‘ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’... ప్రపంచంలోని ఏ మూలనైనా సరే ఈ పేరు వినగానే ఆశ్చర్యం, కోపం, జాగరూకత వంటి అనేక భావాలు వ్యక్తమవుతాయి. అంతేకాదు.. పెత్తందారీ పోకడలు, అప్రజాస్వామిక, అణచివేత ధోరణులు, దురహంకార పూరిత దేశంగా కొందరికీ... భారీ ప్రాజెక్టులు, విశాలమైన రహ దారులతో అభివృద్ధికి వేగంగా బాటలు వేసుకున్న దేశంగా ఇంకొందరికీ గుర్తుంటుంది. విషయం ఏమిటంటే.. ఈ ఆలోచన లన్నింటి వెనుక ఉన్న శక్తి.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ). అక్టోబరు 16వ తేదీ నుంచి తన ఇరవయ్యవ జాతీయ కాంగ్రెస్ సమావేశాలను ఇది నిర్వహించుకుంటోంది.
ఈ సమావేశాల తరువాత షీ జిన్‌పింగ్ అనూహ్యంగా... మూడోసారి పార్టీ జనరల్ సెక్రటరీగా ఎంపిక కానున్నారు. పాలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఇంకో ఆరుగురి ఎంపిక కూడా ఈ సమావేశాల్లోనే జరుగుతుంది. చైనాలో నాయకత్వ మార్పును సూచించే రెండు సమావేశాల్లో ఇది ప్రధానమైంది. వచ్చే ఏడాది మార్చిలో చైనా ప్రభుత్వ నాయకత్వం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌నూ మార్చేయనుంది. బహుశా ఆ తరు వాతి కాలంలో దేశానికి ఒక కొత్త ప్రీమియర్ నియామకం జరిగే అవకాశం ఉంది.
చిట్టచివరిగా పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు చోటు చేసు కున్నది 2017 మధ్యకాలంలో! అప్పటికీ, ఇప్పటికీ చైనాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో ఒక బలీయమైన శక్తిగా ఎదగాలన్న దాని ఆకాంక్ష వ్యక్తీకరణకూ వేదిక ఈ సమావేశాలే. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు ఈ సమావేశాలు నాయకత్వ మార్పిడి జరిగే వేదిక గానే కాకుండా... గత సమావేశాల నుంచి సాధించిన ప్రగతిని సమీక్షించేందుకూ, రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అంశాలపై ప్రణాళిక రచనకూ కేంద్రం. ఇదంతా జనరల్ సెక్రటరీ సమర్పించే నివేదిక ద్వారా వ్యక్తమవుతుంది. 2017లో షీ జిన్ పింగ్ సుమారు మూడున్నర గంటలపాటు ఏకధాటిగా ప్రసం గించి ‘కలల చైనా’ అన్న ఇతివృత్తంపై మాట్లాడారు. ఈసారి అటువంటి అద్భుత ప్రసంగమే జరగవచ్చు.
షీ జిన్‌పింగ్ పార్టీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎంపిక కావడం ఇప్పుడు లాంఛనమే. 2012లో జిన్‌పింగ్ అధికారం చేపట్టినప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండేది. గృహనిర్మాణం వంటి రంగాల్లో లోటుపాట్లేవీ పైకి కనిపించేవి కూడా కాదు. గృహ వినియోగం క్రమేపీ పెరుగుతూండేది. ఎగు మతులు లక్ష్యంగా పెట్టుబడులూ వస్తూండేవి. అంతేకాదు... స్థానికంగా వ్యాపారం చేసుకునే వాతావరణమూ ఇప్పటిలా కాకుండా... చాలా సానుకూలంగా ఉండేది. మైనార్టీల అణచివేత వంటి చైనా అరాచకాల గురించి అప్పట్లోనూ అందరికీ తెలుసు కానీ అదింకా సామూహిక కారాగారాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరలేదు. హాంకాంగ్‌తో సంబంధాలూ ఒడుదొడుకుల్లేకుండానే సాగేవి కానీ ‘నేషనల్ సెక్యూరిటీ లా’ పేరుతో ఇప్పుడు ఆ పరి స్థితి పూర్తిగా మారిపోయింది.
అంతర్జాతీయ స్థాయిలో చైనాను ఓ ప్రత్యర్థి/పోటీదారుగానే చూశారు కానీ విధ్వంసం సృష్టించే దేశంగా చూడలేదు. ఇరుగు పొరుగుతో చైనా సంబంధాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. కోవిడ్–19 కట్టడిలో విఫలమైన తరువాత, ఉక్రె యిన్‌పై రష్యా దాడులకు మద్దతు తరువాత చైనాను బాధ్యతాయుతమైన దేశంగా పరిగణించడమూ తగ్గింది. తైవాన్ సరిహద్దులపై క్షిపణులు ప్రయో గించడం, అది కూడా అమెరికా స్పీకర్ అక్కడకు వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే జరగడం ప్రపంచం దృష్టిని దాటలేదు. అందుకేనేమో... చైనా ఓ నిరపాయకరమైన దేశం కాదన్న భావనపై అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఏర్పడుతోంది.
ఇవన్నీ ఒకవైపున సాగుతూండగానే జిన్‌పింగ్ చైనాలో కమ్యూనిస్టు పార్టీని అన్నింటికీ కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య ఘర్షణ; అపోహల వంటివాటికి స్థానం లేకుండా దేశంలోని అన్ని రకాల సంస్థలకూ డీఫ్యాక్టో ఛైర్మన్‌గా మారిపోయాడు. అందుకే షీ జిన్‌పింగ్‌ను ‘ఛైర్మన్ ఆఫ్ ఎవ్రీథింగ్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ నాయకత్వానికి పోటీని పూర్తిగా తొలగించారు షీ జిన్‌పింగ్. నాయకత్వానికి పోటీ కాస్తా వర్గపోరుగా మారిపోతూండటం... పుకార్లు ప్రచారంలో పెట్టడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం జరుగు తూండటం వంటివన్నీ తగ్గిపోయాయి. సవాలు విసిరిన స్థానిక అవినీతిని కూడా జిన్‌పింగ్ దీటుగానే ఎదుర్కొన్నాడు. అవినీతి నిర్మూలన ప్రయత్నాలు కాస్తా రాజకీయ ప్రక్షాళనకూ దారి తీశాయి. కానీ ఈ ప్రస్థానంలో ఉమ్మడి నాయకత్వమన్న ఆలోచనకు ఫుల్‌స్టాప్ పడింది కూడా. జిన్‌పింగ్‌కు అన్ని విధాలుగా మద్దతు లభించేందుకు వీలుగా దాదాపు 30 ఏళ్ల తరువాత ‘మూల నేత’ అన్న భావనను ముందుకు తెచ్చారు.
జిన్‌పింగ్ సాధించిన అనేకానేక ఘనతల్లో చైనీస్ మిలటరీ ప్రక్షాళన కూడా ఒకటి. లంచాలకు మరిగారన్న ఆరోపణపై ఉన్నత స్థానంలో ఉన్న పలువురు అధికారులను కటకటాల వెనక్కు తోసేశారు. అదే సమయంలో మానవ హక్కులపై పోరాడుతున్న అనేకమంది న్యాయవాదులనూ అరెస్ట్ చేయడం, ఫెమినిస్టు వర్గాలపై కూడా ఉక్కుపాదం మోపడం, విదేశీ భావజాలం వ్యాపించకుండా అణచివేయడం కోసం యూనివర్సిటీ తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటివి ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైన చర్యలు.
ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే చైనా కూడా బలీయమైన శక్తిగా ఎదగాలని కోరుకుంటోంది. అయితే వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి సవాళ్లు బయటి నుంచి ఎదురవుతున్నాయి. అయితే చైనా తన అధికారాన్ని విస్తరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సవాళ్లూ లేక పోలేదు. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, వినియో గమూ తగ్గిపోతూండటం వాటిల్లో కొన్ని మాత్రమే. ఏంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూపై చెలరేగిన వివాదం వ్యాపారం చేసుకునే వాతావరణంపై సందేహాలు లేవనెత్తింది. పైగా కోవిడ్ కట్టడికి చేపట్టిన అనేక చర్యలు చైనాలో సాధారణ పరిస్థితులు నెల కొంటాయన్న ఆలోచనలపై చన్నీళ్లు చల్లాయి. చైనీయుల్లోనూ నిరాశా నిస్పృహలనూ, కోపాన్నీ పెంచాయి.
సుమారు రెండు వేల మంది పార్టీ ప్రతినిధులు పైన పేర్కొన్న అనేక అంశాలపై పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లడం, భవిష్యత్తు ప్రణాళికను ఆమోదించడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి బీజింగ్‌లో సమావేశమవుతున్నారు. చైనాలోని అసమానతలను రూపుమాపడానికి అవసరమైన సామూహిక వృద్ధి అన్న పార్టీ కేంద్ర భావన ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషించనుంది. స్థానికంగా వినియోగాన్ని పెంచడం, కొత్త కొత్త ఆవిష్కరణలు, స్థానికంగా పోటీతత్వాన్ని మరింత పెంచడం ద్వారా అసమానతలను తగ్గించాలని చైనా యోచి స్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి సమావేశాల తరువాత చైనా ప్రపంచం దృష్టిలో తన ఇమేజ్‌ను మార్చు కునేందుకు ప్రయత్నిస్తుందన్న అంచనాలున్నాయి. ఏం జరుగనుందో వచ్చే వారం రోజుల్లో బహిర్గతమవుతుంది.
అవినాశ్ గోడ్బోలే , వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, ఓపీజేజీయూ
(‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment