ప్రపంచంలోనే అతి పెద్ద రహస్య సమాజం ఏదంటే.. | The Chinese Communist Party Does Not Want You to Know | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి పెద్ద రహస్య సమాజం ఏదంటే..

Published Thu, Jul 1 2021 11:38 AM | Last Updated on Thu, Jul 1 2021 12:40 PM

The Chinese Communist Party Does Not Want You to Know - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌:  చైనా పాలక కమ్యూనిస్ట్‌ పార్టీ(సీసీపీ) గురువారం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా డ్రాగన్‌ దేశం ఎదగడంలో సీసీపీ ప్రాముఖ్యత ఎంతో ఉంది. తొలుత షాంఘైలో చట్టవిరుద్ధమైన మార్క్సిస్ట్‌ ఉద్యమంగా ప్రారంభమైన ఈ పార్టీ ఆ అసమ్మతివాదుల ప్రక్షాళన, కఠిన నిఘా వంటి చర్యలతో ఆ తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా ఎదిగింది. చైనాలో ప్రతి విషయం అత్యంత గోప్యంగా ఉంటుంది. ప్రభుత్వ విధనాలు ఏంటి అనే దాని గురించి అస్సలు బయటకు వెల్లడించరు. ఈ క్రమంలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఓ ఐదు విషయాల గురించి సామాన్య జనాలు మాట్లాడటాన్ని అసలు అనుమతించదు. మరి ఆ ఐదు విషయాలు ఏంటో ఇక్కడ చదవండి..

పార్టీలో సభ్యులు ఎవరు
చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 95.1 మిలియన్ల మందితో కార్యకర్తలతో ప్రపంచంలో రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయితే సభ్యుల పేర్లను మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. పార్టీ సభ్యత్వం పొందాలంటే ముఖ్యంగా సదరు వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు ఉండకూడదు. 180 మిలియన్ల మంది కార్యకర్తలను ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ తరువాత ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీ.

సీసీపీ సంస్థ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 6.5 మిలియన్ల మంది సభ్యులు మాత్రమే కార్మికులు కాగా, 25.8 మిలియన్లు వ్యవసాయ కార్మికులు, 41 మిలియన్ల వైట్ కాలర్ నిపుణులు, 19 మిలియన్ల మంది రిటైర్డ్ క్యాడర్లు సభ్యులుగా ఉన్నట్లు ప్రకటించింది. కానీ వారి పేర్లు ఎక్కడా కానరావు.

సీసీపీకి నిధులు ఎలా సమకూరుతాయి..
సీసీపీ ఇంతవరకు తన బడ్జెట్‌ను బయటకు వెల్లడించలేదు. పార్టీ నాయకుల వ్యక్తిగత సంపద అనేది ఇక్కడ చాలా సున్నితమైన అంశం. సీసీపీ సభ్యులు తమ ఆదాయంలో రెండు శాతం వరకు పార్టీకి విరాళంగా ఇస్తారు. 2016 లో, ఒక అధికారిక పత్రిక మునుపటి సంవత్సరానికిగాను మొత్తం 7.08 బిలియన్ యువాన్లు (1 బిలియన్ డాలర్లు) విరాళంగా వచ్చాయని నివేదించింది.

అయితే ఈ విరాళాలు అనేవి పార్టీ ఆదాయంలో కొద్ది భాగం మాత్రమే. పార్టీ ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి అనేక కంపెనీలు, హోటళ్ళు, ఫ్యాక్టరీలను నేరుగా నిర్వహిస్తుందని హాంకాంగ్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన జీన్-పియరీ క్యాబెస్టన్ తెలిపారు. ఇక పార్టీ నాయకుల జీతాలు, ప్రోత్సాహకాల గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండదు. 

లాభదాయకమైన పెట్టుబడుల ద్వారా చైనా నాయకులు, వారి కుటుంబాలు చేసిన భారీ అక్రమాలపై వార్తలు ప్రచురించినందుకు అనేక విదేశీ మీడియా సంస్థలపై సీసీపీ ప్రతీకారం తీర్చుకుంది. 2012 బ్లూమ్‌బెర్గ్ దర్యాప్తులో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దగ్గరి బంధువులు బిలియన్ల యువాన్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని అంచనా వేసింది.

సీసీపీ బాధితులెందరంటే..
1949 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ విధానాల ఫలితంగా చైనాలో 40 నుంచి 70 మిలియన్ల మంది మరణించి ఉంటారని చాలా మంది విదేశీ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో అనేక అంతర్గత ప్రక్షాళనలు, గ్రేట్ లీప్ ఫార్వర్డ్ - మావో జెడాంగ్ వినాశకరమైన ఆర్థిక విధానం(ఇది పదిలక్షల మంది ఆకలితో చనిపోవడానికి దారితీసింది), టిబెట్‌లో అణచివేత, దశాబ్దాల సాంస్కృతిక విప్లవం, 1989 టియానన్మెన్ స్క్వేర్ అణిచివేత వంటి ఘటనల వల్ల చాలామంది మరణించినట్లు సమాచారం. 

ఖైదీల నుంచి బలవంతంగా అవయావాలు తీసుకుంటుందనే ఆరోపణలను చైనా పదేపదే ఎదుర్కొంది. మరీ  ముఖ్యంగా నిషేధించబడిన ఫలున్ గాంగ్ ఆధ్యాత్మిక ఉద్యమ సభ్యుల నుంచి అవయావాలను తీసుకుంటుందనే ఆరోపణలు కోకొల్లలు. అయితే బీజింగ్‌ వీటిని ఖండించింది. జిన్జియాంగ్‌లోని ఒక మిలియన్ మంది ఉయ్ఘరు, ఇతర మైనారిటీలను నిర్బంధ శిబిరాల్లోకి చేర్చారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. కానీ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే ఇలా చేస్తున్నట్లు బీజింగ్‌ తన చర్యలను సమర్థించుకుంది.

ఎవరిని ప్రత్యర్థులుగా చూస్తుందంటే.. 
అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది కార్యకర్తలు, న్యాయవాదులు, హక్కుల న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు, అరెస్టు చేశారు. జిన్‌పింగ్‌ నాయకత్వంలో పౌర సమాజంపై కఠిన ఆంక్షలు విధించారు. రాజకీయ ప్రత్యర్థులను ప్రక్షాళన చేయడానికి ఈ ప్రచారం కూడా ఉపయోగపడిందని విమర్శకులు చెబుతున్నప్పటికీ, అవినీతిపై ఆయన చేసిన అణచివేత కింద పదిలక్షల మంది అధికారులు శిక్షించబడ్డారు. 

2015 అణచివేత సందర్భంగా వందలాది మంది న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. హాంకాంగ్‌లో, డజన్ల కొద్దీ మందిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం అభియోగాలు మోపబడ్డాయి. ఇటీవల దేశంలో తీసుకువచ్చిన ఆర్ధిక సంస్కరణల ఫలితంగా యువ జాతీయవాదుల నుంచి నిజమైన మద్దతు లభించనట్లు పార్టీ ప్రగల్భాలు పలుకుతుంది. కాని మీడియాపై కఠినమైన నియంత్రణ, ఆన్‌లైన్ చర్చలను నియంత్రించే నియమాలు భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాయి. 

రహస్య సమావేశాలు..
సీసీపీ సమావేశాలలో సాధారణంగా ఐదేళ్ల కాంగ్రెస్ ఉంటుంది, ఇది సాధారణంగా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటుంది. 200 మంది కేంద్ర కమిటీ సభ్యులు, పొలిటికల్‌ బ్యూరో, అంతర్గత మంత్రివర్గంతో ఉన్నత స్థాయి సమావేశాలు అత్యంత రహస్యంగా జరుగుతాయి. జాతీయ మీడియా అధికారికంగా ఆమోదించిన సమాచారాన్నే ప్రసారం చేస్తుంది. దేశంలోని అంతర్గత ఉద్రిక్తతలను దాచి.. శత్రువులకు ఉక్కు పిడికిలి చూపిస్తుంది. ఈ కారణాల వల్ల చైనా "ప్రపంచంలోనే అతిపెద్ద రహస్య సమాజం" గా నిలుస్తుందని విశ్లేషకులు తెలిపారు. 

చదవండి: డ్రాగన్‌ పన్నాగం: సరిహద్దులో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement