సాక్షి, న్యూఢిల్లీ : కనీస ఆదాయ హామీ పధకంతో పేదరికంపై మెరుపు దాడులు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ్ పధకంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పధకం స్ఫూర్తి మంచిదే అయినా దేశంలో వాస్తవ ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకుంటే ఇంతటి భారీ వ్యయం సాధ్యం కాదని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.
ఈ పధకం క్షేత్రస్ధాయిలో వృద్ధికి ఊతమిస్తుందని ఆయన అంగీకరించారు. ఈ పధకాన్ని భారత ఆర్థిక వ్యవస్థ ఎంతమేరకు భరిస్తుందనేది ప్రశ్నార్దకమన్నారు. న్యాయ్ పధకానికి ఏటా రూ 3.34 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని, ఇది దేశ బడ్జెట్‌లో 13 శాతమని ఆయన పేర్కొన్నారు. ఈ స్ధాయిలో నిధులు అవసరం కాగా ప్రభుత్వం వాటిని ఎలా సర్దుబాటు చేస్తుందనేది చూడాలన్నారు.
ఇక ప్రస్తుతమున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తూనే ఈ పధకాన్ని చేపట్టడం కష్టసాధ్యమన్నారు. ఈ పధకాన్ని సమర్ధంగా అమలు చేయగలిగితే విప్లవాత్మక ఫలితాలు చేకూరుతాయన్నారు. ప్రజలు సొంతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారన్నారు. దేశంలో ప్రస్తుతం ద్రవ్య లోటును పరిగణనలోకి తీసుకుంటే కనీస ఆదాయ హామీ పధకం సాధ్యం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment