ఒక స్వప్నం... ముగ్గురు మొనగాళ్లు | Sakshi Editorial On 100 Years Of Chinese Communist Party | Sakshi
Sakshi News home page

ఒక స్వప్నం... ముగ్గురు మొనగాళ్లు

Published Sun, Jul 4 2021 12:00 AM | Last Updated on Sun, Jul 4 2021 7:48 AM

Sakshi Editorial On 100 Years Of Chinese Communist Party

‘‘ఈ శిశిరం వాకిట ఒంటరిగా నిలబడి ఎన్నెన్నో మనోహర దృశ్యాలను చూస్తున్నాను. ఈ శిశిరంలో ఒంటరిగానే ఎన్నెన్నో వసంత స్వప్నాలను కంటున్నాను’’. చైనాలో విప్లవానికి నాయ కత్వం వహించి కమ్యూనిస్టు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మావో జెడాంగ్‌ గొప్ప తాత్వికుడు, వ్యూహకర్త, నాయకుడు మాత్రమే కాదు.. గొప్ప కవి, రచయిత, స్వాప్నికుడు కూడా! చదువు పూర్తయిన తర్వాత పెకింగ్‌ (బీజింగ్‌) విశ్వవిద్యాల యంలో కొంతకాలం లైబ్రరీ అసిస్టెంట్‌గా మావో పనిచేస్తాడు. అక్కడ తన బాస్‌గా ఉన్న జెన్‌డుషీ ప్రభావంతో కమ్యూనిస్టుగా మారతాడు. అక్కడి నుంచి తిరిగి తన సొంత రాష్ట్రం హునాన్‌కు వచ్చినప్పుడు సియాంగ్‌ నదిలోని ఆరెంజ్‌ ద్వీపానికి వెళ్తాడు. అక్కడ కదలాడిన మనోభావాలతో రాసిన కవిత ఇది. ఇందులో ఆయన కల మెదులుతుంది. ఆ కలలో ఆకాశం కింద స్వేచ్ఛ కోసం పరితపించే లక్షలాది జీవులు కనబడతాయి. కవితలోని భావాలకు రెక్కలు తొడిగి మావో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తాడు.

చైనా కమ్యూనిస్టు పార్టీకి ఇప్పుడు వందేళ్ల వయసు. మొన్ననే ఘనంగా శతవార్షికోత్సవం జరిగింది. చైనా కమ్యూ నిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు, మిలటరీ కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న షీ జిన్‌పింగ్‌ ఏం మాట్లాడుతాడోనని ప్రపంచం ఎదురు చూసింది. ఎందుకంటే, చైనా ఇప్పుడు అల్లాటప్పా దేశం కాదు. అగ్రరాజ్య హోదా కోసం అమెరికాను సవాల్‌ చేసే స్థితికి ఎదిగిన దేశం. అనేక అభివృద్ధిరంగాల్లో అది ఇప్పటికే అమెరి కాను దాటేసింది. కమ్యూనిస్టు చైనాకు నాయకత్వం వహించిన ఐదు తరాల నాయకశ్రేణుల్లో మావో, డెంగ్‌ల తర్వాత అంతటి అధికారాన్ని చలాయిస్తున్న మూడో వ్యక్తి షీ. అందువల్ల ఆయన చెప్పే మాటలకు ప్రపంచ ప్రాధాన్యత ఏర్పడింది. సరిగ్గా పదేళ్ల కిందట చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ) ప్రధాన కార్యదర్శి పదవిని షీ జిన్‌పింగ్‌ చేపట్టాడు. చైనా స్వప్నాన్ని (చైనా డ్రీమ్‌) సాకారం చేయడమే తన లక్ష్యమని బాధ్యతలు స్వీకరించగానే షీ ప్రకటించాడు.

చైనా జాతీయ పునరుజ్జీవనమే చైనా స్వప్నంగా ఆయన ప్రకటించుకున్నారు. అందులో భాగంగా రెండు ‘శతాబ్ది’ లక్ష్యా లను పెట్టుకున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు నిండే నాటికి (2021) చైనా సమాజం అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించామని మొన్నటి శతవార్షిక సభలో షీ ప్రకటించాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి శతాబ్ది కాలం నిండే నాటికి (2049) చైనాను అగ్రరాజ్యంగా, ఆధునిక సోషలిస్టు దేశంగా రూపుదిద్దడం రెండవ లక్ష్యం. ఈ దిశగా తమ ప్రయాణం కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు.

చైనా డ్రీమ్‌ అనే నినాదాన్ని షీ జిన్‌పింగ్‌ బాగా ప్రచారం లోకి తెచ్చారు. కానీ ఈ డ్రీమ్‌కు నూటా యాభయ్యేళ్ల చరిత్ర ఉన్నది. చైనాకు రమారమి నాలుగు వేల సంవత్సరాల చారిత్రక వార సత్వ సంపద ఉన్నది. ఈ విశ్వం మొత్తానికి చైనా కేంద్రస్థానంలో ఉన్నదని పూర్వపు రోజుల్లో చైనా ప్రజలు గట్టిగా నమ్మేవారు. మిగిలిన రాజ్యాలన్నీ ఉపగ్రహాల వంటివని అభిప్రాయపడే వారు. రోమన్‌ సామ్రాజ్యం ఆవిర్భవించడానికి రెండువేల ఏళ్లకు పూర్వమే చైనాలో చిన్‌ వంశస్తులు మొదటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యూరప్‌లో పారిశ్రామిక విప్లవం ప్రభవించి వలస రాజ్యాలు ఏర్పడేంతవరకు ప్రపంచంలో సంపన్న దేశంగా చైనా కొనసాగింది. చరిత్ర క్రమంలో వివిధ దేశాల జీడీపీని శాస్త్రీయంగా లెక్కగట్టిన ఆంగస్‌ మాడిసన్‌ అంచనా ప్రకారం 16–17 శతాబ్దాల నడుమ ప్రపంచ దేశాల ఉమ్మడి జీడీపీలో 33 శాతం వాటా ఒక్క చైనాదే. వేలయేళ్ల కిందటనే అంతర్జాతీయ వర్తకం కోసం గోబీ ఎడారులు, టిబెట్‌ పీఠభూములు, సెంట్రల్‌ ఆసియా దేశాల మీదుగా యూరప్‌ ఖండం వరకు సిల్కు రోడ్డును చైనా వేసుకున్నదని చరిత్ర చెబుతున్నది. ఈ కారణాల రీత్యా ఆనాటి చైనా ప్రజలకుండే గర్వం నిర్హేతుకమైనది కాదని తేలుతున్నది.

చైనా ప్రజల గర్వాన్ని, ఆత్మగౌరవాన్ని యూరప్‌ వలస పాలకులు దెబ్బతీశారు. చైనాను పరిపాలించిన చివరి రాజ వంశం పేరు చింగ్‌. వీరు హన్‌ జాతీయులు కాదు. మంచూ తెగ వారు. చైనాలో హన్‌ జాతీయుల జనాభా చాలా ఎక్కువ. ఇండియాలో హిందువుల జనాభా శాతం కంటే కూడా ఎక్కువ. కానీ, చింగ్‌ వంశీయుల పాలనలోనే చైనా సరిహద్దులు బాగా విస్తరించాయి. పందొమ్మిదో శతాబ్దపు తొలిరోజుల్లో చైనాలోని ఉన్నతాధికారులకు బ్రిటిష్‌ వలస పాలకులు నల్లమందును అలవాటు చేశారు. ఇది క్రమంగా జనంలోకి పాకింది. నల్ల మందు అక్రమ రవాణాను అరికట్టడానికి చింగ్‌ పాలకులు చర్యలు చేపట్టారు. ఆగ్రహించిన బ్రిటిష్‌వారు చైనాతో యుద్ధా నికి దిగారు. తర్వాత కాలంలో ఫ్రాన్స్‌ కూడా బ్రిటన్‌కు జత కలిసింది. చైనా మీద రెండుసార్లు యుద్ధాలు (ఓపియమ్‌ వార్స్‌) చేశారు. చింగ్‌ రాజవంశ నైతిక బలాన్ని దెబ్బతీశారు. ఎనిమిది యూరప్‌ దేశాలు కలిసి చైనాపై ‘బాక్సర్‌’ యుద్ధాలు చేశాయి. మంచూరియా ప్రాంతాన్ని జపాన్‌ ఆక్రమించింది. చైనాపై అవమానకరమైన షరతులు విధించారు. చైనా సమాజంలోని విద్యావంతులు, ఉన్నత వర్గాల ప్రజలు కుమిలిపోయారు. తమ దేశం పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలని కలలుగన్నారు. ‘చైనా డ్రీమ్‌’ అప్పుడే మొద లైంది. చైనాలో జాతీయోద్యమం ప్రారంభమైంది. మంచూ జాతీయులైన చింగ్‌ రాజవంశంపై తిరుగుబాటు ప్రారంభ మైంది. సన్‌యట్‌సేన్‌ నాయకత్వంలో కుమిటాంగ్‌ పార్టీ జాతీయ వాదులతో కలిసి రాజరికాన్ని కూలదోసింది. జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలోనే ఓ పదిహేడేళ్ల యువ కుడు తన పొడవాటి జుట్టును కత్తిరించి నిరసన వ్యక్తం చేశాడు. చింగ్‌ రాజుల ఏలుబడిలో పురుషులు కూడా జుట్టును పెంచు కోవాలి. ఈ శాసనాన్ని ఆ యువకుడు ధిక్కరించాడు. అతడి పేరు మావో జెడాంగ్‌. చైనాడ్రీమ్‌ను సాకారం చేయడానికి వేట అక్కడే మొదలైంది.

మావో జెడాంగ్‌ ఓ రైతుబిడ్డ. పెద్ద ఆకతాయి. కుదురుగా ఉండే రకం కాదు. పదమూడేళ్లు నిండేసరికి అతికష్టంగా ఐదో క్లాసు ముగించాడు. ఇక లాభం లేదని వాళ్ల నాన్న పొలం పనిలో పెట్టాడు. అక్కడా కుదురుకోలేదు. హునాన్‌ ముఖ్యపట్టణమైన చాంగ్షా మిడిల్‌ స్కూల్‌లో చేర్చారు. అక్కడ ఏడాదిలో నాలుగు స్కూళ్లు మారాడు. కానీ లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు. ఆ వయసులోనే ఆడమ్‌ స్మిత్, మాంటెస్క్యూ, డార్విన్, జాన్‌ స్టూవర్ట్‌మిల్, రూసో, స్పెన్సర్‌ల క్లాసిక్స్‌ను చది వేశాడు. ఈ లైబ్రరీ పిచ్చితో పెకింగ్‌ యూనివర్సిటీ లైబ్రరీలో గుమాస్తాగిరి ఉద్యోగంలో చేరాడు. అక్కడ జెన్‌డూషీ పరిచయం మావోను కమ్యూనిస్టుగా మార్చింది.

చైనాలో పేరుకు జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, దేశమంతటా అరాచకం రాజ్యమేలింది. వార్‌ లార్డ్‌ల ఆధిపత్యం కింద దేశం ముక్కచెక్కలుగా చీలిపోయింది. ఈ దశలో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో విజేతలందరూ పారిస్‌లోని వెర్సయిల్‌ రాజప్రాసాదంలో (versailles treaty) వాటాలకోసం సమావేశమయ్యారు. ఇక్కడా చైనాకు అవమా నమే ఎదురైంది. జపాన్‌కు పెద్దమొత్తంలో నష్టపరి హారం చెల్లిం చాలని చైనాను ఆదేశించారు. చైనా హృదయం మళ్లీ గాయ పడింది. ఈ సమయంలోనే 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. సొంతరాష్ట్రం హునాన్‌లో పార్టీ పనిని మావో ప్రారం భిస్తాడు. మార్క్సిస్టు మూల సిద్ధాంతాల ప్రకారం పట్టణాల్లోని కార్మిక వర్గం విప్లవానికి నాయకత్వం వహించాలి. కానీ చైనాలో అది కుదిరేపని కాదని మావో భావించారు. పెద్దసంఖ్యలో ఉన్న రైతులను సమీకరించి తిరుగుబాటు చేయాలని భావించాడు. మావో అంతరంగంలో కమ్యూనిస్టు ఎంత బలంగా ఉన్నాడో... జాతీయవాది కూడా అంతే బలంగా ఉండేవాడు. గతించిన చైనా వైభవాన్ని గురించి కథలు కథలుగా రైతులకు చెప్పేవాడు. వారిని సమీకరించి చింకాంగ్‌ కొండల్లో స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. చైనా డ్రీమ్‌ మావోను నిరంతరం వెన్నాడుతూనే ఉండేది. ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని’ ప్రకటించాడు. ఈ వాక్యం అనంతరకాలంలో డజన్లకొద్ది దేశాల్లో చేగువెరా సహా లక్షలాదిమంది యువకుల చేత తుపాకీ పట్టిం చింది. స్త్రీల సమస్యల గురించి ఆలోచిస్తూ ఆకాశం కేసి చూసి ‘మహిళలు ఆకాశంలో సగభాగం’ అన్నాడు. ఈనాటికీ మహిళా ఉద్యమాల రణన్నినాదం ఇదే.

యుద్ధ వ్యూహాలతో రాటుదేలిన మావో చైనా కమ్యూనిస్టు పార్టీకి అగ్రనేతగా ఎదిగాడు. చరిత్ర ప్రసిద్ధిచెందిన లాంగ్‌ మార్చ్‌ వ్యూహకర్త ఆయనే, సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన నాయకత్వంలోనే చైనా విప్లవం విజయవంతమై 1949లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. రాజవంశాల పరిపాల నలో నామమాత్రపు అధికారం మాత్రమే ఉన్న టిబెట్, షింజి యాంగ్, మంగోల్‌ ప్రాంతాలను పూర్తిగా చైనా అధీనంలోకి తెచ్చుకున్నారు. భౌగోళిక– రాజకీయ సుస్థిరత ఏర్పడింది. చైనా డ్రీమ్‌లో మొదటిభాగం ముగిసింది. ఇంకా రెండు భాగాలు న్నాయి. ఒకటి: ఆర్థికాభివృద్ధిని సాధించడం; రెండు: అగ్ర రాజ్యంగా వెలుగొందడం. ఈ లక్ష్యాలను కూడా వేగంగా సాధిం చాలన్న తొందరలో మావో చేసిన తప్పులకు చైనా భారీ మూల్యం చెల్లించింది. వ్యవసాయ– పారిశ్రామిక ఉత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచడం కోసం ప్రారంభించిన గొప్ప ముందడుగు (great leap forward) ఉద్యమం విఫలమైంది. లక్షలాదిమంది ఆకలి చావులకు బలయ్యారు. దీన్ని కప్పిపుచ్చు కోవడానికే మావో సాంస్కృతిక విప్లవం (Cultural revolution)ను ప్రారంభించారని విమర్శకుల అభిప్రాయం. మావో వైఫల్యాలను ప్రశ్నించిన వారందరూ ఈ కాలంలో శిక్షలకు గురయ్యారు. చైనా డ్రీమ్‌లో రెండో లక్ష్యాన్ని చేరకుం డానే మావో కన్నుమూశారు.

డెంగ్‌ సియావో పింగ్‌ కూడా రైతుబిడ్డే. ఫ్రాన్స్‌లో చదువు కున్నాడు. అక్కడే కమ్యూనిజానికి ఆకర్షితుడయ్యాడు. మావోతో కలిసి లాంగ్‌ మార్చ్‌లో పాల్గొన్నాడు. చైనా అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున క్రియాశీల పాత్ర పోషించాడు. టిబెట్‌ను ‘దారికి తెచ్చే’ బాధ్యతను ఈయనే నిర్వహించాడు. కల్చరల్‌ రివల్యూషన్‌ కాలంలో మావో జెడాంగ్‌ ఆగ్రహానికి గురయ్యాడు. కానీ జౌఎన్‌లై చలవతో మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కించు కున్నాడు. మావో మరణానంతరం పార్టీ మీద, ప్రభుత్వం మీద డెంగ్‌ పట్టు బిగించగలిగాడు. మావో వారసుడుగా వచ్చిన హువాగువాఫెంగ్‌ను డమ్మీ చేసి అధికార చక్రాన్ని డెంగ్‌ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆధునీకరణ, ఆర్థిక సంస్కరణలు అనే జంటలక్ష్యాలను పెట్టుకున్నాడు. సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీని ప్రారంభించాడు. చౌకగా లభించే మానవ వనరులను ఉప యోగించుకుని ప్రపంచపు వస్తూత్పత్తి కర్మాగారంగా చైనాను మార్చేశాడు. ఎగుమతులను ప్రోత్సహించాడు. విదేశీ పెట్టుబడు లకు తలుపులు తెరిచాడు. ఆర్థిక విధానాల్లో ఎంత సరళంగా ఉదారంగా ఉన్నాడో రాజకీయ వ్యవహారాల్లో అంత కఠినంగా ఉన్నాడు. సోవియట్‌ శిబిరం కుప్పకూలిన రోజుల్లోనే చైనాలో తియనాన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆందోళన కారుల్ని డెంగ్‌ రక్తపుటేరుల్లో ముంచాడన్న విమర్శలున్నాయి. విమర్శలెట్లా వున్నా చైనా డ్రీమ్‌లోని రెండో లక్ష్యమైన ఆర్థిక వృద్ధిని డెంగ్‌ జమానా నెరవేర్చింది. కీలకమైన ఏ పదవినీ చేపట్ట కుండానే డెంగ్‌ డీఫ్యాక్టో సార్వభౌముడిగా పరిపాలన నడిపిం చాడు. ఆయన చనిపోయిన పన్నెండేళ్ల వరకు చైనా అదే బాటలో నడిచింది. అప్పుడొచ్చాడు అసలు సిసలైన మావో వారసుడు.

షీ జిన్‌పింగ్‌ పుట్టింది కమ్యూనిస్టు కుటుంబంలో! కానీ సాంస్కృతిక విప్లవకాలంలో ఈ కుటుంబం అష్టకష్టాల పాలైంది. తండ్రిని జైల్లో పెట్టారు. తల్లిని విద్రోహి భార్యగా ప్రకటించి పరేడ్‌ చేయించారు. సోదరులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. అయినా, కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కోసం పదిసార్లు ప్రయ త్నించి చివరకు సఫలమయ్యాడు. షీ రివల్యూ షనరీ కాదు. ఒక టెక్నోక్రాట్‌. కెమికల్‌ ఇంజనీ రింగ్‌ చదివాడు. పార్టీలో కిందిస్థాయి నుంచి పనిచేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. మావో కాలంలో తన కుటుంబం తీవ్ర కడగండ్ల పాలైనప్పటికీ తాను మాత్రం మావో శిష్యుడిననే షీ ప్రకటించుకున్నాడు. చైనా డ్రీమ్‌లో చివరి లక్ష్యసాధన కోసం అడుగులు వేస్తున్నాడు. చైనా పూర్వ రాజులు సిల్కు రోడ్డును భూమి మీద వేస్తే షీ భూమితోపాటు సముద్రం మీద కూడా వేశాడు. వ్యూహాత్మక భాగస్వామ్యాలతో అమెరి కాకు వణుకు పుట్టిస్తున్నాడు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాకు నూరేళ్ల వయసు వచ్చేలోగా చైనాను అగ్రరాజ్యంగా నిలబెట్టే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ చైనా ఆ గమ్యాన్ని చేరు కుంటే భారత్‌ పరిస్థితి ఏమిటని మన పాలకులు, రాజకీయ వేత్తలు ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది.


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement