అనగనగా ఒక చైనా కథ | Sakshi Editorial On India China Border Issue | Sakshi
Sakshi News home page

అనగనగా ఒక చైనా కథ

Published Sun, Dec 25 2022 12:52 AM | Last Updated on Sun, Dec 25 2022 8:08 AM

Sakshi Editorial On India China Border Issue

పై పటంలోని ఆక్సాయిచిన్‌ ప్రాంతం ఇప్పటికే చైనా ఆక్రమణలో ఉన్నది. లదాఖ్, గిల్గిట్‌ – బాల్టిస్తాన్‌లను కలిపి భారత ప్రభుత్వం ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. కానీ, గిల్గిట్‌ – బాల్టిస్తాన్‌ పాక్‌ ఆక్రమణలో ఉన్నది. మనం కేంద్ర పాలితంగా ప్రకటించుకొన్న ఈ రెండు ప్రాంతాలు చైనాకే చెందుతాయనే తర్కాన్ని ప్రతిపాదించేందుకు చైనా సిద్ధపడుతున్నది. చైనా ప్రారంభించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ కార్యక్రమానికి ఈ ప్రాంతం కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉన్న నేపథ్యంలో చైనా ఓ కొత్త కథానికను రచిస్తున్నది. 

చైనావాళ్లు ఒక పాత కథను కొత్త పద్ధతిలో ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారు. నవరసాల మేళవింపుతో జనరంజ కంగా ఆ కథను చెప్పాలనుకుంటున్నారు. ఈ కథకు లోకం ఊకొడితే సరిహద్దుల్లో తమ సైనికుల గోడదూకుళ్లకు క్లీన్‌చిట్‌ దొరికినట్టే. ఈ కథ చెప్పాలన్న ఆలోచన ఈనాటిది కాదు. ఇంచు మించు ‘చైనా డ్రీమ్‌’కు ఉన్నంత వయసు ఈ ఆలోచనకు కూడా ఉన్నది.

ఐరోపావాళ్లు నల్లమందు యుద్ధాలతో చింగ్‌ వంశ సామ్రాట్టు మెడలు వంచినప్పుడు చైనా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆ అవమానంలోంచి పుట్టిందే ‘చైనా డ్రీమ్స్‌’. అప్పటివరకూ ప్రపంచంలో తామే అందరికన్నా గొప్పవాళ్లమనే అభిప్రాయంతో చైనా ప్రజలుండేవారు. వారికి అందుబాటులో ఉన్న చరిత్ర, పుస్తకాలు ఈ అభిప్రాయాన్ని కలిగించాయి.

ఐరోపావాళ్లు ఈ అభిప్రాయాన్ని అవహేళన చేశారు. మళ్లీ పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలనే సంకల్పం చైనీయుల మెదళ్లలో మొగ్గతొడిగిందప్పుడే. ఆధునిక చైనా నిర్మాత చైర్మన్‌ మావో ఝెడాంగ్‌ ‘చైనా డ్రీమ్‌’ను పట్టాలెక్కించారు. ఆ తర్వాత ఈ అంశాన్ని బలంగా ముందుకు తెచ్చింది మాత్రం ప్రస్తుత దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.

జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిందే తడవుగా ‘చైనా డ్రీమ్‌’ గురించి భజించడం మొదలుపెట్టాడు. నిజానికి అప్పటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. ప్రపంచపు వస్తూత్పత్తి కార్ఖానాగా అది మారింది. ‘చైనా డ్రీమ్‌’లో మిగిలిన భాగం అగ్రరాజ్యంగా అవతరించడం. నాలుగువేల సంవత్సరా లకు పైగా అందుబాటులో ఉన్న చరిత్రలో పూర్వపు రాజులు జయించిన, పాలించిన భూభాగాలన్నింటినీ మళ్లీ చైనాలో కలి పేసుకోవడం. ఈ రెండు అంశాల మీదా జిన్‌పింగ్‌ దృష్టి నిలిపారు.

జిన్‌పింగ్‌ తలకెత్తుకున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (బీఆర్‌ఐ) కార్యక్రమం పూర్తిగా సాకారమైతే ప్రపంచంలోని కీలక భూభాగాల మీద, వనరుల మీద, మార్కెట్‌ల మీదా చైనాకు ఆధిపత్యం లభిస్తుంది. ఈ ఆధిపత్యమే అగ్రరాజ్య హోదాకు గుర్తు. బీఆర్‌ఐ పథకంలో అత్యంత వ్యూహాత్మకమైన భూభాగం పూర్వపు ఉమ్మడి జమ్ము–కశ్మీర్‌ ప్రాంతం. ఇందులో ఐదు ప్రధాన భౌగోళిక ఉపవిభాగాలున్నాయి.

జమ్మూ ప్రాంతం, కశ్మీర్‌ లోయ, లదాఖ్, గిల్గిట్‌–బాల్టిస్తాన్, ఆక్సాయి చిన్‌లు ఆ విభాగాలు. కశ్మీర్‌ లోయలో పడమటి భాగం, గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ పూర్తిగా పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్నాయి. ఆక్సాయి చిన్‌ చైనా ఆక్రమణలో ఉన్నది. జమ్ము ప్రాంతం, మిగిలిన కశ్మీర్‌ లోయ, లదాఖ్‌లు భారత్‌లో ఉన్నాయి. ఇటీవలే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము–కశ్మీర్‌ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం విభజించింది.

లదాఖ్‌ను, పాక్‌ ఆక్రమణలో ఉన్న గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్ము–కశ్మీర్‌లను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఆక్సాయిచిన్‌ను లదాఖ్‌లో అంతర్భాగంగా భారత్‌ పరిగణిస్తుంది. ఆక్సాయిచిన్‌ నుంచి దక్షిణంగా కొద్ది మైళ్ల దూరంలోనే ప్యాంగ్యాంగ్‌ సో సరస్సు ఉంటుంది. ఆ కొద్ది భూభాగాన్ని అదుపులోకి తీసు కుంటే సరస్సుకు ఉత్తర, తూర్పు భాగాలు పూర్తిగా చైనా వశ మవుతాయి.

ఈ వ్యూహం ప్రకారం జరిగిందే గల్వాన్‌ ఘర్షణ. తాజా అనుమానాల ప్రకారం ఇప్పుడు మొత్తం లదాఖ్‌పైనా, పాక్‌ ఆక్రమణలో ఉన్న గిల్గిట్‌–బాల్టిస్తాన్‌ పైనా కూడా చైనా కన్నేసింది. ఇప్పుడు మనం రెడీమేడ్‌గా విడగొట్టిన రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకదాని మీద చైనా గురిపెట్టినట్టు కనిపిస్తున్నది. చైనా కొత్తగా చెప్పబోయే కథలో ఈ అంశం ఉండబోతున్నది.

టిబెట్‌ను చైనా పశ్చిమ ప్రావిన్స్‌ షింజియాంగ్‌ రాజధాని కష్కర్‌కు అనుసంధానిస్తూ ఆక్సాయిచిన్‌ మీదుగా ఇప్పటికే భారీ రహదారిని చైనా అభివృద్ధి చేసింది. అక్కడి నుంచి లదాఖ్‌ మీదుగా కారాకోరం హైవేను కలుపుతూ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే చైనా బీఆర్‌ఐ కార్యక్రమానికి పెద్ద ఊతం లభిస్తుంది. లదాఖ్, గిల్గిట్‌–బాల్టిస్తాన్‌ల మధ్య 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల షాక్స్‌గమ్‌ ప్రాంతాన్ని పాకిస్తాన్‌ గతంలోనే ధారాదత్తం చేసింది.

ఐనా కూడా ఈ ప్రాంతాన్ని మొత్తంగా కబళించడానికే చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గిల్గిట్‌ – బాల్టిస్తాన్‌ నుంచి దక్షిణ ముఖంగా పాకిస్తాన్‌ గుండా అరేబియా సముద్రాన్ని చేరుకోవచ్చు. అక్కడ పాక్‌ తీరంలో గ్వాదర్‌ నౌకా స్థావరాన్ని కూడా ఇప్పటికే చైనా ఏర్పాటు చేసుకున్నది. హిందూ మహా సముద్రంలోకి వెళ్లడానికి చైనాకు రెండోమార్గం లభ్యమవుతుంది.

గిల్గిట్‌ నుంచి పశ్చిమంగా అఫ్గానిస్తాన్‌ మీదుగా పశ్చి మాసియా చేరువవుతుంది. ఇరాన్‌తో చైనా సంబంధాలు ఇటీ వల గణనీయంగా మెరుగైన నేపథ్యంలో ఈ వెసులుబాటు చైనాకు లాభిస్తుంది. ఉత్తర దిశలో సెంట్రల్‌ ఏసియన్‌ రిపబ్లిక్‌ లపై కర్ర పెత్తనానికి కూడా ఉపయోగపడుతుంది. షింజియాంగ్‌ రాష్ట్రంలోని వీగర్‌ ముస్లింల అసంతృప్తికి సెంట్రల్‌ ఏసియా ఆజ్యం పోయకుండా చూసుకోవచ్చు. పైగా గిల్గిట్‌ – బాల్టిస్తాన్‌ అపారమైన ఖనిజ సంపదకు ఆలవాలమని భావిస్తున్నారు.

హిమనీ నదాలకు నిలయం ఈ ప్రాంతం. ఈ నదాల్లో అపా రమైన జలరాశి నిక్షిప్తమై ఉందట! ఈ ప్రాంతంలో సింధు నది, దాని ఉపనదుల మీద జలవిద్యుత్కేంద్రాలను నిర్మిస్తే 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చట. ఇంత కీలకమైన ప్రాంతం కనుకనే చైనా కన్నేసింది. మరి కబళించేదెట్లా? షీ జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పురావస్తు పరిశోధన (ఆర్కియాలజికల్‌ సర్వే) మీద చైనా ప్రభుత్వానికి ఆపేక్ష పెరిగింది. టిబెట్‌ ప్రాంతపు ఉజ్వల గతాన్ని వెలికి తీయడానికి పలుచోట్ల తవ్వకాలు మొదలుపెట్టారు.

క్రీస్తు పూర్వం ఐదారు శతాబ్దాల నుంచి సుమారు వెయ్యేళ్లపాటు టిబెట్‌ భూభాగంలో షాంగ్‌షుంగ్‌ రాజ్యం ఓ వెలుగు వెలిగిం దనీ, ఆనాటి నిర్మాణ కౌశలం, నాగరికతలపై సర్వే నిపుణులు ఇస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ మీడియాలో అడపాదడపా అచ్చవుతూనే ఉన్నాయి. మూతి ముడుచుకుని బిగదీసుకున్న ట్టుగా ఒక బ్యూరోక్రాట్‌ మాదిరిగా కనిపించే జిన్‌పింగ్‌కు ఆర్కియాలజీ పట్ల గల మక్కువపై జనం ఆశ్చర్యపోతూనే ఉన్నారు. కాకపోతే తవ్వకాల కేంద్రీకరణ ఎక్కువగా లదాఖ్‌ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ, టిబెట్‌ – ఇండియా సరిహద్దు ల్లోనూ కేంద్రీకృతం కావడమే మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నది.

పశ్చిమ టిబెట్‌ ప్రాంతంలోనూ, ప్రస్తుత లదాఖ్, గిల్గిట్‌– బాల్టిస్తాన్‌ ప్రాంతంలోనూ షాంగ్‌షుంగ్‌ (ఝాంగ్‌ ఝుంగ్‌) రాజ్యం విస్తరించి ఉండేదనీ, క్రమంగా టిబెట్‌ ప్రాంతమంత టికీ విస్తరించిందనీ చెబుతున్నారు. టిబెట్‌తోబాటు అరుణాచల ప్రదేశ్, భూటాన్, నేపాల్‌ ప్రాంతాలు (లదాఖ్‌ సహా) కూడా ఒక దశలో షాంగ్‌షుంగ్‌ రాజ్యంలో భాగంగా ఉండేవట! వాటికి శాస్త్రీయ ఆధారాలను ‘సమకూర్చే’ పనిలో ఇప్పుడు చైనా బిజీగా ఉన్నదట! ఆర్కియాలజీ నిపుణులు రేయింబవళ్లు ఈ అంశంపై కృషి చేస్తున్నారు. టిబెట్‌కు బౌద్ధమత సంక్రమణ కూడా షాంగ్‌షుంగ్‌ ద్వారానే జరిగింది. ఏడో శతాబ్దంలో అప్ప టికే ప్రాభవం తగ్గిన షాంగ్‌షుంగ్‌ను టిబెట్‌ ఆక్రమించింది.

1950వ దశకంలో టిబెట్‌ను దురాక్రమణ గావించక ముందు భారత్‌కు చైనాతో గట్టు్ట పంచాయతీ లేదు. అది మన సరిహద్దు దేశం కాదు. టిబెట్‌తోనే ఉత్తరాన లదాఖ్‌ నుంచి తూర్పున అరుణాచల్‌ వరకు సరిహద్దు ఉన్నది. భారత్‌– టిబెట్‌ల మధ్యన బ్రిటిష్‌ వాళ్లు గీసిన మెక్‌మహాన్‌ సరిహద్దు రేఖ చెల్లుబాటయింది. చైనా దురాక్రమణ తర్వాత ఆ సరిహద్దు రేఖను గుర్తించడానికి అది నిరాకరిస్తున్నది. సరిహద్దు రేఖలు సామ్రాజ్యవాదుల కుట్రగా చైనా అభివర్ణిస్తున్నది. భారత్‌తో పాటు చాలా దేశాల్లో నేటికీ టిబెటన్ల స్వాతంత్య్ర కాంక్ష పట్ల ఇంకా సానుభూతి వ్యక్తమవుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో షాంగ్‌షుంగ్‌ నాగరికతను తవ్వి తీయడానికి చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

షాంగ్‌షుంగ్‌ నాగరికతకు చైనా ప్రాచీన సామ్రాజ్యాలకు ఉన్న సారూప్యతనూ, సామీప్యతనూ నిర్ధారించడం కోసం చైనా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే షాంగ్‌షుంగ్‌ రాజ్యం చైనాదవుతుంది. ఈ రాజ్యంలోంచి ఉద్భవించినది గనుక టిబెట్‌ కూడా తమదే అవుతుంది. టిబెటన్ల స్వాతంత్య్ర కాంక్ష చెల్లదు. టిబెట్‌కు ఆధారం షాంగ్‌షుంగ్‌ రాజ్యం కనుక ఆ రాజ్యంలో ఉన్న భాగాలన్నీ టిబెట్‌కే చెందుతాయి. ఆ లెక్కన గిల్గిట్‌– బాల్టిస్తాన్‌ దగ్గర్నుంచి లదాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్‌ప్రదేశ్‌లు కూడా టిబెట్‌లో అంతర్భాగమవుతాయి. టిబెట్‌ చైనాలో అంతర్భాగం కనుక సహజంగానే ఇవన్నీ తమ ప్రాంతాలేనని చైనా వాదించబోతున్నది.

షాంగ్‌షుంగ్‌ కథ ద్వారా తన విస్తరణ కాంక్షను హేతుబద్ధం చేసుకోవడానికి చైనా అడుగులు వేస్తున్నది. రానున్న కాలంలో ఈ ప్రాంతాల్లో మరిన్ని ఘర్షణలు, సరిహద్దులు దాటడం వంటి ఘటనలు జరగవచ్చు. పూర్తిస్థాయి యుద్ధానికి మాత్రం చైనా ఒడిగట్టకపోవచ్చు. రెండూ అతిపెద్ద దేశాలైనందువల్ల, మిలిటరీ పరంగా బలమైన దేశాలైనందువల్ల, అణ్వస్త్ర రాజ్యాలైన కారణంగా అటువంటి దుస్సాహసం చేయక పోవచ్చు.

వాటికంటే ఆర్థిక కారణాలు మరీ ముఖ్యమైనవి. చైనా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్‌ది ఎనిమిదో స్థానం. చైనా మొత్తం ఎగుమతుల్లో కేవలం మూడు శాతం మాత్రమే. కానీ చైనా – భారత్‌ వాణిజ్యంలో చైనాకు భారీ మిగులు ఉంటున్నది. చైనావాళ్లు 94 బిలియన్‌ డాలర్ల కిమ్మత్తయిన సరుకులను ఎగుమతి చేస్తే భారత్‌ నుంచి 21 బిలియన్‌ డాలర్లకు సరిపడా దిగుమతులను మాత్రమే చేసుకుంటున్నారు. ఈ ద్వైపాక్షిక వ్యాపారంలో భారత్‌కు 73 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు.
ఆ మేరకు చైనాకు లాభం. వాణిజ్యంలో చైనాకు లాభాలు పండించే దేశాల్లో భారత్‌ది నాలుగో స్థానం.

భారత పారిశ్రామిక రంగం, వినియోగదారుల మార్కెట్‌ చైనా మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ అది భారత్‌కే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని నీతిఆయోగ్‌ మాజీ వైస్‌చైర్మన్‌ పనగారియా హెచ్చరించడం గమనార్హం. కనుక రెండు దేశాలు యుద్ధానికి సిద్ధపడకపోవచ్చు. కానీ చైనా తన విస్తరణ కాంక్షను సమర్థించుకోవడానికి క్రమంగా చొచ్చుకొని రావడాన్ని హేతుబద్ధం చేసుకోవడానికీ పురావస్తు పరిశోధనలతో ముందుకొస్తున్నది. ఇప్పుడది ఆర్కియాలజికల్‌ వార్‌ను ప్రారంభించింది.

షాంగ్‌షుంగ్‌ నాగరికతపై అందు బాటులో ఉన్న సమాచారాన్ని చదువుతున్నప్పుడు, చైనా కంటే భారత సంస్కృతితోనే దానికి ఎక్కువ సంబంధం ఉన్నట్టు సాధారణ పాఠకుడికి కూడా అర్థమవుతుంది. కానీ, మన ఆర్కి యాలజీని మనం దేశ సమగ్రత కోసం, జాతి గౌరవం కోసం వాడటాన్ని మానేశాం. ఇప్పుడు మన పురావస్తు పరిశోధనంతా మసీదులకు మాత్రమే పరిమితమైంది. మసీదులను తవ్విపోసి, ఆలయాల ఉనికిని వెలికితీసే పనిలో మునిగి తేలుతున్నది. చైనావాళ్లు వారి జాతీయతను ఇనుమడింపజేసుకోవడానికి మనం మన జాతిని చీల్చడానికి ఆర్కియాలజీని ఉపయోగించు కుంటున్నాము. ఇద్దరి మధ్యన ఇదీ తేడా!


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement