![President Xi Jinping close aide Li Qiang confirmed as China new Premier by Parliament - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/12/QIANG-4.jpg.webp?itok=Mu98sK0h)
బీజింగ్: చైనా ప్రధానిగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడైన లీ కియాంగ్ (63) నియమితులయ్యారు. పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) తీసుకున్న ఈ నిర్ణయానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ఈ మేరకు లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. లీ పేరును జిన్‌పింగ్ స్వయంగా ప్రతిపాదించారు. అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం విశేషం! మొత్తం 2,936 మంది ఎన్‌పీసీ సభ్యుల్లో ముగ్గురు లీకి వ్యతిరేకంగా ఓటేయగా మరో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం లీ నియామక ఉత్తర్వులపై జిన్‌పింగ్ సంతకం చేశారు.
ఆ వెంటనే ప్రస్తుత ప్రధాని లీ కీ కియాంగ్ నుంచి లీ బాధ్యతలను స్వీకరించారు. ఒడిదుడుకులమయంగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే గురుతర బాధ్యత ఆయన భుజస్కందాలపై ఉంది. అందుకు చేపట్టబోయే చర్యలను మార్చి 13న మీడియా సమావేశంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు. లీకి వ్యాపారవేత్తల పక్షాన నిలుస్తారని పేరుంది. తాజా మాజీ ప్రధాని లీ కి కియాంగ్‌కు కొన్నేళ్లుగా జిన్‌పింగ్‌తో దూరం పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు అధ్యక్ష పీఠానికి పోటీదారుగా నిలిచిన ఆయన ప్రధానిగా తన అధికారాలకు జిన్‌పింగ్ పూర్తిగా కోత పెట్టడంపై అసంతృప్తిగా ఉన్నారు. పదవి నుంచి వైదొలగిన ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment