్కువ కాలం ఉంటామని పందెం కాస్తాను. ఇదే మాట నేను చైనాలో చెప్పలేను. అయినా వాళ్లు నా మాటలు వింటున్నారు’’ అంటూ మంగళవారం బోస్టన్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైన జేపీ మోర్గాన్ చేజ్.. ఆగష్టులో చైనా రెగ్యులేటరీ నుంచి నుంచి సెక్యూరిటీ బ్రోకరేజ్‌కు అనుమతులు దక్కించుకుంది. తద్వారా చైనా నేలపై ఆధిపత్యం ఆలోచనకు అడుగేసింది. ఈ తరుణంలో డిమోన్ తాజా వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు కమ్యూనిస్ట్ పార్టీని ఆగ్రహానికి గురి చేయడంతో పాటు చైనాలో అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ కొంప ముంచే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అయ్యింది. అందుకే 18 గంటలు గడవకముందే డిమోన్ క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. దీంతో వ్యవహారం సర్దుమణిగినట్లేనని అంతా భావిస్తున్నారు. మరోవైపు డిమోన్‌కు ఇలా నోరు జారడం కొత్తేం కాదు. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మీదే ఏకంగా కామెంట్లు చేశాడు. ట్రంప్ కంటే తానే దమ్మునోడినని, అవకాశం ఇస్తే ఎన్నికల్లో ఓడించి తీరతానని కామెంట్లు చేశాడు. ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని క్షమాపణలు చెప్పాడు. చదవండి: జేపీ మోర్గాన్ వర్సెస్ ఎలన్ మస్క్.. సిల్లీ కామెడీ! -
చైనా బరితెగింపు..! వారికి మాత్రం చుక్కలే..!
Tech Giants Fined By China: చైనాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలకు జిన్ పింగ్ ప్రభుత్వం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గుత్తాధిపత్యాన్ని అరికట్టే సాకుతో పలు కంపెనీలపై అక్కడి ప్రభుత్వం బరితెగింపు వ్యవహారాలకు పాల్పడుతోంది. తాజాగా చైనాకు చెందిన కంపెనీలపై భారీ జరిమానాను విధించింది. చైనా టెక్ దిగ్గజం జాక్ మాకు చెందిన ఆలీబాబా, టెన్సెంట్‌హోల్డింగ్స్‌పై భారీ జరిమానాను అక్కడి ప్రభుత్వం వేసింది. వీటితో పాటుగా జేడీ.కామ్, బైడూ వంటి దిగ్గజ కంపెనీలు కూడా జరిమానా విధించిన జాబితాలో ఉన్నాయి. చదవండి: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..! అందుకే జరిమానా వేసాం..! టెక్ దిగ్గజ కంపెనీలపై భారీ జరిమానాను విధించడాన్ని అక్కడి ప్రభుత్వం సమర్థించుకుంది. ఆయా కంపెనీల గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకే చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్, జేడీ. కామ్ లాంటి ఇతర టెక్ కంపెనీలు 8 ఏళ్ల క్రితం వరకు చేపట్టిన 43 సంస్థల కొనుగోళ్లను గోప్యంగా ఉంచాయని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేటర్ వెల్లడించింది. ఆయా కంపెనీలకు చైనా యాంటీ మోనోపలీ చట్టం క్రింద సుమారు 58 లక్షల వరకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. కొత్తేమీ కాదు..! టెక్ దిగ్గజ కంపెనీలపై చైనా కొరడా ఝుళిపించడం కొత్తేమి కాదు. గత ఏప్రిల్‌లో వివిధ చట్టాల ఉల్లంఘనల పేరిట అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కొన్ని రోజులపాటు జాక్ మా కన్పించకుండా పోయారు. గత ఏడాది కాలంఓ 344 బిలియన్ డాలర్ల భారీ నష్టాని జాక్ మా కంపెనీలు మూటగట్టుకున్నాయి. చదవండి: సుజుకీ అవెనిస్ 125 స్కూటర్ ఆవిష్కరణ -
జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో
Alibaba CEO Jack Ma Missing Story: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు! అలాగే ఏదైనా ఒక్క పొరపాటు, లేదా నిర్ణయం కూడా మనిషిని అమాంతం అగాధంలోకి నెట్టేయవచ్చు... ఈ–కామర్స్ కుబేరుడు ‘జాక్–మా’ విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ... కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను... కలవాలని బుద్ధి పుట్టడం కాస్తా అతని పాలిట శాపమైంది... ‘జాక్–మా’ ప్రాభవాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా... కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే.. ఎక్కడున్నాడో... ఏమైపోయాడో? తెలియనంతగా జాక్–మా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఉక్కుపిడికిలిలో చిక్కిన ఉడుతలా విలవిల్లాడిపోయాడు. ఏమా కథ కమామిషు!!! సరిగ్గా ఏడాది క్రితం నాటి మాట. అలీబాబాతో అప్పటికే ఈ కామర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన జాక్–మా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఐపీవోకు వెళుతన్న సమయం అది. ‘ఆల్ ఈజ్ వెల్’ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆకస్మాత్తుగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అలీబాబా సామ్రాజ్యంపై పంజా విసిరింది. రాత్రికి రాత్రి జాక్–మా రెక్కలు కత్తిరించేసింది. ఆ తరువాత జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో కొంత కాలం పాటు ఎవరికీ తెలియలేదు. జైలు నిర్బంధంలో ఉన్నాడని కొందరు, దేశం వదిలి పోయాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు కానీ.. వాస్తవం ఏమిటో జాక్–మా, చైనా ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసు. సుదీర్ఘ విరామం తరువాత జాక్ తొలిసారి కొన్ని రోజుల క్రితం యూరప్‌లో మళ్లీ ప్రత్యక్షమవడం అతడి ఆంట్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టినవారికి ఎంతో ఉత్సాహం కలిగించింది. యూరప్‌లో జాక్ తాజా వ్యాపకం ఏమిటో తెలుసా? ఉద్యానవన పంటలు పండించడం అట! అంతా బాగానే ఉంది కానీ... ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్న ఈ ఈకామర్స్ రాజు రాత్రికి రాత్రి అధఃపాతాళానికి ఎలా పడిపోయాడు? ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకోవాలంటే... నాలుగేళ్ల వెనక్కు వెళ్లాలి. ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో జాక్–మా చైనా నవతరం ప్రతినిధి. అప్పట్లో జాక్–మా ప్రాభవం అంతా ఇంతా కాదు. చైనా తరఫు దౌత్యవేత్త స్థాయిలో ఉండేవాడు. తెరవెనుక ఏం జరిగిందన్నది మనకు తెలియకపోయినా ఓ శుభ ముహూర్తంలో ఈయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికై అధికార బాధ్యతలు చేపట్టాల్సిన డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 2017లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో జనవరి తొమ్మిదిన ట్రంప్‌తో సిట్టింగ్ వేయడమే కాకుండా.. ఓ పదిలక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చేస్తానని భరోసా కూడా ఇచ్చేశారు. అంత పెద్ద వాణిజ్యవేత్త కదా.. ఉద్యోగాలు కల్పిస్తే ఏమిటి తప్పు? అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఉంది మతలబు. జాక్ – మా హామీలు మాత్రమే కాదు.. ట్రంప్‌తో అతడి సమావేశంపై చైనా ప్రభుత్వానికి వీసమెత్తు అవగాహన లేదు. ట్రంప్‌తో సమావేశం జరిగిన కొన్ని రోజులకు అలీబాబా ప్రధాన కార్యాలయం లాబీలో జాక్–మా నిర్వహించిన పత్రికా సమావేశం ద్వారా ఇతరులతోపాటు చైనా ప్రభుత్వానికీ ఈ సంగతులన్నీ తెలిశాయి! ఇది ప్రభుత్వ పెద్దలకు అంతగా రుచించలేదు. ఇరుపక్షాల మధ్య వైరానికి బీజం పడింది ఇక్కడే! అప్పటికే ఉప్పు.. నిప్పు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన నేపథ్యంలో అతడు అధ్యక్ష పదవి చేపట్టే నాటికే ట్రంప్‌కు, చైనాకు మధ్య వ్యవహారం ఉప్పు–నిప్పు చందంగానే ఉండింది. ఆ దశలో జాక్–మా, ట్రంప్‌ల మీటింగ్ జరగడంతో సమస్య మొదలైంది. ఆ తరువాత కూడా జాక్– మా 2018– 2020 మధ్యలో పలువురు దేశాధ్యక్షులు, ఉన్నతాధికారులను కలుస్తుండటం జిన్ పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వానికి అంతగా రుచించలేదు. గత ఏడాది అక్టోబరులో జాక్ – మా ఓ ఉపన్యాసం చేస్తూ.. చైనాలో సృజనాత్మకతను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడంతో వ్యవహారం ముదిరింది. నవంబరు 5న జాక్–మా ఐపీవో ఉండగా రెండు రోజుల ముందే దాన్ని రద్దు చేశారు. బోర్డును రద్దు చేసి పునఃవ్యవస్థీకరించాలని చెప్పడంతోపాటు మా కంపెనీలపై దాడులు మొదలయ్యాయి. పలు అక్రమాలు జరిగాయంటూ మా చేత ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 275 కోట్ల డాలర్ల జరిమానా కట్టించుకున్నారు. ఒకానొక దశలో జాక్–మా దాదాపు మూడు నెలలపాటు అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. మారిపోయిన సీన్... చైనా ప్రభుత్వం దాడుల తరువాత జాక్ – మా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో ‘మా’ జిన్‌పింగ్‌కు ఒక లేఖ రాస్తూ.. జీవితాంతం చైనా గ్రామీణుల విద్యాభివృద్ధికి కేటాయిస్తానని, కనికరించమని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత నెలలో జాక్–మా కే చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక మా వ్యవసాయ, పర్యావరణ సంబంధిత అధ్యయనం కోసం యూరప్ వెళుతున్నారని ప్రకటించడంతో ఆయన ఉనికి మళ్లీ ప్రపంచానికి తెలిసింది. వారం రోజుల క్రితం మా ఓ పూలకుండీతో ఫొటో కనిపించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటినిచ్చిందని అంటున్నారు. జాక్–మా భాగస్వామిగా, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జోసెఫ్ సి త్సాయి జూన్ నెలలో సీఎన్‌బీసీ టీవీతో మాట్లాడుతూ... ‘‘జాక్–మా తో రోజూ మాట్లాడుతున్నాను. అతడికేదో అపారమైన అధికారం ఉందని అనుకుంటున్నారు. అదేమంత నిజం కాదు. అతడూ మనందరి మాదిరిగానే ఓ సామాన్య వ్యక్తి’’ అనడం కొసమెరుపు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి?
బీజింగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన అరుదైన హెచ్చరిక, అక్కడి ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. దీంతో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వాణిజ్యశాఖ సోమవారం ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో అనుమానాలకు కారణమయింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) -
ఒక స్వప్నం... ముగ్గురు మొనగాళ్లు
‘‘ఈ శిశిరం వాకిట ఒంటరిగా నిలబడి ఎన్నెన్నో మనోహర దృశ్యాలను చూస్తున్నాను. ఈ శిశిరంలో ఒంటరిగానే ఎన్నెన్నో వసంత స్వప్నాలను కంటున్నాను’’. చైనాలో విప్లవానికి నాయ కత్వం వహించి కమ్యూనిస్టు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మావో జెడాంగ్ గొప్ప తాత్వికుడు, వ్యూహకర్త, నాయకుడు మాత్రమే కాదు.. గొప్ప కవి, రచయిత, స్వాప్నికుడు కూడా! చదువు పూర్తయిన తర్వాత పెకింగ్ (బీజింగ్) విశ్వవిద్యాల యంలో కొంతకాలం లైబ్రరీ అసిస్టెంట్‌గా మావో పనిచేస్తాడు. అక్కడ తన బాస్‌గా ఉన్న జెన్డుషీ ప్రభావంతో కమ్యూనిస్టుగా మారతాడు. అక్కడి నుంచి తిరిగి తన సొంత రాష్ట్రం హునాన్‌కు వచ్చినప్పుడు సియాంగ్ నదిలోని ఆరెంజ్ ద్వీపానికి వెళ్తాడు. అక్కడ కదలాడిన మనోభావాలతో రాసిన కవిత ఇది. ఇందులో ఆయన కల మెదులుతుంది. ఆ కలలో ఆకాశం కింద స్వేచ్ఛ కోసం పరితపించే లక్షలాది జీవులు కనబడతాయి. కవితలోని భావాలకు రెక్కలు తొడిగి మావో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తాడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి ఇప్పుడు వందేళ్ల వయసు. మొన్ననే ఘనంగా శతవార్షికోత్సవం జరిగింది. చైనా కమ్యూ నిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు, మిలటరీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న షీ జిన్‌పింగ్ ఏం మాట్లాడుతాడోనని ప్రపంచం ఎదురు చూసింది. ఎందుకంటే, చైనా ఇప్పుడు అల్లాటప్పా దేశం కాదు. అగ్రరాజ్య హోదా కోసం అమెరికాను సవాల్ చేసే స్థితికి ఎదిగిన దేశం. అనేక అభివృద్ధిరంగాల్లో అది ఇప్పటికే అమెరి కాను దాటేసింది. కమ్యూనిస్టు చైనాకు నాయకత్వం వహించిన ఐదు తరాల నాయకశ్రేణుల్లో మావో, డెంగ్‌ల తర్వాత అంతటి అధికారాన్ని చలాయిస్తున్న మూడో వ్యక్తి షీ. అందువల్ల ఆయన చెప్పే మాటలకు ప్రపంచ ప్రాధాన్యత ఏర్పడింది. సరిగ్గా పదేళ్ల కిందట చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ) ప్రధాన కార్యదర్శి పదవిని షీ జిన్‌పింగ్ చేపట్టాడు. చైనా స్వప్నాన్ని (చైనా డ్రీమ్) సాకారం చేయడమే తన లక్ష్యమని బాధ్యతలు స్వీకరించగానే షీ ప్రకటించాడు. చైనా జాతీయ పునరుజ్జీవనమే చైనా స్వప్నంగా ఆయన ప్రకటించుకున్నారు. అందులో భాగంగా రెండు ‘శతాబ్ది’ లక్ష్యా లను పెట్టుకున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు నిండే నాటికి (2021) చైనా సమాజం అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించామని మొన్నటి శతవార్షిక సభలో షీ ప్రకటించాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి శతాబ్ది కాలం నిండే నాటికి (2049) చైనాను అగ్రరాజ్యంగా, ఆధునిక సోషలిస్టు దేశంగా రూపుదిద్దడం రెండవ లక్ష్యం. ఈ దిశగా తమ ప్రయాణం కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు. చైనా డ్రీమ్ అనే నినాదాన్ని షీ జిన్‌పింగ్ బాగా ప్రచారం లోకి తెచ్చారు. కానీ ఈ డ్రీమ్‌కు నూటా యాభయ్యేళ్ల చరిత్ర ఉన్నది. చైనాకు రమారమి నాలుగు వేల సంవత్సరాల చారిత్రక వార సత్వ సంపద ఉన్నది. ఈ విశ్వం మొత్తానికి చైనా కేంద్రస్థానంలో ఉన్నదని పూర్వపు రోజుల్లో చైనా ప్రజలు గట్టిగా నమ్మేవారు. మిగిలిన రాజ్యాలన్నీ ఉపగ్రహాల వంటివని అభిప్రాయపడే వారు. రోమన్ సామ్రాజ్యం ఆవిర్భవించడానికి రెండువేల ఏళ్లకు పూర్వమే చైనాలో చిన్ వంశస్తులు మొదటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యూరప్‌లో పారిశ్రామిక విప్లవం ప్రభవించి వలస రాజ్యాలు ఏర్పడేంతవరకు ప్రపంచంలో సంపన్న దేశంగా చైనా కొనసాగింది. చరిత్ర క్రమంలో వివిధ దేశాల జీడీపీని శాస్త్రీయంగా లెక్కగట్టిన ఆంగస్ మాడిసన్ అంచనా ప్రకారం 16–17 శతాబ్దాల నడుమ ప్రపంచ దేశాల ఉమ్మడి జీడీపీలో 33 శాతం వాటా ఒక్క చైనాదే. వేలయేళ్ల కిందటనే అంతర్జాతీయ వర్తకం కోసం గోబీ ఎడారులు, టిబెట్ పీఠభూములు, సెంట్రల్ ఆసియా దేశాల మీదుగా యూరప్ ఖండం వరకు సిల్కు రోడ్డును చైనా వేసుకున్నదని చరిత్ర చెబుతున్నది. ఈ కారణాల రీత్యా ఆనాటి చైనా ప్రజలకుండే గర్వం నిర్హేతుకమైనది కాదని తేలుతున్నది. చైనా ప్రజల గర్వాన్ని, ఆత్మగౌరవాన్ని యూరప్ వలస పాలకులు దెబ్బతీశారు. చైనాను పరిపాలించిన చివరి రాజ వంశం పేరు చింగ్. వీరు హన్ జాతీయులు కాదు. మంచూ తెగ వారు. చైనాలో హన్ జాతీయుల జనాభా చాలా ఎక్కువ. ఇండియాలో హిందువుల జనాభా శాతం కంటే కూడా ఎక్కువ. కానీ, చింగ్ వంశీయుల పాలనలోనే చైనా సరిహద్దులు బాగా విస్తరించాయి. పందొమ్మిదో శతాబ్దపు తొలిరోజుల్లో చైనాలోని ఉన్నతాధికారులకు బ్రిటిష్ వలస పాలకులు నల్లమందును అలవాటు చేశారు. ఇది క్రమంగా జనంలోకి పాకింది. నల్ల మందు అక్రమ రవాణాను అరికట్టడానికి చింగ్ పాలకులు చర్యలు చేపట్టారు. ఆగ్రహించిన బ్రిటిష్‌వారు చైనాతో యుద్ధా నికి దిగారు. తర్వాత కాలంలో ఫ్రాన్స్ కూడా బ్రిటన్‌కు జత కలిసింది. చైనా మీద రెండుసార్లు యుద్ధాలు (ఓపియమ్ వార్స్) చేశారు. చింగ్ రాజవంశ నైతిక బలాన్ని దెబ్బతీశారు. ఎనిమిది యూరప్ దేశాలు కలిసి చైనాపై ‘బాక్సర్’ యుద్ధాలు చేశాయి. మంచూరియా ప్రాంతాన్ని జపాన్ ఆక్రమించింది. చైనాపై అవమానకరమైన షరతులు విధించారు. చైనా సమాజంలోని విద్యావంతులు, ఉన్నత వర్గాల ప్రజలు కుమిలిపోయారు. తమ దేశం పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలని కలలుగన్నారు. ‘చైనా డ్రీమ్’ అప్పుడే మొద లైంది. చైనాలో జాతీయోద్యమం ప్రారంభమైంది. మంచూ జాతీయులైన చింగ్ రాజవంశంపై తిరుగుబాటు ప్రారంభ మైంది. సన్‌యట్‌సేన్ నాయకత్వంలో కుమిటాంగ్ పార్టీ జాతీయ వాదులతో కలిసి రాజరికాన్ని కూలదోసింది. జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలోనే ఓ పదిహేడేళ్ల యువ కుడు తన పొడవాటి జుట్టును కత్తిరించి నిరసన వ్యక్తం చేశాడు. చింగ్ రాజుల ఏలుబడిలో పురుషులు కూడా జుట్టును పెంచు కోవాలి. ఈ శాసనాన్ని ఆ యువకుడు ధిక్కరించాడు. అతడి పేరు మావో జెడాంగ్. చైనాడ్రీమ్ను సాకారం చేయడానికి వేట అక్కడే మొదలైంది. మావో జెడాంగ్ ఓ రైతుబిడ్డ. పెద్ద ఆకతాయి. కుదురుగా ఉండే రకం కాదు. పదమూడేళ్లు నిండేసరికి అతికష్టంగా ఐదో క్లాసు ముగించాడు. ఇక లాభం లేదని వాళ్ల నాన్న పొలం పనిలో పెట్టాడు. అక్కడా కుదురుకోలేదు. హునాన్ ముఖ్యపట్టణమైన చాంగ్షా మిడిల్ స్కూల్లో చేర్చారు. అక్కడ ఏడాదిలో నాలుగు స్కూళ్లు మారాడు. కానీ లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు. ఆ వయసులోనే ఆడమ్ స్మిత్, మాంటెస్క్యూ, డార్విన్, జాన్ స్టూవర్ట్‌మిల్, రూసో, స్పెన్సర్ల క్లాసిక్స్‌ను చది వేశాడు. ఈ లైబ్రరీ పిచ్చితో పెకింగ్ యూనివర్సిటీ లైబ్రరీలో గుమాస్తాగిరి ఉద్యోగంలో చేరాడు. అక్కడ జెన్డూషీ పరిచయం మావోను కమ్యూనిస్టుగా మార్చింది. చైనాలో పేరుకు జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, దేశమంతటా అరాచకం రాజ్యమేలింది. వార్ లార్డ్‌ల ఆధిపత్యం కింద దేశం ముక్కచెక్కలుగా చీలిపోయింది. ఈ దశలో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో విజేతలందరూ పారిస్‌లోని వెర్సయిల్ రాజప్రాసాదంలో (versailles treaty) వాటాలకోసం సమావేశమయ్యారు. ఇక్కడా చైనాకు అవమా నమే ఎదురైంది. జపాన్‌కు పెద్దమొత్తంలో నష్టపరి హారం చెల్లిం చాలని చైనాను ఆదేశించారు. చైనా హృదయం మళ్లీ గాయ పడింది. ఈ సమయంలోనే 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. సొంతరాష్ట్రం హునాన్‌లో పార్టీ పనిని మావో ప్రారం భిస్తాడు. మార్క్సిస్టు మూల సిద్ధాంతాల ప్రకారం పట్టణాల్లోని కార్మిక వర్గం విప్లవానికి నాయకత్వం వహించాలి. కానీ చైనాలో అది కుదిరేపని కాదని మావో భావించారు. పెద్దసంఖ్యలో ఉన్న రైతులను సమీకరించి తిరుగుబాటు చేయాలని భావించాడు. మావో అంతరంగంలో కమ్యూనిస్టు ఎంత బలంగా ఉన్నాడో... జాతీయవాది కూడా అంతే బలంగా ఉండేవాడు. గతించిన చైనా వైభవాన్ని గురించి కథలు కథలుగా రైతులకు చెప్పేవాడు. వారిని సమీకరించి చింకాంగ్ కొండల్లో స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. చైనా డ్రీమ్ మావోను నిరంతరం వెన్నాడుతూనే ఉండేది. ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని’ ప్రకటించాడు. ఈ వాక్యం అనంతరకాలంలో డజన్లకొద్ది దేశాల్లో చేగువెరా సహా లక్షలాదిమంది యువకుల చేత తుపాకీ పట్టిం చింది. స్త్రీల సమస్యల గురించి ఆలోచిస్తూ ఆకాశం కేసి చూసి ‘మహిళలు ఆకాశంలో సగభాగం’ అన్నాడు. ఈనాటికీ మహిళా ఉద్యమాల రణన్నినాదం ఇదే. యుద్ధ వ్యూహాలతో రాటుదేలిన మావో చైనా కమ్యూనిస్టు పార్టీకి అగ్రనేతగా ఎదిగాడు. చరిత్ర ప్రసిద్ధిచెందిన లాంగ్ మార్చ్ వ్యూహకర్త ఆయనే, సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన నాయకత్వంలోనే చైనా విప్లవం విజయవంతమై 1949లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. రాజవంశాల పరిపాల నలో నామమాత్రపు అధికారం మాత్రమే ఉన్న టిబెట్, షింజి యాంగ్, మంగోల్ ప్రాంతాలను పూర్తిగా చైనా అధీనంలోకి తెచ్చుకున్నారు. భౌగోళిక– రాజకీయ సుస్థిరత ఏర్పడింది. చైనా డ్రీమ్‌లో మొదటిభాగం ముగిసింది. ఇంకా రెండు భాగాలు న్నాయి. ఒకటి: ఆర్థికాభివృద్ధిని సాధించడం; రెండు: అగ్ర రాజ్యంగా వెలుగొందడం. ఈ లక్ష్యాలను కూడా వేగంగా సాధిం చాలన్న తొందరలో మావో చేసిన తప్పులకు చైనా భారీ మూల్యం చెల్లించింది. వ్యవసాయ– పారిశ్రామిక ఉత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచడం కోసం ప్రారంభించిన గొప్ప ముందడుగు (great leap forward) ఉద్యమం విఫలమైంది. లక్షలాదిమంది ఆకలి చావులకు బలయ్యారు. దీన్ని కప్పిపుచ్చు కోవడానికే మావో సాంస్కృతిక విప్లవం (Cultural revolution)ను ప్రారంభించారని విమర్శకుల అభిప్రాయం. మావో వైఫల్యాలను ప్రశ్నించిన వారందరూ ఈ కాలంలో శిక్షలకు గురయ్యారు. చైనా డ్రీమ్‌లో రెండో లక్ష్యాన్ని చేరకుం డానే మావో కన్నుమూశారు. డెంగ్ సియావో పింగ్ కూడా రైతుబిడ్డే. ఫ్రాన్స్‌లో చదువు కున్నాడు. అక్కడే కమ్యూనిజానికి ఆకర్షితుడయ్యాడు. మావోతో కలిసి లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నాడు. చైనా అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున క్రియాశీల పాత్ర పోషించాడు. టిబెట్‌ను ‘దారికి తెచ్చే’ బాధ్యతను ఈయనే నిర్వహించాడు. కల్చరల్ రివల్యూషన్ కాలంలో మావో జెడాంగ్ ఆగ్రహానికి గురయ్యాడు. కానీ జౌఎన్‌లై చలవతో మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కించు కున్నాడు. మావో మరణానంతరం పార్టీ మీద, ప్రభుత్వం మీద డెంగ్ పట్టు బిగించగలిగాడు. మావో వారసుడుగా వచ్చిన హువాగువాఫెంగ్ను డమ్మీ చేసి అధికార చక్రాన్ని డెంగ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆధునీకరణ, ఆర్థిక సంస్కరణలు అనే జంటలక్ష్యాలను పెట్టుకున్నాడు. సోషలిస్టు మార్కెట్ ఎకానమీని ప్రారంభించాడు. చౌకగా లభించే మానవ వనరులను ఉప యోగించుకుని ప్రపంచపు వస్తూత్పత్తి కర్మాగారంగా చైనాను మార్చేశాడు. ఎగుమతులను ప్రోత్సహించాడు. విదేశీ పెట్టుబడు లకు తలుపులు తెరిచాడు. ఆర్థిక విధానాల్లో ఎంత సరళంగా ఉదారంగా ఉన్నాడో రాజకీయ వ్యవహారాల్లో అంత కఠినంగా ఉన్నాడు. సోవియట్ శిబిరం కుప్పకూలిన రోజుల్లోనే చైనాలో తియనాన్మెన్ స్క్వేర్ ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆందోళన కారుల్ని డెంగ్ రక్తపుటేరుల్లో ముంచాడన్న విమర్శలున్నాయి. విమర్శలెట్లా వున్నా చైనా డ్రీమ్లోని రెండో లక్ష్యమైన ఆర్థిక వృద్ధిని డెంగ్ జమానా నెరవేర్చింది. కీలకమైన ఏ పదవినీ చేపట్ట కుండానే డెంగ్ డీఫ్యాక్టో సార్వభౌముడిగా పరిపాలన నడిపిం చాడు. ఆయన చనిపోయిన పన్నెండేళ్ల వరకు చైనా అదే బాటలో నడిచింది. అప్పుడొచ్చాడు అసలు సిసలైన మావో వారసుడు. షీ జిన్‌పింగ్ పుట్టింది కమ్యూనిస్టు కుటుంబంలో! కానీ సాంస్కృతిక విప్లవకాలంలో ఈ కుటుంబం అష్టకష్టాల పాలైంది. తండ్రిని జైల్లో పెట్టారు. తల్లిని విద్రోహి భార్యగా ప్రకటించి పరేడ్ చేయించారు. సోదరులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. అయినా, కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కోసం పదిసార్లు ప్రయ త్నించి చివరకు సఫలమయ్యాడు. షీ రివల్యూ షనరీ కాదు. ఒక టెక్నోక్రాట్. కెమికల్ ఇంజనీ రింగ్ చదివాడు. పార్టీలో కిందిస్థాయి నుంచి పనిచేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. మావో కాలంలో తన కుటుంబం తీవ్ర కడగండ్ల పాలైనప్పటికీ తాను మాత్రం మావో శిష్యుడిననే షీ ప్రకటించుకున్నాడు. చైనా డ్రీమ్‌లో చివరి లక్ష్యసాధన కోసం అడుగులు వేస్తున్నాడు. చైనా పూర్వ రాజులు సిల్కు రోడ్డును భూమి మీద వేస్తే షీ భూమితోపాటు సముద్రం మీద కూడా వేశాడు. వ్యూహాత్మక భాగస్వామ్యాలతో అమెరి కాకు వణుకు పుట్టిస్తున్నాడు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు నూరేళ్ల వయసు వచ్చేలోగా చైనాను అగ్రరాజ్యంగా నిలబెట్టే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ చైనా ఆ గమ్యాన్ని చేరు కుంటే భారత్ పరిస్థితి ఏమిటని మన పాలకులు, రాజకీయ వేత్తలు ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నూరేళ్ల జన చైనా జైత్రయాత్ర
చైనా కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవ త్సరాల ఉజ్వల చరిత్రకు సాక్షిగా ఈనాటి జనచైనా అరుణకాంతు లతో వెలుగులీనుతోంది. ఒక నిరు పేద స్థితి నుంచి రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా పురోగమించిన మహ త్తర విప్లవ నిర్మాణానికి చిహ్నంగా వారి ఎర్రజెండా ఎగురుతోంది. 140 కోట్ల ప్రజల కలలకు, ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నాయకత్వం వహిస్తూ వారి మన్న నలు పొందుతోంది. ఇదంతా తేలికగా సాధ్యమయ్యింది కాదు. అకుంఠిత దీక్షతో ఒక్క మాటగా, కలసికట్టుగా చేసిన జైత్రయాత్ర. అనేక కుట్రలను, శత్రుప్రేరిత చర్యలను తిప్పి కొడుతూ తనను తాను నిరూపించుకుంటూ సాగిన మహా ప్రయాణం. అయితే, అభూత కల్పనలను, అంతర్ విద్వేషా లను రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ సాగిన ఒక చారిత్రక ఘట్టమే తియనన్మెన్ స్క్వేర్. 1989 జూన్ 4 నాడు తియనన్మెన్ స్క్వేర్‌లో పదివేల మంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు ఒక విష ప్రచారం చేశారు, చేస్తున్నారు. నిజంగా ఏం జరుగుతున్నది అని పరి శీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్త లను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కూడా కొందరు అందులో భాగమయ్యారు. ఆనాడు 500 బిలియన్ డాల ర్లున్న చైనా జీడీపీ నేడు 14,000 బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్ చూపెట్టిన, ఆ తర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంలో వారు ఈ స్థాయికి చేరారు. 1989 తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనా మార్గం స్థానంలో ప్రజాస్వామ్యం పేరిట మరో వ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీ ప్రజల్లో కన్పించటం లేదు. దేశంలో అమలు చేయవలసిన సంస్కరణల గురించి పార్టీ నాయకత్వంలో చర్చలు కొనసాగుతున్న కాలం. డెంగ్ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్ వైపు మొగ్గిన నేత హుయావొ. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధాన కార్యదర్శిగా రాజీనామా (16–1–1987) చేసి, పొలిట్‌బ్యూరోలో వుండగా 15–04–89న మరణించారు. నాటి సంతాప వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యం పోశాయి విదేశాలు, విదేశీ మీడీయా. అలా ఏప్రిల్ 18–22న సంతాపం పేరిట వేలాదిమంది తరలి వచ్చారు. అదే ముదిరి 50 రోజులు కొనసాగింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని కొందరు విద్యార్థులు, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహ నమూనాని తలకెత్తుకున్న కొందరు విద్యార్థులు కూడా అందులో వున్నారు. అమె రికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలో హలో అని పలకరించుకుంటున్న వాతావరణం. అప్పటి విద్యార్థి తరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వాల గురించి పైపై అవగాహనే వుంది. అభివృద్ధి, సంపద, సౌకర్యాలు, టెక్నాలజీ... ఇవన్నీ కలిసి ‘రెడ్ జీన్’ని పలుచన చేస్తాయేమోనని కొంత ఆందోళన వున్న కాలం అది. డెంగ్ లిబరల్ ఆర్థిక సంస్క రణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడి దారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ‘చైనా తరహా సోషలిజం’ పేరిట అనుసరించిన వ్యూహం–ఎత్తుగడల ఫలితాలు ఈనాడు ప్రపంచమంతా చూస్తున్నది. సిద్ధాంత సంక్షోభం తలెత్త నీయకుండా ఆ ప్రమాదాన్ని పసిగట్టే ‘బూర్జువా లిబర లైజేషన్’కి వ్యతిరేకంగా చైనా పార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్ని సంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడి మాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశిక సూత్రాలను ప్రకటించాయి(పార్టీ 13వ మహాసభలో, 1987 అక్టోబరు). సంస్కరణల క్రమంలో పెచ్చరిల్లిన బూర్జువా లిబరలైజే షన్ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడి వుండాల్సిన ఆ సూత్రాలను పునరుద్ఘాటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మార్క్సిస్టు లెనినిస్టు మావో సిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను కాదనేవారు కొందరు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను ఆర్గనైజు చేశారు. ప్రజా చైనా, పార్టీల భవితవ్యాన్ని దెబ్బ తీయటానికి, సామ్రాజ్య వాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్ర స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని బలపరిచి, కొద్దిమంది తీవ్రమైన తప్పు చేశారు. ‘మొత్తం’ ఎంతమంది చనిపోయారు? చైనా లెక్క 300 (సైనికులతో సహా). జూన్ 3 రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్న పుకారు: పదివేలమంది. అమెరికా గూఢచారి సంస్థ లెక్క– 500 మందిదాకా. యామ్నెస్టీ లెక్క 1000 దాకా. స్క్వేర్‌లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. ‘అక్కడ’ రక్తపాతం జరగలేదని 2011లో అమెరికా రాయబార కార్యా లయం పంపిన రహస్య కేబుల్స్ చెప్పాయి. పాశ్చాత్య కపటాన్ని (నేటి భాషలో పోస్ట్ ట్రూత్) చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. ఆ తరువాత నడిచిన చరిత్ర చైనా వారి సూత్రీకరణలు ఎంత సరైనవో నిరూపించింది. తూర్పు యూరప్‌లో, రష్యాలో లాగే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతన మవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలు వమ్మయేట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ తన ప్రస్థానం కొనసాగిస్తున్నది. ‘పాశ్చాత్యీకరించబడిన’ ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. సోషలిస్టు మార్కెట్ విధానాలతో, ప్రపంచీ కరణ సమయంలో ఏర్పడ్డ సౌలభ్యాలని తమ జాతీయ అభి వృద్ధికి మార్గంగా చేసుకుని జన చైనా మహాప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో చైనా లక్ష ణాలతో సృజనాత్మకంగా అభివృద్ధి చేసుకున్న సోషలిస్ట్ రాజ్యంగా మునుముందుకు దూసుకు వెళుతున్నది. ఇది సహించలేని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ భయకంపిత చిహ్నాలే చైనాకు వ్యతిరేకంగా కూటములు కట్టడం, అడు గడుగునా చైనా వ్యతిరేక ప్రచారం కొనసాగించటం. వారి సంస్కృతిని, సాంకేతిక నైపుణ్యాన్ని కించపరచటం, అసలు ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం చైనా అనే బూటకపువాదం యుద్ధభేరీలా మోగించటం. అయితే ప్రపంచ ప్రజల అభి ప్రాయం భిన్నంగా ఉంది. సామ్రాజ్యవాద, ఆధిపత్య శక్తుల దోపిడీ ప్రయోజనాలను, పీడక స్వభావాణ్ని ప్రపంచ ప్రజలు అవగతం చేసుకుంటూ జన చైనా వెనుక నిలుస్తు న్నారు, జేజేలు చెబుతున్నారు. వ్యాసకర్త భారత–చైనా మిత్ర మండలి ఉపాధ్యక్షులు మొబైల్ : 98498 06281 -
ప్రపంచంలోనే అతి పెద్ద రహస్య సమాజం ఏదంటే..
సాక్షి, వెబ్‌డెస్క్: చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) గురువారం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా డ్రాగన్ దేశం ఎదగడంలో సీసీపీ ప్రాముఖ్యత ఎంతో ఉంది. తొలుత షాంఘైలో చట్టవిరుద్ధమైన మార్క్సిస్ట్ ఉద్యమంగా ప్రారంభమైన ఈ పార్టీ ఆ అసమ్మతివాదుల ప్రక్షాళన, కఠిన నిఘా వంటి చర్యలతో ఆ తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా ఎదిగింది. చైనాలో ప్రతి విషయం అత్యంత గోప్యంగా ఉంటుంది. ప్రభుత్వ విధనాలు ఏంటి అనే దాని గురించి అస్సలు బయటకు వెల్లడించరు. ఈ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ ఓ ఐదు విషయాల గురించి సామాన్య జనాలు మాట్లాడటాన్ని అసలు అనుమతించదు. మరి ఆ ఐదు విషయాలు ఏంటో ఇక్కడ చదవండి.. పార్టీలో సభ్యులు ఎవరు చైనా కమ్యూనిస్ట్ పార్టీ 95.1 మిలియన్ల మందితో కార్యకర్తలతో ప్రపంచంలో రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయితే సభ్యుల పేర్లను మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. పార్టీ సభ్యత్వం పొందాలంటే ముఖ్యంగా సదరు వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు ఉండకూడదు. 180 మిలియన్ల మంది కార్యకర్తలను ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ తరువాత ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీ. సీసీపీ సంస్థ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 6.5 మిలియన్ల మంది సభ్యులు మాత్రమే కార్మికులు కాగా, 25.8 మిలియన్లు వ్యవసాయ కార్మికులు, 41 మిలియన్ల వైట్ కాలర్ నిపుణులు, 19 మిలియన్ల మంది రిటైర్డ్ క్యాడర్లు సభ్యులుగా ఉన్నట్లు ప్రకటించింది. కానీ వారి పేర్లు ఎక్కడా కానరావు. సీసీపీకి నిధులు ఎలా సమకూరుతాయి.. సీసీపీ ఇంతవరకు తన బడ్జెట్‌ను బయటకు వెల్లడించలేదు. పార్టీ నాయకుల వ్యక్తిగత సంపద అనేది ఇక్కడ చాలా సున్నితమైన అంశం. సీసీపీ సభ్యులు తమ ఆదాయంలో రెండు శాతం వరకు పార్టీకి విరాళంగా ఇస్తారు. 2016 లో, ఒక అధికారిక పత్రిక మునుపటి సంవత్సరానికిగాను మొత్తం 7.08 బిలియన్ యువాన్లు (1 బిలియన్ డాలర్లు) విరాళంగా వచ్చాయని నివేదించింది. అయితే ఈ విరాళాలు అనేవి పార్టీ ఆదాయంలో కొద్ది భాగం మాత్రమే. పార్టీ ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి అనేక కంపెనీలు, హోటళ్ళు, ఫ్యాక్టరీలను నేరుగా నిర్వహిస్తుందని హాంకాంగ్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన జీన్-పియరీ క్యాబెస్టన్ తెలిపారు. ఇక పార్టీ నాయకుల జీతాలు, ప్రోత్సాహకాల గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండదు. లాభదాయకమైన పెట్టుబడుల ద్వారా చైనా నాయకులు, వారి కుటుంబాలు చేసిన భారీ అక్రమాలపై వార్తలు ప్రచురించినందుకు అనేక విదేశీ మీడియా సంస్థలపై సీసీపీ ప్రతీకారం తీర్చుకుంది. 2012 బ్లూమ్‌బెర్గ్ దర్యాప్తులో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దగ్గరి బంధువులు బిలియన్ల యువాన్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని అంచనా వేసింది. సీసీపీ బాధితులెందరంటే.. 1949 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ విధానాల ఫలితంగా చైనాలో 40 నుంచి 70 మిలియన్ల మంది మరణించి ఉంటారని చాలా మంది విదేశీ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో అనేక అంతర్గత ప్రక్షాళనలు, గ్రేట్ లీప్ ఫార్వర్డ్ - మావో జెడాంగ్ వినాశకరమైన ఆర్థిక విధానం(ఇది పదిలక్షల మంది ఆకలితో చనిపోవడానికి దారితీసింది), టిబెట్‌లో అణచివేత, దశాబ్దాల సాంస్కృతిక విప్లవం, 1989 టియానన్మెన్ స్క్వేర్ అణిచివేత వంటి ఘటనల వల్ల చాలామంది మరణించినట్లు సమాచారం. ఖైదీల నుంచి బలవంతంగా అవయావాలు తీసుకుంటుందనే ఆరోపణలను చైనా పదేపదే ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా నిషేధించబడిన ఫలున్ గాంగ్ ఆధ్యాత్మిక ఉద్యమ సభ్యుల నుంచి అవయావాలను తీసుకుంటుందనే ఆరోపణలు కోకొల్లలు. అయితే బీజింగ్ వీటిని ఖండించింది. జిన్జియాంగ్లోని ఒక మిలియన్ మంది ఉయ్ఘరు, ఇతర మైనారిటీలను నిర్బంధ శిబిరాల్లోకి చేర్చారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. కానీ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే ఇలా చేస్తున్నట్లు బీజింగ్ తన చర్యలను సమర్థించుకుంది. ఎవరిని ప్రత్యర్థులుగా చూస్తుందంటే.. అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది కార్యకర్తలు, న్యాయవాదులు, హక్కుల న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు, అరెస్టు చేశారు. జిన్‌పింగ్ నాయకత్వంలో పౌర సమాజంపై కఠిన ఆంక్షలు విధించారు. రాజకీయ ప్రత్యర్థులను ప్రక్షాళన చేయడానికి ఈ ప్రచారం కూడా ఉపయోగపడిందని విమర్శకులు చెబుతున్నప్పటికీ, అవినీతిపై ఆయన చేసిన అణచివేత కింద పదిలక్షల మంది అధికారులు శిక్షించబడ్డారు. 2015 అణచివేత సందర్భంగా వందలాది మంది న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హాంకాంగ్‌లో, డజన్ల కొద్దీ మందిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం అభియోగాలు మోపబడ్డాయి. ఇటీవల దేశంలో తీసుకువచ్చిన ఆర్ధిక సంస్కరణల ఫలితంగా యువ జాతీయవాదుల నుంచి నిజమైన మద్దతు లభించనట్లు పార్టీ ప్రగల్భాలు పలుకుతుంది. కాని మీడియాపై కఠినమైన నియంత్రణ, ఆన్లైన్ చర్చలను నియంత్రించే నియమాలు భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాయి. రహస్య సమావేశాలు.. సీసీపీ సమావేశాలలో సాధారణంగా ఐదేళ్ల కాంగ్రెస్ ఉంటుంది, ఇది సాధారణంగా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటుంది. 200 మంది కేంద్ర కమిటీ సభ్యులు, పొలిటికల్ బ్యూరో, అంతర్గత మంత్రివర్గంతో ఉన్నత స్థాయి సమావేశాలు అత్యంత రహస్యంగా జరుగుతాయి. జాతీయ మీడియా అధికారికంగా ఆమోదించిన సమాచారాన్నే ప్రసారం చేస్తుంది. దేశంలోని అంతర్గత ఉద్రిక్తతలను దాచి.. శత్రువులకు ఉక్కు పిడికిలి చూపిస్తుంది. ఈ కారణాల వల్ల చైనా "ప్రపంచంలోనే అతిపెద్ద రహస్య సమాజం" గా నిలుస్తుందని విశ్లేషకులు తెలిపారు. చదవండి: డ్రాగన్ పన్నాగం: సరిహద్దులో బుల్లెట్ ట్రైన్ ప్రారంభం -
జిన్‌పింగ్‌పై విమర్శలు, పార్టీ నుంచి గెంటివేత
బీజింగ్: అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌పై విమర్శలు చేసిన ఓ వ్యాపారవేత్తను చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) బహిష్కరించింది. అధ్యక్షుడిని విమర్శించడం ద్వారా రెన్ ఝిగియాంగ్ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఝిగియాంగ్పై అవినీతి, నిధుల మళ్లింపు ఆరోపణలు కూడా ఉన్నాయని సీపీసీ వెల్లడించింది. పార్టీ ప్రతిష్ఠ దృష్ట్యా కూడా బహిష్కరణ చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, 69 ఏళ్ల ఝిగియాంగ్ చైనాలో మంచి పలుకుబడి కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్త. సీపీపీలో సీనియర్ నేత. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ పాలనపై ఆయన తరచూ విమర్శలు చేస్తుంటారు. (చదవండి: మీ జోక్యం అక్కర్లేదు: చైనా) ఈక్రమంలోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన మార్చి నెలలో ఘాటు విమర్శలు చేశారు. దీంతో కొన్ని రోజులపాటు ఆయనను జైల్లో పెట్టారు. ఇక 2016లో సైతం ఆయన ప్రభుత్వ పనితీరు, సీపీసీపై విమర్శలు గుప్పించారు. అధ్యక్షడికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఊడిగం చేస్తోందంటూ విమర్శలు చేయడంతో చైనా సోషల్ మీడియాలో ఆయనపై కొన్ని రోజులపాటు నిషేధం కూడా విధించారు. ప్రభుత్వం, జిన్‌పింగ్‌పై నిర్భయంగా విమర్శలు చేయడంతో ఆయనను చైనాలో నెటిజన్లు ‘కేనాన్’గా పిలుస్తారు. ఇక ఝిగియాంగ్పై పార్టీ బహిష్కరణ జిన్‌పింగ్‌పై విమర్శలు చేసేవారికి సీపీసీ ఒక హెచ్చరిక ఇచ్చినట్టయింది. (ఇలాగైతే చైనాతో కటీఫ్!) -
చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్ (64) అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం లభించింది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అధినేతగా కూడా జిన్‌పింగ్ ఎంపికయ్యారు. ఇప్పటికే ఆయన అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిన్‌పింగ్ విధేయుడు, సన్నిహితుడు వాంగ్ క్విషాన్ (69) చైనా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వాంగ్ ఎన్నికపై పలు విమర్శలు వస్తున్నాయి. 68 ఏళ్లు నిండిన వారు పదవీ విరమణ చేయడం సంప్రదాయం. 69 ఏళ్ల వాంగ్ పదవిలో కొనసాగడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
జిన్‌పింగ్ కోసం రాజ్యాంగ సవరణ
బీజింగ్: చైనాలో శక్తిమంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని ఏ వ్యక్తులైనా రెండుసార్లకు మించి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధనను తొలగించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) సిద్ధమైంది. సీపీసీకి చెందిన సెంట్రల్ కమిటీ ఈ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. గతేడాది జరిగిన సీపీసీ కాంగ్రెస్ సమావేశాల్లో జిన్‌పింగ్ సిద్ధాంతాల్ని, ఆలోచనా విధానాన్ని రాజ్యాంగంలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. -
అగ్రరాజ్యంగా చైనా.. పట్టుబిగిస్తున్న జిన్‌పింగ్!
(సాక్షి నాలెడ్జ్సెంటర్) : చైనా ప్రజా విప్లవం(1949) నుంచీ పాలకపక్షంగా కొనసాగుతున్న చైనా కమ్యూనిస్ట్‌పార్టీ(సీపీసీ) 19వ మహాసభలు(కాంగ్రెస్) బుధవారం ప్రారంభమౌతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన నేత(కోర్లీడర్) జీ జిన్పింగ్ఎంతటి బలమైన నేతగా ఆవిర్భవిస్తారనేది చర్చనీయాంశమైంది. విప్లవకాలంలో పార్టీని విజయపథంలో నడిపించిన మావో జెడాంగ్తర్వాత డెంగ్జియావోపింగ్చైనా అగ్రనేతగా పేరు తెచ్చుకున్నా పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పదవేమీ తీసుకోలేదు. అయినా నేతలందరి అభిప్రాయాలనే సేకరించి పార్టీలోని వివిధ ప్రాంతాలు, వర్గాల నేతలతో సంకీర్ణాన్ని నిర్మించారు. ఈ సంకీర్ణం నాయకత్వానే ఎవరూ ఊహించని ఆర్థిక సంస్కరణలను చైనాలో విజయవంతంగా అమలయ్యేలా డెంగ్పునాదులు వేశారు. చైనాను ప్రపంచ ఆర్థికశక్తిగా మార్చిన జిన్‌పింగ్ చైనా అన్ని విధాలా అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది ప్రస్తుత నేత జిన్పింగ్హయాంలోనే(2012 నుంచి). రెండోసారి సీపీసీ ప్రధానకార్యదర్శి పదవిని 19వ కాంగ్రెస్‌లో చేపట్టాక ఆయన అధికార కేంద్రీకరణ మార్గంలో పయనిస్తారేమోననే భయాందోళనలు చైనాలో వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిన్‌పింగ్‌కూడా గోర్బచ్యోవ్మాదిరిగా కొంత ధైర్యం చేసి ఇటీవల చైనాలో అగ్రపదవుల్లోని అధికారులు, నేతల అవినీతిని అరిక్టడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఎదుగూబొదుగూ లేని చైనా కార్మికుల జీతాలు బాగా పెంచారు. చైనా ఆర్థికవృద్ధి రేటు కొద్దిగా మందగించినా ఫరవాలేదుగాని సీపీసీ కనున్నల్లో నడిచే ప్రభుత్వ వ్యవస్థ కూలిపోకూడదనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారనే ప్రశంసలు కూడా అందుకున్నారు. సీపీసీలో, ప్రభుత్వంలో పూర్తి పట్టు సాధించి తన మార్గంలో పయనించేవారికి పదోన్నతులు కల్పించారు. అవితీతిపరులుగా తేలిన కమ్యూనిస్ట్నేతలను ఇంటికి సాగనంపారు. కాని, కిందటేడాది తనను కోర్లీడర్గా ప్రకటింకున్నప్పటి నుంచీ వ్యక్తి పూజను జిన్పింగ్ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. సీపీసీ కాంగ్రెస్తర్వాత రాజ్యాంగ సవరణతో అధికార కేంద్రీకరణ? ఇప్పటికే బలమైన నేతగా అవతరించిన జిన్‌పింగ్ సీపీసీ మహాసభల్లో 70 శాతం పదవుల్లోకి కేవలం తన అనుయాయులనే తీసుకొచ్చి, తర్వాత తన పెత్తనాన్ని పటిష్టం చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరిస్తారనే కొందరు అంచనావేస్తున్నారు. 19వ సీపీసీ కాంగ్రెస్‌లో రెండోసారి నాయకత్వం చేపట్టాక ఆయన మావోలా మారతారా? లేక డెంగ్మాదిరిగా అందర్నీ కలుపుకుపోయే సంకీర్ణ నేతగా చైనాను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళతారా? అనే విషయం సమీప భవిష్యత్తులో తెలుస్తుంది. 138 కోట్ల జనాభా, 95 లక్షల చదరుపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న దేశాన్ని సంపూర్ణ అధికారాలతో ‘సుప్రీం లీడర్’గా జీపింగ్అవరిస్తే అది ఏకపార్టీ పాలనలోని చైనాకేగాక యావత్ప్రపంచానికి మంచిది కాదని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
అమరావతి నిర్మాణానికి సహకరించండి
- జీఐఐసీని కోరిన సీఎం బాబు - రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అప్పో - చైనాలో 4వరోజు సీఎం పర్యటన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సహకారం అందించాలని గిజో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్(జీఐఐసీ)ను సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం గియాన్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్)పై సీఎం మాట్లాడుతూ ప్రపంచంలోని పది అత్యుత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు. సీఎం చైనా పర్యటన వివరాలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం వెల్లడించింది. పర్యటనలో భాగంగా గిజోజో ప్రావిన్స్‌లోని గియాన్ నగరాన్ని బాబు బృందం సందర్శించింది. రాజధాని అమరావతిని హరితవనంలా, పుష్కల నీటి వనరులతో జీవకళ ఉట్టిపడే నగరంలా నిర్మించనున్నామని, అందుకు మీ సహకారం కావాలని ప్రావిన్స్ వైస్ గవర్నర్ ‘క్విన్ రు పీ’ని చంద్రబాబు కోరారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పించేందుకు సెల్ ఫోన్ తయారీ కంపెనీ అప్పో సంసిద్ధత వ్యక్తం చేయడంతో ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలతో ముందుకు రావాలని సీఎం కోరారు. గియాన్ నగరంలో పర్యటించిన చంద్రబాబు చైనాలోని అతిపెద్ద డేటా సెంటర్ యైనా యూనికామ్‌ను సందర్శించారు. మొబైల్ తయారీ సంస్థ ఫ్యాక్స్‌కాన్ ఫెసిలిటీ సెంటర్‌నూ బాబు బృందం సందర్శించింది. గియాన్‌లో విశ్వవిద్యాలయాల ప్రాంగణాన్ని సందర్శించిన చంద్రబాబు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాట్లాడారు. జీఐసీసీ పారిశ్రామిక పార్కులో వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన బాబు విశాఖలో తాము ఏర్పాటు చేస్తున్న వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంలో భాగస్వాములు కావాలని కోరారు. గుయాన్ పర్యటనలో భాగంగా చైనా కన్స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ చైనా, సౌత్ హ్యూటన్, షెలికో, కెడాక్లిన ఎనర్జీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే చైనాలోని గిజో ప్రావిన్స్‌తో సిస్టర్ స్టేట్‌గా ఏపీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ గిజో ప్రావిన్స్ కార్యదర్శి చన్ మినేరాతో భేటీ అయిన చంద్రబాబు.. ఐటీ, ఫార్మా రంగాల్లో తాము సహకారం అందిస్తామని, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనా రంగాల్లో తమతో భాగస్వాములు కావాలని కోరారు. మినేరా మాట్లాడుతూ పర్యాటక రంగంలో తాము ఏపీకి సహకరిస్తామన్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఈడీబీ సీఈవో జె. కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.