అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా | Trade with America India Pushed Back China | Sakshi
Sakshi News home page

అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా

Published Mon, Oct 23 2023 3:19 PM | Last Updated on Mon, Oct 23 2023 6:53 PM

Trade with America India Pushed Back China - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం మెరుగ్గానే కొనసాగడం గమనార్హం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య చైనాను వెనక్కునెట్టి యూఎస్‌కు ఇండియా అతిపెద్ద ట్రేడ్ పార్టనర్‌గా ఉద్భవించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితితో పాటు ఎగుమతులు, దిగుమతుల్లో భారీ క్షీణత ఏర్పడింది. అయినప్పటికీ భారత్‌కు అమెరికా ఆతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం మేర క్షీణించి 59.67 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ తాత్కాలిక డేటా వెల్లడించింది.

2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాదిలో 41.49 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఎగుమతులు తగ్గాయి. దిగుమతుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 25.79 బిలియన్ డాలర్ల మేర భారత్‌ దిగుమతులు చేసుకోగా.. ఈసారి ఇది 21.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.

ఇక భారత్, చైనాల మధ్య వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చైనాకు ఎగుమతులు 7.84 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా 7.74 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు అంతకు ముందు ఏడాది 52.42 బిలియన్ డాలర్లు కాగా..ఇప్పుడు 50.47 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఇండియా, అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులు క్షీణిస్తున్నాయి. వృద్ధి రేటు త్వరలోనే సానుకూలంగా మారుతుందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement