అర్తన
తమిళసినిమా: నో అనడం నేర్చుకోవాలి అంటోంది వర్థమాన నటి అర్తన. ప్రారంభం నుంచే మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించే అవకాశాలను దక్కించుకున్న ఈ కేరళాకుట్టిని తమిళంలో తొండన్ చిత్రం ద్వారా దర్శకుడు సముద్రఖని పరిచయం చేశారు. ఇక్కడ తొలి చిత్రమే విజయాన్ని అందించింది. దీంతో అవకాశాలు అర్తన ఇంటి తలుపులు తడుతున్నాయి. రెండో చిత్రంగా ఇటీవల తెరపైకి వచ్చిన సెమ హిట్ అనిపించుకుంది. తాజాగా కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం, సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన వెన్నెలా కబడ్డీకుళు–2 చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతన్నాయి. ఈ సందర్భంగా నటి అర్తనతో చిన్న భేటీ.
ప్ర: నటిగా రంగప్రవేశం గురించి, కుటుంబం గురించి చెప్పండి?
జ: మాది కేరళాలోని తిరువనంతపురం. అమ్మా,నాన్నల ముద్దుల కూతురిని. సినిమా అంటే చిన్నతనం నుంచే చాలా ఇష్టం. పాఠశాలలో చదువుతున్నప్పుడే డ్రామాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. టీవీ.యాంకర్‌గా పని చేశాను. కళాశాల్లో విజువల్ కమ్యునికేషన్ పూర్తిచేసిన తరువాత మలయాళంలో సురేశ్‌గోపి కజిన్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో నటించాను. ఆ తరువాత ఒక తెలుగు చిత్రంలో నటించాను. తమిళంలో తొండన్ చిత్రంతో ఎంట్రీ జరిగిన విషయం తెలిసిందే.
ప్ర: మూడు భాషల్లో నటించారు. ఏ భాషలో నటించడం ఇష్టం అనిపించింది?
జ: నేను ఇప్పుడే కథానాయకిగా ఎదుగుతున్నాను. ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడక్కండి ప్లీజ్. ఏ భాష దేని ప్రత్యేకత దానిదే. నేను తమిళంలోనే మూడు చిత్రాల్లో నటించాను. కాబట్టి తమిళ చిత్రాలే సన్నిహితం.
ప్ర: జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో సెమ చిత్రంలో నటించిన అనుభవం?
జ: జీవీ.ప్రకాశ్‌కుమార్ మంచి వ్యక్తి. చక్కగా మాట్లాడతారు. నన్ను చాలా ప్రోత్సహించారు.సెమ చిత్రం గురించి చెప్పాలంటే ఆ చిత్రంతో నేను చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రం నన్ను చాలా ప్రాంతాలకు తీసుకెళ్లింది. కడైకుట్టి సింగం చిత్రంలో కార్తీకు జంటగా నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టింది సెమ చిత్రమే.
ప్ర: కడైకుట్టి సింగంలో మీ పాత్ర గురించి?
జ: కడైకుట్టి సింగం చిత్రం పూర్తయ్యింది. ఇందులో ముగ్గురు హీరోయిన్లం నటించాం. ఇది పూర్తిగా గ్రామంలో నివశించే ఒక కుటుంబ కథా చిత్రం. చాలా కాలం తరువాత కుటుంబ సమస్యలు చర్చించే కథాంశంతో వస్తున్న చిత్రం. దర్శకుడు పసంగ పాండిరాజ్ ఎమోషనల్ డ్రామా ఇందులో ఉంటుంది. నేను గ్రామీణ యువతిగా నటించాను. ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు అనుమతి లేదు.
ప్ర: చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించారు. ఈగో లాంటిదిలేవీ కలగలేదా?
జ: నా వరకూ ఈగో సమస్య ఎప్పుడూ రాదు. మన పని కరెక్ట్‌గా చేసుకుంటే ఎలాంటి ఈగోకు తావుండదన్నది నా భావన. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నది నా కోరిక. ఎమోషనల్ పాత్రలో రాణించాలను ఆశ పడుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఈగో, గొడవలు లాంటి సమస్యలోకి లాగకండి.
ప్ర: సరే. ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి రచ్చ జరుగుతోంది. దీనిపై మీ స్పందన?
జ: ఈ వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడటమే మంచిది. కాస్టింగ్ కౌచ్ అన్నది ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే నాకు ఇంతవరకూ అలాంటి సంఘటన ఎదురుకాలేదు. అలాగని ఇది సినిమా రంగంలో జరగడం లేదని చెప్పడం లేదు. మహిళలు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. నిజం చెప్పాలంటే మీ అంగీకారం లేకంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎలా నో చెప్పాలన్నది నేర్చుకోవాలి. నిరాకరించడం తెలిస్తే చాలు ఇలాంటి వాటి నుంచి బయట పడవచ్చు. నో చెప్పడం నేర్చుకోండి. ఇలాంటివి అధిగమించే మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలి.
Comments
Please login to add a commentAdd a comment