
బాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన కామెంట్స్ చేశారు. హిందీ సినిమాల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదని అన్నారు. తాజాగా ఓ డిబేట్‌కు హాజరైన ఆయన అమీర్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీపై మాట్లాడారు. హిందీ సినిమాల్లో నాణ్యత రోజు రోజుకు పూర్తిగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులతో అన్ని సంబంధాలను కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాయని జావేద్ అక్తర్ తెలిపారు. కనీసం ప్రేక్షకులకు తెలియని నటులతో తీసిన దక్షిణ భారత చిత్రాలు హిందీలో విడుదలై రూ. 600 నుంచి 700 కోట్ల వ్యాపారం చేస్తున్నాయని వెల్లడించారు. చివరికి మన సినిమాలను సైతం సౌత్ డైరెక్టర్స్ తీస్తున్నారని పేర్కొన్నారు. అసలు బాలీవుడ్‌కు ఏమైంది? అని జావేద్ అక్తర్ ప్రశ్నించారు.
అయితే జావేద్ అక్తర్ కామెంట్స్‌పై ఇదే డిబేట్‌లో పాల్గొన్న అమిర్ ఖాన్ స్పందించారు. ఇక్కడ సమస్య ఉత్తరాది, దక్షిణాది కాదని అన్నారు. మనం ఎదుర్కొంటున్న సమస్య వేరే విషయమని తెలిపారు. దయచేసి మా సినిమాని చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థించే ఏకైక ఇండస్ట్రీ మనదే.. లేదంటే ఎనిమిది వారాల్లో మీ ఇంట్లోనే ఓటీటీలో చూసే అవకాశం కల్పిస్తాం.. ఇదే బాలీవుడ్ బిజినెస్ మోడల్ అని అమీర్ ఖాన్ అన్నారు. ఓటీటీకి ఒకసారి సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే చాలు సినిమాను ఎన్నిసార్లైనా వీక్షించవచ్చని తెలిపారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదంటూ మాట్లాడారు. గతంలో ఓటీటీలు లేకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు మనం ఎక్కడైనా సినిమాలు చూడవచ్చని తెలిపారు. ఇప్పుడు థియేటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు.. మన సొంత వ్యాపార నమూనాతో మన సినిమాలను చంపుకుంటున్నామని అమిర్ ఖాన్ అన్నారు.
హిందీ సినిమా రచయితలు, దర్శకులు ఒత్తిడికి గురికాకుండా కంటెంట్‌పై దృష్టి పెట్టాలని అమిర్ ఖాన్ సూచించారు. వారు తమ మూలాలను, ప్రాథమిక భావోద్వేగాలను మరచిపోయారని అన్నారు. నాలో నుంచి వచ్చేదాన్ని మాత్రమే నేను చేయగలను.. అది హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని నేను ఆలోచించనని అమీర్ అన్నారు. కాగా.. ఇటీవల హన్సల్ మెహతా, వివేక్ అగ్నిహోత్రి కూడా హిందీ సినిమా ప్రస్తుత స్థితిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాలీవుడ్ గ్రాఫ్ పడిపోతోందని అగ్నిహోత్రి వ్యాఖ్యానించగా.. హిందీ చిత్ర పరిశ్రమకు రీసెట్ అవసరమని మెహతా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment