South Film Industry
-
రొడ్డకొట్టుడు సినిమాలవి:పుష్ప2, టాలీవుడ్‌పై హృతిక్ తండ్రి విసుర్లు!
పుష్ప2 అనూహ్య విజయం తర్వత బాలీవుడ్ ప్రముఖులు టాలీవుడ్, దక్షిణాది సినిమాలపై ఒక్కసారిగా ఒకరొకరుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనికి కారణం... గత కొంత కాలంగా అనూహ్య స్థాయిలో టాలీవుడ్, దక్షిణాది చిత్రపరిశ్రమ ఊపిరి సలపనివ్వని రీతిలో భారతీయ బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టడం అత్యధిక శాతం మంది బాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడని విషయంగా మారడం..కొన్నేళ్లకు ముందు.. ఉత్తరాది చిత్ర పరిశ్రమ... సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కనీస స్థాయిలో కూడా గుర్తింపు లేదు.... సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి సైతం ఉత్తరాదిలో మనకు విలువ లేదని బహిరంగంగా వాపోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కాస్త ఆలస్యంగానైనా బాహుబలితో మొదలైన ఊచకోత...సాహో, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి(Kalki 2898AD) ... ఇలా వరుస పెట్టి తెలుగు సినిమాలు అస్త్రశస్త్రాలతో కొనసాగిస్తూ వచ్చాయి. అయినా సరే, జవాన్, దంగల్ వంటి కొన్ని సినిమాలను చూపిస్తూ బాలీవుడ్ జబ్బలు చరుచుకుంది. కానీ పుష్ప2(Pushpa 2) తో ఆ మిణుకు మిణుకు మంటున్న వెలుగు కూడా ఆరిపోయింది. కలెక్షన్ల సునామీ సృష్టించిన సుకుమార్ అండ్ టీం... బాలీవుడ్ లోని అన్ని రికార్డుల్నీ ఉతికి ఆరేశారు. అత్యధిక కలెక్షన్లు సాదించిన హిందీ చిత్రం అనే రికార్డ్‌తో పాటు రేపో మాపో బాలీవుడ్‌కి తనకంటూ మిగిలిన ఏకైక దంగల్ రికార్డ్‌ను కూడా మట్టికరిపించే దిశగా దూసుకుపోతున్నారు.దీంతోప్రస్తుతం టాలీవుడ్ విజయాల ముట్టడిలో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరవుతోంది. మిగిలిన తెలుగు సినిమాల విజయాల సంగతెలా ఉన్నా... పుష్ప 2 విజయం హిందీ చిత్రపరిశ్రమను ఉలిక్కిపడేలా చేసి బాలీవుడ్ హీరోల అస్తిత్వాన్నే ప్రశ్నించేలా కుదుపు కుదిపింది అనేది నిజం. ‘‘మా హీరోలకు సిక్స్‌ప్యాక్స్ చూపించడం తప్ప నటించడం చేతకాదు. పుష్ప 2 లాంటి సినిమాలు తీయడం మా వల్ల కాదు’’ అంటూ బాలీవుడ్ నటి కంగన రనౌత్ వ్యాఖ్యానించడం, అల్లు అర్జున్ తనకు అభిమాన నటుడు అంటూ సాక్షాత్తూ అమితాబ్ బచ్చన్ కితాబివ్వడం... వంటివి బాలీవుడ్‌కి జీర్ణించుకోలేని విషయాలుగా మారాయి. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు నాగవంశీ ..ప్రస్తుతం బాలీవుడ్ నిద్రలేని రాత్రులు గడుపుతోందంటూ మూలిగే నక్కమీద తాటిపండు అది కూడా బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సమక్షంలోనే వేసేశారు.ఈ నేపధ్యంలో ఒకరొకరుగా బాలీవుడ్ చిత్ర ప్రముఖులు టాలీవుడ్‌పై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే సీనియర్ నటుడు, నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి... రాకేష్ రోషన్(Rakesh Roshan) పుష్ప2 సహా దక్షిణ భారత చిత్రాల విజయం గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘‘దక్షిణాది సినిమాలు చాలా గ్రౌన్దేడ్ (మూలాలకు కట్టుబడిన సాదాసీదా)గా ఉన్నాయి, అవి పాతదైన పంధాలో వెళుతూ.. పాట యాక్షన్డైలాగ్భావోద్వేగాలు... ఇలా ఏళ్లనాటి ఫార్ములా సంబంధితంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. అవి పురోగమించడం లేదు. ఏ పాత మార్గాన్ని విచ్ఛిన్నం చేయనందున వారు విజయవంతమవుతున్నారు’’ అంటూ తీసిపారేశారు. సింపుల్‌గా చెప్పాలంటే దక్షిణాది వాళ్లు రొడ్డకొట్టుడు కధలతోనే విజయాలు సాధిస్తున్నామని, బాలీవుడ్ మాత్రం కొత్త పంధాలో వెళుతున్నామనేది ఆయన హేళన. దీనికి ఉదాహరణ గా ... తాను కహో నా...ప్యార్ హై సినిమా చేసిన తర్వాత రొమాంటిక్ సినిమాలు తీయాలని అనుకోలేదనీ.ఆ తర్వాత తాను కోయి... మిల్ గయా చేశాననీ ఆయన గుర్తు చేశారు. ఇలా తాము సవాళ్లకు ఎదురొడ్డి సినిమాలు కొత్త పంధాలో వెళుతున్నామన్నారు.అయితే టాలీవుడ్ తదితర సౌత్ ఇండియా వాళ్లు ఇలాంటి సవాళ్లు తీసుకోరని వారు సేఫ్ గేమ్ ఆడతారని అంటున్న ఆయన... బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప2, కల్కి, సాహో... వంటి ఒకదానికొకటి సంబందం లేని వైవిధ్యభరిత కధా నేపధ్యం ఉన్న సినిమాలతో టాలీవుడ్ సాగిస్తున్న జైత్రయాత్రను చూడట్టేదనుకోవాలా? ఇది గమనిస్తున్న వాళ్లు హృతిక్ రోషన్ తండ్రి మాట్లాడుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇట్టే పసిగట్టేయగలరు అనే ఇంగితం కూడా రాకేష్‌కు లేకపోవడం దురదృష్టకరం. -
బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే గొప్ప.. బిగ్‌బీ గుస్సా!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మీద విపరీతమైన నెగెటివిటీ వచ్చేసింది. స్టార్ కిడ్స్‌కు అందలమిస్తారని, వేరేవాళ్లను తొక్కేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో హిందీ సినిమాలను ఎవరూ చూడొద్దు, బ్యాన్ చేసేద్దామని నెటిజన్లు సంకల్పించుకున్నారు. ఆ తర్వాత రిలీజైన సినిమాల్లో చాలామటుకు ఫ్లాప్స్‌గా నిలిచిపోయాయి. అదే సమయంలో సౌత్ సినిమాలు అందరినీ ఆకర్షించాయి. పాన్ ఇండియాగా రిలీజైన చిత్రాలు జనాలను మెప్పించాయి. దీంతో బాలీవుడ్ పనైపోయింది. సౌత్ ఇండస్ట్రీదే హవా.. అన్న టాక్ మొదలైంది. ఇప్పటికీ చాలాచోట్ల దక్షిణాది చిత్రాలను పొగుడుతూ హిందీ సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. ఇది బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు బాధ కలిగిస్తోందట! సినిమాలను ఎందుకు తప్పుపడతారు? సౌత్ వర్సెస్ బాలీవుడ్ అన్న అంశంపై అమితాబ్ తీవ్రంగా స్పందించాడు. అలాగే సినిమాల మీద వ్యతిరేకత గురించి కూడా సంభాషించాడు. ఆయన మాట్లాడుతూ.. 'జనాల్లో వచ్చే మార్పులకు, సమాజంలో సంఘటనలకు సినిమాలే కారణమంటూ అనేకసార్లు మూవీ ఇండస్ట్రీనే తప్పుపడుతూ ఉంటారు. ఈ ప్రకృతిలో, ప్రపంచంలో, దైనందిన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు, అనుభవాల నుంచే కథలు, సినిమాలు పుడతాయి. ఆ యదార్థ సంఘటనలే సినిమాగా తెరకెక్కుతాయి. ఈ మధ్య ప్రాంతీయ సినిమాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అందుకే అద్భుతంగా కనిపిస్తున్నాయి ఆ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీ సినిమా బాగుంది అని వాళ్లను ప్రశంసించినప్పుడు ఏమని చెప్తున్నారో తెలుసా? హిందీలో ఎలాంటి సినిమాలైతే తీశారో అలాంటి వాటినే అక్కడ తెరకెక్కిస్తున్నామన్నారు. దీవార్, శక్తి, షోలే సినిమాలను రీమేక్ చేస్తున్నామని, వాటి సారాన్ని వాడుకుంటున్నామన్నారు. కాకపోతే మలయాళం సినిమా అలాగే కొంతవరకు తమిళ సినిమాలు మాత్రం వాటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అలా అని మా ఇండస్ట్రీ కంటే అదే గొప్ప అని చెప్పడం సరి కాదు' అన్నాడు బిగ్‌బీ. చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా! పెళ్లైన రెండేళ్లకే గొడవలు.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌పై భార్య ఫిర్యాదు! -
సైమా అవార్డ్స్-2023 వేడుకల ప్రకటన.. ఈసారి హోస్ట్ ఎవరంటే?
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 11 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2023 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు సైమా ఛైర్పర్సన్ బృందాప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు దుబాయ్ వేదిక కానుందని ఆమె తెలిపారు. వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. (ఇదీ చదవండి: నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్) టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తీసుకొచ్చింది సైమానే అని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో తాను కూడా భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. తనకు దక్షిణాదికి చెందిన ఎందరో అభిమానుల నుంచి ప్రేమను పొందానని చెప్పుకొచ్చారు. తన తొలి చిత్రం సీతారామంతోనే సైమాలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. దుబాయ్‌లోని D.W.T.Cలో జరిగే ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా రానా వ్యవహరించనున్నారు. మరోక హోస్ట్‌గా మృణాల్ వ్యవహరించే అవకాశం ఉంది. Nexa Joins SIIMA as the Title Sponsor. SIIMA is the Biggest Awards Show in South India organising its 11th Edition in Dubai on 15th and 16th September. Rana Daggubati and Mrunal Thakur joined Brinda Prasad, Chairperson of SIIMA in announcing the Nexa SIIMA Partnership.… pic.twitter.com/H6na7W7uHr — SIIMA (@siima) July 7, 2023 -
దక్షిణాది చిత్రపరిశ్రమపై తాప్సీ వివాదస్పద వ్యాఖ్యలు.. నెటిజన్స్ ఫైర్
సౌత్ సినిమా ఇండస్ట్రీపై సొట్టబుగ్గల సుందరి తాప్సీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాల్లో నటించడం వల్ల తను గుర్తింపు రాలేదని చెప్పింది. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సరైన పాత్రలు సౌత్‌లో రాలేదని తెలిపింది. అక్కడ స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ సంతృప్తిని ఇచ్చే క్యారెక్టర్స్ లభించలేదని చెప్పింది. (చదవండి: నా బెడ్రూమ్లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) బాలీవుడ్లో నటించిన ‘పింక్’ చిత్రం తనకెంతో గుర్తింపుని తెచ్చిపెట్టిందని వెల్లడించింది. ఈ సినిమా తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని తాప్సీ చెప్పుకొచ్చింది. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ మండిపడుతున్నారు. టాలీవుడ్లో గుర్తింపు వచ్చింది కాబట్టే బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ టాలీవుడ్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేని విమర్శలు ఎదుర్కొంది తాప్సీ. టాలీవుడ్ హీరోయిన్స్‌ను గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తారంటూ ఓ ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కామెంట్ చేసింది. అప్పట్లో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. -
ఇలియానాపై నిషేధం.. అందుకే సినిమాలకు దూరం!
తొలి సినిమా ‘దేవదాస్’తోనే అటు ఫిల్మ్ ఇండస్ట్రీని, ఇటు యూత్‌ని తనవైపుకు తిప్పుకుంది ఇలియానా. రెండో సినిమా పోకిరితో స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా అవతరించింది. సౌత్‌లో కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే తన మకాంని బాలీవుడ్‌కి మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినా కూడా మళ్లీ సౌత్ ఇండస్ట్రీ వైపు చూడలేదు. 2018లో అమర్ ఆక్బర్ ఆంటోనీ తర్వాత ఇలియానా తెలుగు తెరపై కనిపించలేదు. అయితే బాలీవుడ్‌పై ఉన్న మోజుతోనే ఇలియానా సౌత్ ఇండస్ట్రీని పక్కకి పెట్టిందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కావాలని సౌత్ సినిమాలకు దూరంగా వెళ్లలేదట. సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలియానాపై నిషేదం విధించిందట. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా సమయంలోనే ఇలియానా ఓ కోలీవుడ్ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కోలీవుడ్ నిర్మాత నటరాజ్.. విక్రమ్ హీరోగా నందం అనే మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానాను తీసుకున్నారు. ఆమెకు రూ.40 లక్షలు కూడా అడ్వాన్స్ ఇచ్చాడట. అయితే అనుకొని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీంతో అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వమని నిర్మాత అడిగితే.. దానికి ఇలియానా నిరాకరించిందట. కావాలంటే మరో సినిమాలో నటిస్తాను కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వనని తెగేసి చెప్పిందట. దీంతో సదరు నిర్మాత నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ని ఆశ్రయించారట. వారు కూడా చెప్పిన వినకపోవడంతో.. డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఇలియానాను సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైనట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ సమస్యను ఇలియాన పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె సౌత్ సినిమాల్లో నటిస్తుందనే ప్రచారం టీటౌన్లో గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ గోవా బ్యూటీ ఏ హీరోతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి. -
సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ రీమేక్ చిత్రాల్లో నటించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానంది. ఆమె హీరోయిన్గా నటించిన భూల్ భులాయా 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఓటీటీలు విస్తృతంగా వ్యాప్తి చెందకముందు కబీర్ సింగ్ సినిమా చేశాను, దాన్ని ఇప్పుడు మరోసారి చేయమన్నా సరే కళ్లు మూసుకుని ఓకే చెప్తాను. కానీ ఏదైనా రీమేక్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉందంటే దాన్ని చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. కొన్ని చిన్న చిత్రాలు రత్నాల్లా ఉంటాయి. వాటిని నిర్దిష్ట భాషలోనే తీస్తారు కనుక ఎక్కువమంది జనాలకు చేరదు. అలాంటప్పుడు దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి ఆ సినిమాల్లోని కథను తీసుకుని దానికి కొన్ని మార్పుచేర్పులు చేసి ఎక్కువమంది జనాలు చూసేలా నిర్మించడంలో తప్పు లేదు' అని చెప్పుకొచ్చింది కియారా. కాగా భూల్ భలాయా మే 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక అదే రోజు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన ధాకడ్ చిత్రం కూడా విడుదల కానుంది. చదవండి: భళా తందనాన మూవీ ఎలా ఉందంటే.. ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్ -
ఆర్ఆర్ఆర్, సౌత్ ఇండస్ట్రీపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)... ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తోంది. అంతలా మార్మోగిపోతోందీ సినిమా. ఒక్క హిందీలోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రంపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ సైతం ఆర్ఆర్ఆర్కు ఫిదా అయ్యామంటూ జక్కన్నను, తారక్, చెర్రీలను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఫోకస్ కాలేదు 'ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాను. చిరంజీవితో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభూతినిస్తోంది. చిరంజీవిగారితో నాకు చాలాకాలం నుంచే పరిచయం ఉంది. ఆయన నాకు మంచి ఫ్రెండ్. అతడి తనయుడు రామ్‌చరణ్ కూడా నాకు స్నేహితుడే. ఆర్ఆర్ఆర్లో చరణ్ అద్భుతంగా నటించాడు. సినిమా విజయం సాధించినందుకు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. కెరీర్లో బాగా రాణిస్తున్నందుకు సంతోషంగానూ ఉంది. అదేంటో దక్షిణాది సినిమాలు హిందీలో బాగా ఆడతాయి, కానీ మా చిత్రాలు మాత్రం సౌత్‌లో పెద్దగా ఆడవు. అది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగానే ఇక్కడి సినిమాలు హిందీలో బాగా సక్సెస్ అవుతాయి' అని చెప్పుకొచ్చాడు సల్లూభాయ్. చదవండి: పునీత్ లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, దేవుడిపై కోపం తెప్పిస్తుంది -
చెప్పినదే జరుగుతుందా?
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సౌత్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటించారు ఆలియా భట్. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా ప్రారంభోత్సవం అక్టోబరులో జరుగుతుందని, నవంబరు రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుందని సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సరసన చాన్స్ వస్తే తప్పక నటిస్తానని ఆలియా పలు సందర్భాల్లో చెప్పా రు. మరి.. ఆమె చెప్పినదే జరుగుతుందా? -
అక్షరాన్ని మార్చగలరు.. అభిమానాన్ని కాదు
‘సౌత్ వాళ్లకు నడుము అంటే ప్రత్యేక ఆసక్తి’ అంటూ ఓ ఇంగ్లిష్ వీడియో ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు పూజా. ఆదివారం ఈ విషయం గురించి స్పందించారామె. దీనికి సంబంధించి ఓ నోట్‌ను విడుదల చేశారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయించారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ, అభిమానాన్ని కాదు. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్రపరిశ్రమ ప్రాణసమానం. ఇది నా చిత్రాలను అభిమానించేవారికీ నా అభిమానులకూ తెలిసినా ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నాను. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. అలాగే తాను ఇచ్చిన పూర్తి వీడియో ఇంటర్వ్యూను కూడా చూడమని కోరారు. -
ఓ గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా పని చేస్తోంది
‘‘నా దగ్గరకు వచ్చిన ఏ మంచి సినిమానీ నేను కాదనను. కానీ నా వెనకాల ఒక గ్యాంగ్ ఉందనిపిస్తోంది. ఆ ముఠా నా గురించి లేనిపోనివి చెప్పి, నా దగ్గరకు రావాలనుకున్నవాళ్లను రానివ్వడంలేదని నా ఫీలింగ్’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. దక్షిణాదితో పోల్చితే హిందీలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటి? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెహమాన్‌ని అడిగితే ఈ విధంగా స్పందించారు. ‘దిల్ సే’, ‘తాళ్’, ‘లగాన్’, ‘స్వదేశ్’, ‘రంగ్ దే బసంతి’, ‘గురు’, ‘రాక్‌స్టార్’, ‘తమాషా’, ‘ఓకే జాను’ తదితర హిందీ చిత్రాలకు రెహమాన్ సంగీతదర్శకుడిగా వ్యవహరించారు. ఇక హిందీలో తాను ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నాననే విషయం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నన్ను అపార్థం చేసుకుని, ఓ గ్యాంగ్ నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. కొంతమందికి, నాకు మధ్య దూరం పెంచుతోంది. ముఖేష్ చాబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు ట్యూన్స్ ఇచ్చాను. అప్పుడాయన ‘ఆయన దగ్గరకు వెళ్లొద్దు అని నాతో ఎంతమంది చెప్పారో లెక్కలేదు. మీ గురించి కథలు కథలుగా చెప్పారు’ అన్నారు. నేనెందుకు హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నానో ఆ మాటలు విన్నాక అర్థమైంది. నా దగ్గరకు మంచి సినిమాలు ఎందుకు రావడంలేదో గ్రహించాను. హిందీలో నేను చాలావరకు డార్క్ సినిమాలే చేస్తున్నాను. ఎందుకంటే ఓ గ్యాంగ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. పీపుల్ (సినిమా ఇండస్ట్రీవాళ్లు) నాతో మంచి సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఓ గ్యాంగ్ అది జరగకుండా చేస్తోంది. ఆ మంచిని నాదాకా రాకుండా చేస్తోంది. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే నేను విధిని నమ్ముతాను. అలాగే ప్రతిదీ ఆ దేవుడి దగ్గరనుంచే వస్తుందని నమ్ముతాను. కాబట్టి నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తున్నాను. కానీ నేను మాత్రం అందర్నీ స్వాగతిస్తున్నాను. నా దగ్గరకు రావచ్చు. మంచి సినిమాలు చేయొచ్చు. అందరికీ స్వాగతం’’ అన్నారు. -
సౌత్ ఫిల్మ్‌ఫేర్.. తెలుగు విజేతలు వీరే
66వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగులో మహానటి, రంగస్థలం చిత్రాలు పలు విభాగాల్లో సత్తా చాటాయి. రంగస్థలం చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్ ఉత్తమ నటుడిగా, సీనియర్ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి ఉత్తమ చిత్రంగా, అదే చిత్రానికి సంబంధించి కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. అరవింద సమేత చిత్రానికి గానూ జగపతిబాబు ఉత్తమ సహాయనటుడిగా అవార్డు దక్కించుకున్నారు. తెలుగు ఉత్తమ చిత్రం - మహానటి ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (మహానటి) ఉత్తమ నటుడు - రామ్‌చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి - కీర్తి సురేశ్ ( మహానటి) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - దుల్కర్ సల్మాన్ (మహానటి) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రష్మిక మందన్న (గీతా గోవిందం) ఉత్తమ సహాయ నటి - అససూయ భరద్వాజ్ (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (అరవింద సమేత) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ మ్యూజిక్ అల్బమ్ - దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్(ఎంత సక్కగున్నావే- రంగస్థలం) ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే- గీత గోవిందం) ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్ (మందరా మందరా-భాగమతి) -
ప్రధానిపై మెగా కోడలి సంచలన ట్వీట్
భారత ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఢిల్లీలోని లోక కళ్యాణ్ మార్గ్‌లో #ChangeWithin పేరుతో బాలీవుడ్ సెలబ్రిటీలను కలిసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖలు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్లో సైతం పంచుకున్నారు. అయితే మోదీ హిందీ ప్రముఖలను మాత్రమే కలవడంపై మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడికి కూడా ఆహ్వానం అందకపోవటంపై ఆమె అభ్యంతరం తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఆమె ప్రధానిని సూటిగా ప్రశ్నించడం.. టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమందంటే.. ‘ప్రధాని నరేంద్ర మోదీ.. మీరు ప్రధాని అయినందుకు దక్షిణాది ప్రజలు గర్విస్తున్నారు. కానీ మీరు దక్షిణాది కళాకారులను ఖాతరు చేయకపోవటం బాధించింది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. కాగా దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూడటం అనాది నుంచి వస్తుందే. కానీ ఈ విషయంపై ప్రధానిని గొంతెత్తి ప్రశ్నించిన ఉపాసనకు దక్షిణాది ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. Dearest @narendramodi ji. JAI HIND 🙏🏻 https://t.co/bGWdICLnsn pic.twitter.com/DUzpgpbSYA — Upasana Konidela (@upasanakonidela) October 19, 2019 -
సౌత్ ఎంట్రీ?
తొలి చిత్రం ‘ధడక్’లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ప్రస్తుతం ‘కార్గిల్ గాళ్ (వర్కింగ్ టైటిల్), రుహీ అఫ్జా, తక్త్’ సినిమాలతో బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారామె. అయితే సౌత్‌లో జాన్వీ నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాన్వీ తండ్రి బోనీకపూర్ నిర్మాతగా హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఓ కీలక పాత్రలో జాన్వీ నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా అంటోంది. మరి.. తండ్రి నిర్మించబోయే సినిమాలో నటిస్తారా? వేచి చూద్దాం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మానాడు, ఆర్ఆర్ఆర్’ సినిమాలతో జాన్వీ సౌత్ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ అవి ఏవీ నిజం కాలేదన్న విషయం తెలిసిందే. -
నో అనడం నేర్చుకోవాలి
తమిళసినిమా: నో అనడం నేర్చుకోవాలి అంటోంది వర్థమాన నటి అర్తన. ప్రారంభం నుంచే మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించే అవకాశాలను దక్కించుకున్న ఈ కేరళాకుట్టిని తమిళంలో తొండన్ చిత్రం ద్వారా దర్శకుడు సముద్రఖని పరిచయం చేశారు. ఇక్కడ తొలి చిత్రమే విజయాన్ని అందించింది. దీంతో అవకాశాలు అర్తన ఇంటి తలుపులు తడుతున్నాయి. రెండో చిత్రంగా ఇటీవల తెరపైకి వచ్చిన సెమ హిట్ అనిపించుకుంది. తాజాగా కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం, సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన వెన్నెలా కబడ్డీకుళు–2 చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతన్నాయి. ఈ సందర్భంగా నటి అర్తనతో చిన్న భేటీ. ప్ర: నటిగా రంగప్రవేశం గురించి, కుటుంబం గురించి చెప్పండి? జ: మాది కేరళాలోని తిరువనంతపురం. అమ్మా,నాన్నల ముద్దుల కూతురిని. సినిమా అంటే చిన్నతనం నుంచే చాలా ఇష్టం. పాఠశాలలో చదువుతున్నప్పుడే డ్రామాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. టీవీ.యాంకర్‌గా పని చేశాను. కళాశాల్లో విజువల్ కమ్యునికేషన్ పూర్తిచేసిన తరువాత మలయాళంలో సురేశ్‌గోపి కజిన్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో నటించాను. ఆ తరువాత ఒక తెలుగు చిత్రంలో నటించాను. తమిళంలో తొండన్ చిత్రంతో ఎంట్రీ జరిగిన విషయం తెలిసిందే. ప్ర: మూడు భాషల్లో నటించారు. ఏ భాషలో నటించడం ఇష్టం అనిపించింది? జ: నేను ఇప్పుడే కథానాయకిగా ఎదుగుతున్నాను. ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడక్కండి ప్లీజ్. ఏ భాష దేని ప్రత్యేకత దానిదే. నేను తమిళంలోనే మూడు చిత్రాల్లో నటించాను. కాబట్టి తమిళ చిత్రాలే సన్నిహితం. ప్ర: జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో సెమ చిత్రంలో నటించిన అనుభవం? జ: జీవీ.ప్రకాశ్‌కుమార్ మంచి వ్యక్తి. చక్కగా మాట్లాడతారు. నన్ను చాలా ప్రోత్సహించారు.సెమ చిత్రం గురించి చెప్పాలంటే ఆ చిత్రంతో నేను చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రం నన్ను చాలా ప్రాంతాలకు తీసుకెళ్లింది. కడైకుట్టి సింగం చిత్రంలో కార్తీకు జంటగా నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టింది సెమ చిత్రమే. ప్ర: కడైకుట్టి సింగంలో మీ పాత్ర గురించి? జ: కడైకుట్టి సింగం చిత్రం పూర్తయ్యింది. ఇందులో ముగ్గురు హీరోయిన్లం నటించాం. ఇది పూర్తిగా గ్రామంలో నివశించే ఒక కుటుంబ కథా చిత్రం. చాలా కాలం తరువాత కుటుంబ సమస్యలు చర్చించే కథాంశంతో వస్తున్న చిత్రం. దర్శకుడు పసంగ పాండిరాజ్ ఎమోషనల్ డ్రామా ఇందులో ఉంటుంది. నేను గ్రామీణ యువతిగా నటించాను. ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు అనుమతి లేదు. ప్ర: చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించారు. ఈగో లాంటిదిలేవీ కలగలేదా? జ: నా వరకూ ఈగో సమస్య ఎప్పుడూ రాదు. మన పని కరెక్ట్‌గా చేసుకుంటే ఎలాంటి ఈగోకు తావుండదన్నది నా భావన. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నది నా కోరిక. ఎమోషనల్ పాత్రలో రాణించాలను ఆశ పడుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఈగో, గొడవలు లాంటి సమస్యలోకి లాగకండి. ప్ర: సరే. ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి రచ్చ జరుగుతోంది. దీనిపై మీ స్పందన? జ: ఈ వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడటమే మంచిది. కాస్టింగ్ కౌచ్ అన్నది ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే నాకు ఇంతవరకూ అలాంటి సంఘటన ఎదురుకాలేదు. అలాగని ఇది సినిమా రంగంలో జరగడం లేదని చెప్పడం లేదు. మహిళలు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. నిజం చెప్పాలంటే మీ అంగీకారం లేకంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎలా నో చెప్పాలన్నది నేర్చుకోవాలి. నిరాకరించడం తెలిస్తే చాలు ఇలాంటి వాటి నుంచి బయట పడవచ్చు. నో చెప్పడం నేర్చుకోండి. ఇలాంటివి అధిగమించే మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలి. -
కాలు రుద్దడంతో.. ఆ హీరో చెంప పగలగొట్టా
బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీ పైనా కామెంట్స్ చేసింది. ఇలా ఏదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రాధికా.. తాజాగా మరో కామెంట్ చేసింది. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్ షో వోగ్ బీఎఫ్ఎఫ్కు రాధిక అతిథిగా వెళ్లింది. అక్కడ ఆమె మాట్లాడుతూ తాను నటించిన తొలి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్లో భాగంగా సెట్‌కి వెళ్లిన తొలి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు.. తన కాలిని అసభ్యంగా రుద్దాడని చెప్పింది. కనీసం పరిచయం కుడా లేని తనతో ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని రాధిక వివరించింది. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతో పాటు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాతో రాధికా దక్షిణాది వారికి చేరువైంది. -
ఇక సినిమాలు ప్రదర్శించుకోవచ్చు
‘‘ఈ బిజినెస్ విధానంలోనే స్టార్టింగ్ నుంచి లోపాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరం చిన్న చిన్న తప్పులు చేశాం. ఈ చిన్న తప్పులే పెద్దవయ్యాయి. ఇనిషియల్ స్టేజెస్‌లో జరిగిన ఒప్పందాలు సరిగ్గా అమలు కాలేదు. ప్రాబ్లమ్ పెద్దది కావడం వల్లే థియేటర్స్‌ను క్లోజ్ చేయాలనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మాకెవ్వరికీ షూటింగ్స్ ఆపాలని, థియేటర్స్‌ను క్లోజ్ చేయాలని లేదు. మాకు ప్రతిరోజు ప్రేక్షకులను ఎలా థియేటర్స్‌కు రప్పించాలని, ఎక్కువ సినిమాల షూటింగ్ ఎలా చేయాలి? అని మాత్రమే ఉంటుంది’’ అన్నారు నిర్మాత సురేష్‌బాబు. విజువల్ ప్రింటింగ్ ఫీజు విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, సౌత్ ఇండస్ట్రీ జాయింట్ యాక్షన్ కమిటీకి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చలు కొంతమేర సఫలం అయ్యాయి. ఈ నెల 9 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ప్రదర్శన కొనసాగనుంది. ఈ విషయమై ఫిల్మ్ చాంబర్లో బుధవారం రాత్రి జరిగిన పాత్రికేయుల సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడుతూ– ‘‘వీలున్నవాళ్లు గురువారమే సినిమాలను ప్రదర్శించుకోవచ్చు. 7–10డేస్‌లో ఫైనల్ రేట్కార్డ్స్ని ఫైనలైజ్ చేస్తాం. క్యూబ్, యూఎఫ్‌ఓకి సెపరేట్ రేట్స్ ఉండేవి.ఇప్పుడు ఓ రేట్ కార్డ్ సెట్ చేశాం. ఇవన్నీ ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలులోకి వస్తాయి. ఆల్ ఇండస్ట్రీ మెంబర్స్ ప్రపోజల్స్‌ను పరిశీలించాం. కొందరికి మరికొన్ని కోరికలు ఉన్నాయి. వాటిని కూడా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి పంపించాం. ప్రస్తుతం యూఎఫ్ఓ, క్యూబ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ప్రపోజల్స్ చేశాం. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఒప్పందాల మేరకు సైన్ చేశాయి. మిగతా రాష్ట్రం వాళ్లు కూడా చర్చలు జరుపుతున్నారు. వాళ్ల పోరాటాలు కంటిన్యూ అవుతున్నాయి. కర్ణాటక వాళ్లు 9 నుంచి సినిమాలు బంద్ చేస్తున్నాం అన్నారు. తమిళ వాళ్లు కంటెంట్ ఇవ్వటం ఆపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. మేం ఇప్పుడు చేసింది కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఈ వారం రోజుల లాభనష్టాల బేరీజు పక్కన పెడితే అందరికీ ఒక అవగాహన వచ్చింది. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కు మళ్లీ ఆలోచించడానికి అవకాశం వచ్చింది.డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్వారితో చర్చలు జరిపిన తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పారు. మేం అర్థం చేసుకున్నాం. మేం చెప్పిన విషయాలను వాళ్లు అర్థం చేసుకున్నారు. మా డిమాండ్స్ తీర్చాలంటే కంపెనీలు మూసుకోవాలని వాళ్లు చెబుతున్నారు. ఇంతవరకు చేయగలిగాం. వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా చేయగలం. ఫైనల్‌గా అందరికీ మంచి జరిగేలా చూస్తాం’’ అన్నారు. -
కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి – ప్రతాని రామకృష్ణ గౌడ్
‘‘సౌత్ ఫిల్మ్ చాంబర్ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా 10 వేల థియేటర్స్‌ను బంద్ చేయటం రికార్డ్. ఈ బంద్‌కు సహకరించిన నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్ కార్మికులు.. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సిసి) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. డిజిటల్ సర్వీస్ (క్యూబ్, యూఎఫ్ఒ, పీఎక్స్‌డి) ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ దక్షిణ చలన చిత్రనిర్మాతలు థియేటర్ మూతకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ధియేటర్స్ క్లోజ్ అయ్యాయి. శనివారం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘డిజిటల్ వ్యవస్థపై పోరాటం చేస్తూ అన్ని రాష్ట్రాలు ఒకే తాటి మీదకు రావటం చాలా గ్రేట్. హిందీ సినిమాలకు ఇది వర్తించదు. బట్ వాళ్లు కూడా బంద్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారు ఐదేళ్ల తర్వాత ఫ్రీ సర్వీస్ ఇస్తాం అని అగ్రిమెంట్ చేసి, ఇప్పుడు అధికంగా వసూలు చేస్తున్నారు. అగ్రిమెంట్‌కు కట్టుబడాలి.. లేదా తప్పుకోవాలి. మేం కొత్త సర్వీస్ ప్రొవైడర్స్‌ను తెచ్చుకుంటాం. ఇది తేలే వరకు బంద్ కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు. ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ 5 ఏళ్లే అగ్రిమెంట్ అని చెప్పి 13 సంవత్సరాలుగా నిర్మాతల రక్తాన్ని పీల్చుకుంటున్నారు. కోట్ల లాభాలు ఆర్జించారు. ఈ బంద్‌ను కంటిన్యూ చేయాలి. ఇది వారం రోజులైనా పది రోజులైనా ఒకే మాట మీద ఉందాం. చార్జీలు కొంత వరకు పెట్టినా ఓకే కానీ చిన్న సినిమాలకు జీరోగా నిర్ణయించాలి’’ అని టీఎఫ్íసీసీ సెక్రటరీ సాయి వెంకట్ అన్నారు. -
సౌత్ ఇండస్ట్రీపై ఈయన కామెంట్లు విన్నారా?
సాక్షి, సినిమా : దక్షిణ చలన చిత్ర పరిశ్రమపై బాలీవుడ్ చిన్న చూపు వ్యవహారం కొత్తదేం కాదు. అయితే బాహుబలి రెండు భాగాల భారీ విజయం తర్వాత అది మరింత బయటపడింది. ఖాన్ త్రయం కూడా మన సినిమా విజయాన్ని అంగీకరించేందుకు తొలుత తటపటాయించారు కూడా. కమల్ ఆర్ ఖాన్ లాంటి వాళ్లు ఇక్కడి అగ్రహీరోలను చులకన చేయటం.. నిన్నగాక మొన్న హీనా ఖాన్ అనే సీరియల్ నటి బిగ్ బాస్ షోలో సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్లు.. ముఖ్యంగా తెలుగు అగ్రహీరోలపై పిచ్చి వ్యాఖ్యలు చేయటం చూశాం. బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ నిన్న దుబాయ్‌లో జరిగిన 2.0 చిత్ర ఆడియో రిలీజ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో చదవండి. ‘‘రజనీ సార్ నిజంగా అద్భుతం. ఆయన లాంటి లెజెండ్ పక్కన నటించే అవకాశం కల్పించిన దర్శకుడు శంకర్ కు ధన్యవాదాలు. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం లభిస్తుందని అస్సలు ఊహించలేదు. 130 చిత్రాల్లో నటించిన నేను ప్రతీ సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. కానీ, 2.0తో మాత్రం చాలా నేర్చుకున్నానని గర్వంగా చెబుతున్నా’’ అని అక్షయ్ అన్నారు. తానే కాదని, యావత్ బాలీవుడ్ రంగం దక్షిణ చిత్ర పరిశ్రమను చూసి చాలా నేర్చుకోవాలని అక్కీ చెప్పారు. ‘‘దక్షిణాది నటులు, నిపుణులు సినిమాలంటే ప్రాణం పెడతారు. చాలా కష్టపడతారు. సినిమా కోసం ఐక్యంగా కష్టపడతారు. ద్వేష, అసూయ లాంటివి వాళ్ల మధ్య అస్సలు కనిపించవు. పైగా ప్రతిభావంతులను భుజం తట్టి మరీ ప్రోత్సహిస్తారు. అందుకే హిందీ పరిశ్రమ సౌత్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి’’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ లాంటి అగ్ర హీరోయిన్ కూడా వెంకీ, బాలయ్య పేర్లను ప్రస్తావిస్తూ.. చాలా మర్యాదస్తులని చెప్పింది. అంతేందుకు సాహోలో శ్రద్ధా కపూర్ కూడా ప్రభాస్ ఆతిథ్యం అదుర్స్ అంటూ పొడగ్తలతో ముంచెత్తింది. అలాంటప్పుడు ఇక్కడి సినిమాలతో నటించకుండా, ఎలాంటి అనుభవం లేకుండా చేసే వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేనందుకు అంగీకరించలేదు!
సద్దుమణిగిన విషయాన్ని పదే పదే ప్రస్థావిస్తూ తద్వారా ప్రచారం పొందాలని ఆశిస్తున్నట్లుంది నటి రాధిక ఆప్టే. బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్నంగా నటిస్తూ, ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి వార్తల్లోకెక్కే ఈ సంచలన నటి. అదేమని ఎవరైనా విమర్శిస్తే, నా శరీరం, నా ఇష్టం అంటూ డేర్‌గా అనేస్తుంది. ఈ జాణ దక్షిణాదిలో నటించింది చాలా తక్కువ చిత్రాలే. తమిళంలో ధోని, తమిళ్‌సెల్వన్, కబాలి చిత్రాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్‌కు భార్యగా నటించడంతో గుర్తింపు బాగానే వచ్చింది. తెలుగులోనూ బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిసారించిన రాధిక ఆప్టే దక్షిణాది చిత్రపరిశ్రమపై నిందలు వేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందేప్రయత్నం చేస్తోంది. అవకాశాల కోసం హీరోయిన్లను అడ్జెస్ట్ అవ్వాలంటారని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ లాంటి కొందరు సంచలన వ్యాఖ్య చేశారు. అవి అప్పట్లో ప్రకంపనలు సృష్టించిన మాట నిజమే అయినా, అలాంటి వాతావరణం సద్దుమణిగిన తరువాత నటి రాధిక ఆప్టే మరోసారి అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చింది. దక్షిణాదిలో హీరోయిన్లను పడక గదికి రమ్మన్ని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉంది అని కామెంట్ చేసింది.తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైందని, ఒక నిర్మాత కథా చర్చలకు పిలిచి పడక గదికి రమ్మని ఒత్తిడి చేశాడని, అయితే తానందుకు తలవంచలేదని పేర్కొంది. అందుకేనేమో తనకు దక్షిణాదిలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదని చెప్పింది. -
అక్కడ పుట్టడమే నా తప్పు!
‘‘నా చేతుల్లో లేని తప్పు ఒకటి నా జీవితంలో జరిగిపోయింది’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఇంతకీ ఏంటా తప్పు? అనడిగితే... ‘‘ఉత్తరాది కుటుంబంలో పుట్టడమే నేను చేసిన తప్పు. నా స్నేహితులు, ఫ్యామిలీతో నేనెప్పుడూ ‘బై మిస్టేక్ నేను రాంగ్ ఫ్యామిలీలో పుట్టా’ అని చెబుతుంటా! (నవ్వుతూ) ఐయామ్ పక్కా సౌతిండియన్ ఎట్ హార్ట్. ఇక్కడి వంటకాలనే ఇష్టపడతా. నేను దక్షిణాదికి చెందిన అమ్మాయినని నా ఫీలింగ్’’ అని నవ్వేశారు. అసలు మేటర్ ఏంటంటే... ‘ఏంటి! ఈ మధ్య హిందీ సినిమాల్లో నటించడం లేదు. హిందీపై ఫోకస్ తగ్గించారా?’ అని కాజల్‌ను ప్రశ్నిస్తే ఇదంతా చెప్పుకొచ్చారు. ‘‘హిందీ నుంచి ఛాన్సులొస్తున్నాయి. కానీ, నాకు తెలుగు, తమిళ సినిమాలు చేయడమే ఇష్టం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు హ్యాపీగా ఉంది. సౌత్‌లోనే నా కెరీర్ మొదలైంది. ఇక్కడ మంచి మంచి ఛాన్సులు వస్తున్నప్పుడు హిందీకి ఎందుకు వెళ్లాలి? అక్కడికి వెళ్లడానికి నాకు కారణాలు ఏవీ కనిపించడం లేదు. హిందీలో నటించడం కోసం రాజీపడి మంచి ఛాన్సులు వదులుకోలేను’’ అన్నారు కాజల్. సో, ఈ చందమామ సౌత్ సినిమాలను వదలి ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదన్నమాట!!