కేంద్ర పన్నుల్లోనే రాష్ట్రాలకు వాటా.. సెస్‌లు, సర్‌చార్జీల్లో ఉండదు
కేంద్ర ఆదాయంలో సెస్‌ల వాటా పెరిగింది.. పన్నుల ఆదాయం తగ్గింది
దీనిపై కేంద్రం పునఃసమీక్ష చేయాలి.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పన్నుల వాటా నానాటికి క్షీణిస్తూ సెస్సులు, సర్‌చార్జీల వాటా గణనీయంగా పెరిగిపోతోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం పునఃపరిశీలన చేసి మరింత పారదర్శకత తీసుకురావాల్సిన అవసరముందన్నారు. గురువారం ఆయన సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో దివంగత ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. కేంద్ర పన్నుల్లోనే రాష్ట్రాలకు వాటా ఉంటుందని, సెస్‌లు, సర్‌చార్జీల్లో ఉండదన్నారు. ‘కేంద్రానికి 100 శాతం ఆదాయం పన్నుల ద్వారా వస్తే ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 60 శాతం ఉంచుకుని మిగిలిన 40శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయాలి.
కేంద్రం ఆదాయాన్ని 80 శాతం పన్నులు, 20 శాతం సర్‌చార్జీలుగా విభజించి వసూలు చేస్తుండటంతో, ఆ 80శాతం పన్నుల్లో 60 శాతం వాటా కింద దానికి 48 శాతం వస్తుంది. దీనికి 20 శాతం సర్‌చార్జీలు, సెస్సుల ఆదాయం తోడైతే మొత్తం 68 శాతం ఆదాయం కేంద్రానికే వెళ్తుంది. తుదకు రాష్ట్రాలకు 32 శాతం వాటానే లభిస్తుంది’ అని అన్నారు. దేశం సహకార సమాఖ్య నుంచి ఘర్షణాత్మక సమాఖ్యకు పరిణామం చెందిందని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా రాష్ట్రాలు బలపడటంతో ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం పెరగగా, కేంద్రానిది తగ్గిందన్నారు. కేంద్ర పన్నుల్లో అధిక వాటా కోసం అధిక సంతానాన్ని కనాలని ఏపీ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు.
ఉచిత హామీలపై కోడ్ తేవాలి
ఉచితాలపై అత్యవసరంగా ప్రవర్తన నియమావళి రూపొందించాల్సిన అవసరముందని సుబ్బారావు చెప్పారు. ప్రజాకర్షక పథకాల కోసం పారీ్టలు పోటీపడి ఉచిత హామీలిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, దీంతో రుణాల భారం పెరిగిపోతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014–15లో రాష్ట్ర ఆదాయ వనరుల్లో 25శాతం ఉన్న కేంద్ర పన్నుల వాటా 2023–24 నాటికి 15శాతానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏటేటా క్షీణిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment