China trade practice
-
అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం మెరుగ్గానే కొనసాగడం గమనార్హం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య చైనాను వెనక్కునెట్టి యూఎస్కు ఇండియా అతిపెద్ద ట్రేడ్ పార్టనర్గా ఉద్భవించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితితో పాటు ఎగుమతులు, దిగుమతుల్లో భారీ క్షీణత ఏర్పడింది. అయినప్పటికీ భారత్కు అమెరికా ఆతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం మేర క్షీణించి 59.67 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ తాత్కాలిక డేటా వెల్లడించింది. 2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాదిలో 41.49 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఎగుమతులు తగ్గాయి. దిగుమతుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 25.79 బిలియన్ డాలర్ల మేర భారత్ దిగుమతులు చేసుకోగా.. ఈసారి ఇది 21.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇక భారత్, చైనాల మధ్య వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చైనాకు ఎగుమతులు 7.84 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా 7.74 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు అంతకు ముందు ఏడాది 52.42 బిలియన్ డాలర్లు కాగా..ఇప్పుడు 50.47 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఇండియా, అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులు క్షీణిస్తున్నాయి. వృద్ధి రేటు త్వరలోనే సానుకూలంగా మారుతుందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
అమెరికా వ్యాఖ్యలపై చైనా సీరియస్
బీజింగ్ : తమ మేథోసంపత్తి, టెక్నాలజీ హక్కులను చైనా చోరి చేస్తుందంటూ అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారణకు ఆదేశిస్తే, ఇరు దేశాలకు మధ్య వాణిజ్య యుద్ధం తప్పందంటూ చైనా ఆర్థిక నిపుణుడు మై జిన్ యు హెచ్చరించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలకడగా ఉన్నాయని, ఈ అంశంపై ట్రంప్ విచారణకు ఆదేశిస్తే, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపించడమేనని అభిప్రాయపడ్డారు. కాగ, అమెరికా మేథోసంపత్తి హక్కులను, తమ టెక్నాలజీని చైనా ఉల్లంఘిస్తుందనే ఆరోపణలపై ట్రంప్, తన చీఫ్ ఎకనామిక్ అడ్వయిజరీకి సోమవారం విచారణ ఆదేశాలు జారీచేయనున్నట్టు పోలిటికో రిపోర్టు చేసింది. ఈ విచారణలో టెక్నాలజీ ఆవిష్కరణలు, సినిమా, ఇతర కళాత్మక ఉత్పత్తులు, పారిశ్రామిక డిజైన్లు, మిలటరీ రహస్యాలు ఉండనున్నాయి. 1974 వాణిజ్య చట్టం సెక్షన్ 301కింద ట్రంప్ విచారణకు ఆదేశించవచ్చని తెలిసింది. అంతేకాక భాగస్వామ్య దేశాలపై టారిఫ్లను లేదా ఇతర వాణిజ్య పరిమితులను మరింత కఠినతరం చేయనున్నారు. ఇవి అమెరికా ఆర్థిక సమస్యలను పరిష్కరించవని, దీర్ఘకాలికంగా అమెరికాను మరింత కుంగదీస్తాయంటూ మరో చైనీస్ నిపుణుడు కూడా హెచ్చరించారు. ఎక్కువ మొత్తంలో టారిఫ్లతో సహజ ఆర్థిక సూత్రాలకు భంగం వాటిల్లించనట్టేనని తెలిపారు.