తలపెట్టినవేవీ కొనసాగక విఫలుడై సెలవంటూ వెళ్లిపోవాల్సిన చైనా అధినేత జిన్‌పింగ్ సంప్రదాయానికి భిన్నంగా వరసగా మూడోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కాబోతున్నారు. వారంపాటు జరిగే పార్టీ కాంగ్రెస్ సమావేశాలు ఆదివారం ప్రారంభమవుతాయి. వచ్చే మార్చిలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పీసీ) సమావేశాలు దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకున్నా, దేశాధ్యక్షుడిగా మాత్రం జిన్‌పింగే కొనసాగుతారు. అయిదేళ్లకోసారి నిర్వహించే పార్టీ మహాసభలో జరిగే సిద్ధాంత చర్చలూ, తీసుకునే నిర్ణయాలూ లాంఛనప్రాయమైనవే. అన్నీ ముందే ఖరారవు తాయి. పార్టీ కాంగ్రెస్ చేయాల్సిందల్లా వాటికి ఆమోదముద్రేయడమే. మావో తిరుగులేని అధి నేతగా, యావజ్జీవ అధ్యక్షుడిగా దీర్ఘకాలం కొనసాగడం వల్ల దేశం నష్టపోయిందని భావించిన డెంగ్ ఆ ఒరవడికి స్వస్తి పలికారు. ఎవరైనా రెండు దఫాలు మాత్రమే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేలా నియమావళి మారింది. జిన్‌పింగ్ 2018లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో దీన్ని తిరగ దోడగలిగారు. సమష్టి నాయకత్వాన్ని ప్రవచించే కమ్యూనిస్టు పార్టీల్లో క్రమేపీ ఏకవ్యక్తి ప్రాబల్యం పెరగడం అసాధారణమేమీ కాదు. అందుకు చైనా భిన్నంగా ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2012లో పగ్గాలు చేపట్టినప్పుడు సామాజిక, ఆర్థిక రంగాల్లో 60 సంస్కరణలు తీసుకొస్తున్నట్టు జిన్‌పింగ్ ప్రకటించారు. వాటి వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో గమనిస్తే మూడోసారి ఆయన్ను నెత్తిన పెట్టుకోవాల్సినంత అగత్యం కనబడదు. ఎందుకంటే ఎగు మతి ఆధారిత ఆర్థిక వ్యవస్థను దేశీయ వినియోగ ఆధారితం చేస్తానన్నది జిన్‌పింగ్ ప్రధాన వాగ్దానం. అదికాస్తా ఎటోపోయింది. ఆర్థిక రంగంలో ఇకపై ‘మార్కెట్ శక్తులకు’ మరింత ప్రాధాన్యతనిస్తామనీ, వనరుల పంపిణీలోనూ వాటికే అగ్రతాంబూలమిస్తామనీ చెప్పినా జరిగింది అందుకు విరుద్ధం. వాస్తవానికి ప్రైవేటు రంగాన్ని మరింత బిగించారు. చైనా బహుళజాతి ఈ– కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా యున్ ఇందుకు తిరుగులేని ఉదాహరణ. అలీబాబా ఒక దశలో అమెజాన్‌కు దీటుగా కనబడింది. అంతర్జాతీయ వ్యాపార యవనికపై జాక్ తళుకులీనారు. కానీ రుణాలివ్వడంలో చైనా బ్యాంకులనుసరించే ఛాందస ధోరణులను 2020లో నిశితంగా విమర్శించిన కొన్నాళ్లకే ఆయన కథ ముగిసిపోయింది. జాక్ మా ఆ సంస్థ చైర్మన్‌గా తçప్పుకొని ప్రస్తుతం సామాజిక సేవలో నిమగ్నమయ్యారు.
డెంగ్ ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని జిన్‌పింగ్ తొలిసారి అధినేత అయ్యేనాటికి చైనా ఆర్థికంగా మెరుగ్గానే ఉంది. కానీ అది ముందుకు కదలడం లేదు. 7.5 శాతం వృద్ధిరేటు సాధించా లన్న తపన తీరని కలగా మిగిలిపోయింది. ఆర్థిక రంగానికి పెను ఊతం ఇస్తేనే అది పట్టాలెక్కు తుందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అందుకే అప్పట్లో సంస్కరణలపై జిన్‌పింగ్ ఊరిం చారు. కానీ ఆ పనిచేస్తే చివరకు ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు నాయకత్వాన్ని వదలడం లేదని వర్తమాన చైనా తీరుతెన్నులు చూస్తే అర్ధమవుతుంది. ధనిక, బీద తారతమ్యాలు సరేగానీ... ఆదాయం తగినంతగా ఉన్నవారు కూడా పొదుపు వైపే మొగ్గుతున్నారు. వేరే సంపన్న దేశాల్లో పౌరుల పొదుపు మొత్తం జీడీపీలో గరిష్ఠంగా 33 శాతం ఉండగా, చైనాలో అది 45 శాతం దాటింది. ప్రభుత్వపరంగా సామాజిక భద్రత పథకాలు లేకపోవడం... అనుకోని విపత్తు వస్తే, అవసరాలు ఏర్పడితే ఆసరా దొరకదన్న ఆందోళన అందుకు కారణం. తగినంత వినియోగం లేక పోతే సరుకంతా ఏం కావాలి? వాటిని ఉత్పత్తి చేసిన ఫ్యాక్టరీలు ఏం కావాలి? అనుత్పాదక రుణాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో అవినీతి కూడా మితిమీరిందని తరచు వెలువడే కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికారానికి వచ్చినప్పుడు అవినీతిని చీల్చిచెండాడతానని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. ఆ పేరుమీద తన వ్యతిరేకులను అదుపు చేయటం మినహా ఆయన పెద్దగా సాధిం చిందేమీ కనబడదు. ఇక కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్‌ల వినియోగంకన్నా లాక్‌డౌన్‌లపైనే ఎక్కు వగా ఆధారపడుతున్న దేశం చైనా. భారీ వ్యయాన్ని తప్పించుకోవడానికి లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నా ఇది ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీసింది. ఒకపక్క బీజింగ్‌లో పార్టీ కాంగ్రెస్ మొదలు కాబోతుండగా పారిశ్రామిక నగరం షాంఘైలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంక్షలూ మొదలవుతున్నాయి. ఇది చివరకు లాక్‌డౌన్‌కు దారితీస్తుందేమోనన్న భయం పౌరుల్లో పెరిగింది.
తాను విధించుకున్న పరిమితుల్లోనే 140 కోట్ల జనాభాగల చైనాలో సామాజిక సంక్లిష్టతలను అధిగమించడం ఎలా అన్న సంశయం జిన్‌పింగ్‌కు ఉన్నట్టే, దూకుడు ప్రదర్శిస్తున్న చైనాను నియంత్రించడమెలా అన్న చింత పాశ్చాత్య దేశాలకు పట్టుకుంది. ఇండో–పసిఫిక్ కూటమితో దాన్ని దారికి తీసుకురావటంతోపాటు కీలకమైన చిప్ తయారీ సాఫ్ట్‌వేర్ దానికి దక్కకుండా అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మరో కొత్త పోటీకి దారితీయబోతోంది. గడిచిన సంవత్సరాల్లో చైనా వైఫల్యాలకు, అది ఆశించినంతగా ఎదగకపోవడానికి కారణాలేమిటో జిన్‌పింగ్ తన నివేదికలో వెల్లడిస్తారు. అయితే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏకవ్యక్తిస్వామ్యమే ఇందుకు కారణమని చెప్పేటంత ప్రజాస్వామిక వాతావరణం పార్టీ కాంగ్రెస్‌లో లేదు. వరస వైఫల్యాలను కూడా బేఖాతరు చేసి అదే నేతను పదేపదే అందలం ఎక్కిస్తే జరిగేదేమిటో పొరుగునున్న రష్యాను చూసైనా నేర్చుకోనట్టయితే చైనాకు భవిష్యత్తు ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment