అమరావతి నిర్మాణానికి సహకరించండి
- జీఐఐసీని కోరిన సీఎం బాబు
- రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అప్పో
- చైనాలో 4వరోజు సీఎం పర్యటన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సహకారం అందించాలని గిజో ఇంటర్నేషనల్ ఇన్‌వెస్ట్‌మెంట్ కార్పొరేషన్(జీఐఐసీ)ను సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం గియాన్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్)పై సీఎం మాట్లాడుతూ ప్రపంచంలోని పది అత్యుత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు. సీఎం చైనా పర్యటన వివరాలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం వెల్లడించింది. పర్యటనలో భాగంగా గిజోజో ప్రావిన్స్‌లోని గియాన్ నగరాన్ని బాబు బృందం సందర్శించింది.
రాజధాని అమరావతిని హరితవనంలా, పుష్కల నీటి వనరులతో జీవకళ ఉట్టిపడే నగరంలా నిర్మించనున్నామని, అందుకు మీ సహకారం కావాలని ప్రావిన్స్ వైస్ గవర్నర్ ‘క్విన్ రు పీ’ని చంద్రబాబు కోరారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పించేందుకు సెల్ ఫోన్ తయారీ కంపెనీ అప్పో సంసిద్ధత వ్యక్తం చేయడంతో ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలతో ముందుకు రావాలని సీఎం కోరారు. గియాన్ నగరంలో పర్యటించిన చంద్రబాబు చైనాలోని అతిపెద్ద డేటా సెంటర్ యైనా యూనికామ్‌ను సందర్శించారు. మొబైల్ తయారీ సంస్థ ఫ్యాక్స్‌కాన్ ఫెసిలిటీ సెంటర్‌నూ బాబు బృందం సందర్శించింది.
గియాన్‌లో విశ్వవిద్యాలయాల ప్రాంగణాన్ని సందర్శించిన చంద్రబాబు వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాట్లాడారు. జీఐసీసీ పారిశ్రామిక పార్కులో వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన బాబు విశాఖలో తాము ఏర్పాటు చేస్తున్న వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంలో భాగస్వాములు కావాలని కోరారు. గుయాన్ పర్యటనలో భాగంగా చైనా కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ చైనా, సౌత్ హ్యూటన్, షెలికో, కెడాక్లిన ఎనర్జీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే చైనాలోని గిజో ప్రావిన్స్‌తో సిస్టర్ స్టేట్‌గా ఏపీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ గిజో ప్రావిన్స్ కార్యదర్శి చన్ మినేరాతో భేటీ అయిన చంద్రబాబు.. ఐటీ, ఫార్మా రంగాల్లో తాము సహకారం అందిస్తామని, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనా రంగాల్లో తమతో భాగస్వాములు కావాలని కోరారు. మినేరా మాట్లాడుతూ పర్యాటక రంగంలో తాము ఏపీకి సహకరిస్తామన్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఈడీబీ సీఈవో జె. కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.