Alibaba Founder Jack Ma Missing Story: Unknown Facts And Mysteries In Telugu - Sakshi
Sakshi News home page

Jack Ma Story In Telugu: అలీ ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకులు పడ్డదెలా?

Published Sun, Nov 7 2021 4:38 AM | Last Updated on Sun, Nov 7 2021 11:16 AM

Jack Ma, Trump and Xi: How the Chinese billionaire flew close to the sun - Sakshi

Alibaba CEO Jack Ma Missing Story: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు! అలాగే ఏదైనా ఒక్క పొరపాటు, లేదా నిర్ణయం కూడా మనిషిని అమాంతం అగాధంలోకి నెట్టేయవచ్చు... ఈ–కామర్స్‌ కుబేరుడు ‘జాక్‌–మా’ విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ... కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను... కలవాలని బుద్ధి పుట్టడం కాస్తా అతని పాలిట శాపమైంది... ‘జాక్‌–మా’ ప్రాభవాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా... కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే.. ఎక్కడున్నాడో... ఏమైపోయాడో? తెలియనంతగా జాక్‌–మా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఉక్కుపిడికిలిలో చిక్కిన ఉడుతలా విలవిల్లాడిపోయాడు. ఏమా కథ కమామిషు!!! 
 
సరిగ్గా ఏడాది క్రితం నాటి మాట. అలీబాబాతో అప్పటికే ఈ కామర్స్‌ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన జాక్‌–మా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఐపీవోకు వెళుతన్న సమయం అది. ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆకస్మాత్తుగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అలీబాబా సామ్రాజ్యంపై పంజా విసిరింది. రాత్రికి రాత్రి జాక్‌–మా రెక్కలు కత్తిరించేసింది. ఆ తరువాత జాక్‌–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో కొంత కాలం పాటు ఎవరికీ తెలియలేదు. జైలు నిర్బంధంలో ఉన్నాడని కొందరు, దేశం వదిలి పోయాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు కానీ.. వాస్తవం ఏమిటో జాక్‌–మా, చైనా ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసు.

సుదీర్ఘ విరామం తరువాత జాక్‌ తొలిసారి కొన్ని రోజుల క్రితం యూరప్‌లో మళ్లీ ప్రత్యక్షమవడం అతడి ఆంట్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడులు పెట్టినవారికి ఎంతో ఉత్సాహం కలిగించింది. యూరప్‌లో జాక్‌ తాజా వ్యాపకం ఏమిటో తెలుసా? ఉద్యానవన పంటలు పండించడం అట! అంతా బాగానే ఉంది కానీ... ఎవరెస్ట్‌ శిఖరమంత ఎత్తులో ఉన్న ఈ ఈకామర్స్‌ రాజు రాత్రికి రాత్రి అధఃపాతాళానికి ఎలా పడిపోయాడు? ఏం జరిగింది?  ఈ విషయం తెలుసుకోవాలంటే... నాలుగేళ్ల వెనక్కు వెళ్లాలి.

ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో జాక్‌–మా చైనా నవతరం ప్రతినిధి. అప్పట్లో జాక్‌–మా ప్రాభవం అంతా ఇంతా కాదు. చైనా తరఫు దౌత్యవేత్త స్థాయిలో ఉండేవాడు. తెరవెనుక ఏం జరిగిందన్నది మనకు తెలియకపోయినా ఓ శుభ ముహూర్తంలో ఈయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికై అధికార బాధ్యతలు చేపట్టాల్సిన డొనాల్డ్‌ ట్రంప్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 2017లో న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్స్‌లో జనవరి తొమ్మిదిన ట్రంప్‌తో సిట్టింగ్‌ వేయడమే కాకుండా.. ఓ పదిలక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చేస్తానని భరోసా కూడా ఇచ్చేశారు.

అంత పెద్ద వాణిజ్యవేత్త కదా.. ఉద్యోగాలు కల్పిస్తే ఏమిటి తప్పు? అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఉంది మతలబు. జాక్‌ – మా హామీలు మాత్రమే  కాదు.. ట్రంప్‌తో అతడి సమావేశంపై చైనా ప్రభుత్వానికి వీసమెత్తు అవగాహన లేదు. ట్రంప్‌తో సమావేశం జరిగిన కొన్ని రోజులకు అలీబాబా ప్రధాన కార్యాలయం లాబీలో జాక్‌–మా నిర్వహించిన పత్రికా సమావేశం ద్వారా ఇతరులతోపాటు చైనా ప్రభుత్వానికీ ఈ సంగతులన్నీ తెలిశాయి! ఇది ప్రభుత్వ పెద్దలకు అంతగా రుచించలేదు. ఇరుపక్షాల మధ్య వైరానికి బీజం పడింది ఇక్కడే!  

అప్పటికే ఉప్పు.. నిప్పు
డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన నేపథ్యంలో అతడు అధ్యక్ష పదవి చేపట్టే నాటికే  ట్రంప్‌కు, చైనాకు మధ్య వ్యవహారం ఉప్పు–నిప్పు చందంగానే ఉండింది. ఆ దశలో జాక్‌–మా, ట్రంప్‌ల మీటింగ్‌ జరగడంతో సమస్య మొదలైంది. ఆ తరువాత కూడా జాక్‌– మా 2018– 2020 మధ్యలో పలువురు దేశాధ్యక్షులు, ఉన్నతాధికారులను కలుస్తుండటం జిన్‌ పింగ్‌ నేతృత్వంలోని చైనా ప్రభుత్వానికి అంతగా రుచించలేదు. గత ఏడాది అక్టోబరులో జాక్‌ – మా ఓ ఉపన్యాసం చేస్తూ.. చైనాలో సృజనాత్మకతను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడంతో వ్యవహారం ముదిరింది.

నవంబరు 5న జాక్‌–మా ఐపీవో ఉండగా రెండు రోజుల ముందే దాన్ని రద్దు చేశారు. బోర్డును రద్దు చేసి పునఃవ్యవస్థీకరించాలని చెప్పడంతోపాటు మా కంపెనీలపై దాడులు మొదలయ్యాయి. పలు అక్రమాలు జరిగాయంటూ మా చేత ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి 275 కోట్ల డాలర్ల జరిమానా కట్టించుకున్నారు. ఒకానొక  దశలో జాక్‌–మా దాదాపు మూడు నెలలపాటు అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.

మారిపోయిన సీన్‌...
చైనా ప్రభుత్వం దాడుల తరువాత జాక్‌ – మా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో ‘మా’ జిన్‌పింగ్‌కు ఒక లేఖ రాస్తూ.. జీవితాంతం చైనా గ్రామీణుల విద్యాభివృద్ధికి కేటాయిస్తానని, కనికరించమని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత నెలలో జాక్‌–మా కే చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక మా వ్యవసాయ, పర్యావరణ సంబంధిత అధ్యయనం కోసం యూరప్‌ వెళుతున్నారని ప్రకటించడంతో ఆయన ఉనికి మళ్లీ ప్రపంచానికి తెలిసింది.

వారం రోజుల క్రితం మా ఓ పూలకుండీతో ఫొటో కనిపించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటినిచ్చిందని అంటున్నారు. జాక్‌–మా భాగస్వామిగా, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జోసెఫ్‌ సి త్సాయి జూన్‌ నెలలో సీఎన్‌బీసీ టీవీతో మాట్లాడుతూ... ‘‘జాక్‌–మా తో రోజూ మాట్లాడుతున్నాను. అతడికేదో అపారమైన అధికారం ఉందని అనుకుంటున్నారు. అదేమంత నిజం కాదు. అతడూ మనందరి మాదిరిగానే ఓ సామాన్య వ్యక్తి’’ అనడం కొసమెరుపు!!
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement