రెండోసారి ఆర్‌బీఐ పగ్గాలొద్దు
- గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టీకరణ
- సెప్టెంబర్ 4 తర్వాత మళ్లీ అధ్యాపక వృత్తిలోకి
- బ్రెగ్జిట్ ముప్పు ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు
- ద్రవ్యోల్బణ కట్టడి, బ్యాంకుల ప్రక్షాళన ఇంకా ఉందని వ్యాఖ్య
- ఆయన నిర్ణయం దేశానికి నష్టం: పారిశ్రామిక వేత్తలు
- ప్రభుత్వం కావాలనే సాగనంపుతోంది: చిదంబరం
ముంబై: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవిని రఘురామ్ రాజన్ రెండోసారి చేపడతారా!! లేదా!! అన్న విషయమై సస్పెన్స్‌కు తెరపడింది. మరోసారి ఆ పదవిలో కొనసాగలేనని ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ స్వయంగా ప్రకటించారు. రాజన్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి సంచలన ఆరోపణలు చేయటంతో... ఆయన రెండోసారి పదవీ బాధ్యతలు చేపడతారా, లేదా? ప్రభుత్వం కొనసాగమంటుందా, లేదా? అనే అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజన్ ఆర్‌బీఐ ఉద్యోగులకు లేఖ రాస్తూ... తాను రెండోసారి గవర్నర్ బాధ్యతలు చేపట్టబోవటం లేదని స్పష్టంచేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 4న గవర్నర్‌గా పదవీకాలం ముగిశాక తిరిగి షికాగో వర్సిటీలో అధ్యాపక వృత్తిని చేపడతానని అందులో తెలిపారు. ‘ప్రభుత్వంతో మాట్లాడాకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అవసరమైనప్పుడు స్వదేశానికి సేవలందించటానికి నేను సిద్ధంగా ఉంటా’ అని లేఖలో తెలిపారు. ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకుల ఖాతా పుస్తకాలను ప్రక్షాళణ చేయడం అన్న రెండు లక్ష్యాలనూ ఇంకా పూర్తి చేయాల్సి ఉందనిపేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగుతుందన్న (బ్రెగ్జిట్) వార్తల నేపథ్యంలో రాజన్ ఆర్‌బీఐ నుంచి నిష్ర్కమించడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలుండడం తెలిసిందే. అయితే, బ్రెగ్జిట్ ముప్పు వంటి అస్థిరతలను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ వద్ద తగిన వనరులున్నాయని రాజన్ తెలియజేశారు.
నాన్ రెసిడెంట్ డిపాజిట్ల కాలపరిమితి సెప్టెంబర్-అక్టోబర్లోతీరనుండడంతో విదేశీ మారక నిల్వలపై ఒక్కసారిగా ఒత్తిడి పడొచ్చన్న ఆందోళనలనుకొట్టిపారేశారు. ‘‘నాన్ రెసిడెంట్ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. నా తర్వాత గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేవారు రిజర్వ్ బ్యాంకును మరింత ముందుకు తీసుకెళతారనే నమ్మకం నాకుంది. దేశంలో స్థూల ఆర్థిక, సంస్థాగత స్థిరత్వం కోసం ఓ వేదిక ఏర్పాటు చేయడానికి మూడేళ్లుగా ప్రభుత్వంతో కలసి పనిచేశాం. ద్రవ్యోల్బణం పరిధిలోనే ఉంది. ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. స్వల్పకాలంలో మాత్రం అంతర్జాతీయ పరిణామాల నుంచి సవాళ్లు పొంచి ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
మార్కెట్లు ఎలా స్పందిస్తాయో..?
రాజన్ ప్రకటన ప్రభావం సోమవారం స్టాక్, బాండ్ మార్కెట్లపై కనిపించనుంది. ఐఎంఎఫ్ ఆర్థికవేత్తగా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందే పసిగట్టిన రాజన్‌ను 2013 సెప్టెంబర్లో యూపీఏ ప్రభుత్వం ఆర్‌బీఐ గవర్నరుగా నియమించింది. వడ్డీ రేట్ల విషయంలో పీడించే వైఖరితో రాజన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఇటీవల సుబ్రమణ్యం స్వామి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా పౌరసత్వం కలిగిన రాజన్ మానసికంగా పరిపూర్ణ భారతీయుడు కాదని కూడా ఆయన విమర్శించారు. అయితే స్వామి వ్యాఖ్యలను బీజేపీ నేతలెవ్వరూ సమర్థించకపోవటం గమనార్హం.
మోదీకి అన్నీ తెలుసు!: రాహుల్
రాజన్ ప్రకటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రధాని మోదీకి అన్నీ తెలుసు. ఆయనకు రాజన్‌లాంటి నిపుణుల అవసరం లేదు’ అని ట్వీట్ చేశారు.
స్వాగతించిన జైట్లీ, స్వామి
రాజన్ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. ఉత్తమ సేవలందించారంటూ ప్రభుత్వం తరఫున అభినందనలు తెలుపుతూ.. రాజన్ స్థానంలో వచ్చేదెవరన్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాజన్ నిర్ణయం మంచి పరిణామమని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి చెప్పారు. రాజన్ విషయంలో తాను చెప్పినవి వాస్తవాలన్నారు. అయితే రాజన్ నిర్ణయం దేశానికి నష్టమని ప్రతిపక్ష కాంగ్రెస్, వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. ఆయన నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. ప్రభుత్వమే పథకం ప్రకారం తప్పుడు నిందలు, నిరాధార ఆరోపణలతో రాజన్‌పై దాడి చేయించి ఈ పరిణామాన్ని ఆహ్వానించినట్టుగా కనిపిస్తోందన్నారు.