అమెరికా వ్యాఖ్యలపై చైనా సీరియస్
బీజింగ్ : తమ మేథోసంపత్తి, టెక్నాలజీ హక్కులను చైనా చోరి చేస్తుందంటూ అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. చైనాపై చేస్తున్న ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారణకు ఆదేశిస్తే, ఇరు దేశాలకు మధ్య వాణిజ్య యుద్ధం తప్పందంటూ చైనా ఆర్థిక నిపుణుడు మై జిన్ యు హెచ్చరించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలకడగా ఉన్నాయని, ఈ అంశంపై ట్రంప్ విచారణకు ఆదేశిస్తే, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపించడమేనని అభిప్రాయపడ్డారు. కాగ, అమెరికా మేథోసంపత్తి హక్కులను, తమ టెక్నాలజీని చైనా ఉల్లంఘిస్తుందనే ఆరోపణలపై ట్రంప్, తన చీఫ్ ఎకనామిక్ అడ్వయిజరీకి సోమవారం విచారణ ఆదేశాలు జారీచేయనున్నట్టు పోలిటికో రిపోర్టు చేసింది.
ఈ విచారణలో టెక్నాలజీ ఆవిష్కరణలు, సినిమా, ఇతర కళాత్మక ఉత్పత్తులు, పారిశ్రామిక డిజైన్లు, మిలటరీ రహస్యాలు ఉండనున్నాయి. 1974 వాణిజ్య చట్టం సెక్షన్ 301కింద ట్రంప్ విచారణకు ఆదేశించవచ్చని తెలిసింది. అంతేకాక భాగస్వామ్య దేశాలపై టారిఫ్‌లను లేదా ఇతర వాణిజ్య పరిమితులను మరింత కఠినతరం చేయనున్నారు. ఇవి అమెరికా ఆర్థిక సమస్యలను పరిష్కరించవని, దీర్ఘకాలికంగా అమెరికాను మరింత కుంగదీస్తాయంటూ మరో చైనీస్ నిపుణుడు కూడా హెచ్చరించారు. ఎక్కువ మొత్తంలో టారిఫ్‌లతో సహజ ఆర్థిక సూత్రాలకు భంగం వాటిల్లించనట్టేనని తెలిపారు.