ఈస్టర్ శుభాకాంక్షలు
‘‘యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూడవనాడు లేచెన్.. లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయమొంది.. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్.. జయం జయం’’
అంటూ రాబర్ట్ లౌరీ వ్రాసిన పాటను గొంతెత్తి పాడే సమయం ఈస్టర్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం ఝెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది.
‘‘ఆ కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతడిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు’’ ఈ మాటలను చరిత్రకారుడు ఫ్లావియస్ జోసఫస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆయన రాసిన సంగతులు నేటికీ చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జన్మను, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ధ్రువీకరించాడు.
‘‘యేసుక్రీస్తు నిజంగా జీవించి, మరణించి, మృతులలో నుండి లేచాడన్న తమ దృఢ విశ్వాసము కొరకు వారు శ్రమపడి మరణించారు’’ అని సుటోనియస్ అనే చరిత్రకారుడు వ్రాశాడు. ఇతడు రోమా చరిత్రకారుడు. హేడ్రియన్ అనే రాజు వద్ద అధికారిగా పనిచేసేవాడు. చరిత్రకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తన వ్రాతలలో పొందుపరచాడు. రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ నుండి డొమీషియన్ వరకు గల 12 మంది చక్రవర్తుల జీవిత చరిత్రలను వ్రాశాడు. రోమా సామ్రాజ్యంలోని రాజకీయాల గూర్చి, కవులను గూర్చి, సామాన్య ప్రజలను గూర్చి చాలా విషయాలు వ్రాసి భద్రపరచాడు. మొదటి శతాబ్దంలో రగిలిన ఉజ్జీవాన్ని, సంఘం పొందిన శ్రమలను, ధైర్య విశ్వాసాలతో పరిస్థితులను ఎదుర్కొన్న దేవుని ప్రజల పరిస్థితిని సుటోనియస్ వివరించుట ద్వారా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదని, ఆయన మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగిలేచిన సజీవుడని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి దోహదమయ్యింది.
యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు.
సి.ఎస్.లూయీ అనే సుప్రసిద్థ సువార్తికుడు, వేదాంతవేత్త ఇలా అంటాడు. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే అని చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధీకుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతి స్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ట బోధలు చేసియుండేవారు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు.’’
తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని, అయన ప్రేమతత్త్వాన్ని తాను రచించిన ఎనిమిది వేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది. సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్ళు విడచుట మానండి ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’’ ఈ మాటలను తన హృదయాంతరాళాల్లోంచి వ్రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువు చేసింది క్రాస్బీ.
క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ‘‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు’’– (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది.
ఝెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం ఝెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును.
యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకసార్లు తన శిష్యులకు ఇలా చెప్పాడు. ‘‘మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను’’– (లూకా 18:3133). క్రీస్తు తనకు సంభవింపబోవు వాటిని ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు.
వాస్తవానికి యేసుక్రీస్తుకు పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్ ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తిని తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈ నాటికి ఝెరూషలేమునకు వెళ్ళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గములో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు.
సిలువ మరణ శిక్ష మొదటిగా ఫనిషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించే వారు.
యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. యేసు సిలువను మోసుకొంటూ గొల్గొతా అనే ప్రాంతాన్ని చేరుకోగానే ఆయనను సిలువపై ఉంచి చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టి వేలాడదీశారు. శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యేసును సిలువవేశారు. సుమారు ఆరు గంటలు యేసు సిలువపై వ్రేలాడి ఏడు మాటలు పలికారు. నేటికి అనేకమంది సిలువలో క్రీస్తు పలికిన యేడు మాటలను ధ్యానం చేస్తుంటారు. పలుకబడిన ఒక్కోమాటలో ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన సందేశం ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు.
అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను అంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. అంతవరకు తనలో గూడుకట్టుకున్న భయాన్ని వదిలి పిలాతు దగ్గరకు వెళ్ళి తన ప్రభువును పాతిపెట్టడానికి అనుమతి కోరాడు. సిలువ వేయబడిన ఒక వ్యక్తికోసం మహాసభ సభ్యుడైన అతడు బహిరంగంగా తీసుకొన్న తన నిర్ణయం వలన పిలాతుకు కలిగిన ఆశ్చర్యం, యూదులకు కలిగిన అసహనం ఊహించవచ్చు.
యోసేపు తనకోసం తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ‘‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గురించి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ, మరణపు ముల్లును విరిచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు.
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది గెలుపు. ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇచ్చేది. భూమ్మీద బతికే అందరికి ముఖ్యమైనది కూడా. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం వల్ల దక్కిన సంతృప్తితో కాలం గడపాలని కోరకుంటాడు. ఓటమి అంగీకరించడం చేదైన విషయమే! మింగుడు పడని వ్యవహారమే! ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో.. ఇంకా మరెన్నో! ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే ఇంత సంతోషంగా మానవుడుంటే, ప్రతి మనిషికి ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే?! మృత్యువునే గెలిస్తే?! ఇంకెంత ఆనందం, ఇంకెంత ఉత్సాహం! సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది.
మనిషి మెడలు వంచిన మరణం మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరినీ తన గుప్పిట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు, మరణానికి, దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికి అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి.
ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. గొప్పవ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబూకద్‌నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోమ్‌లో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేయబడింది.
క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్లతరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది.
యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు.
యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోనికి తీసుకొచ్చారు గాని, వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు.. స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలను ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా! సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు.
యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్‌లో లేదు గాని, చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షంలోనే యేసుకు మేకులు కొట్టబడ్డాయి. ముళ్ళకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ‘ఆ నీతిమంతుని జోలికి పోవద్దు’ అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుని, ఇలా అడిగింది
‘‘సిలువలో మరణించిన క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి? ఆ మహనీయుని గురించి ఏమనుకుంటున్నావు?’’ ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పై నుండి కిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరతాడు. ఈసారి ఆయనను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనిషికి సమాధానం, ధైర్యం, నిరీక్షణ అనుగ్రహించబడ్డాయి.
సమాధానం..
యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి శిష్యులకు ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుడైన యోహాను తన సువార్తలో వ్రాశాడు. శిష్యులంతా ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ‘మీకు సమాధానం కలుగునుగాక’ అని వారితో చెప్పెను. మూడున్నర సంవత్సరాలు తనతో ఉండి గెత్సేమనే తోటలో తనను పట్టుకుంటున్నప్పుడు విడిచి పారిపోయిన వారిని బహుశా ఎవరైనా చీవాట్లు పెడతారేమో గాని ప్రేమపూర్ణుడైన ప్రభువు వారి స్థితిని సంపూర్ణంగా తెలుసుకున్నవాడై వారికి శాంతి సమాధానాలను ప్రసాదించాడు. సమాధానకర్తయైన ప్రభువును హృదయాల్లోనికి ఆహ్వానించడమే ఆశీర్వాదకరం. ఈనాడు అనేకులు తమ పరిస్థితులను బట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు.
సమాధానం లేకనే ఆత్యహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే! నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది.
యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూసి ఇలా అన్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’’ ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. గెలుపుబాటలో దూసుకుపోయారు.
భయపడకుడి..
ఆదివారం ఉదయం తెల్లవారకముందే కొంతమంది స్త్రీలు క్రీస్తు సమాధిని చూడడానికి వచ్చారు. వారక్కడికి వచ్చినప్పటికే ఒక గొప్ప భూకంపం వచ్చింది. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధిరాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అక్కడ ఉన్న రోమా కావలివారు వణికి చచ్చినవారివలె ఉన్నారు. వారు భయపడాల్సింది ఏదీలేదనే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. లోకమంతా ఎన్నో భయాలతో నిండింది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, ఇంకా ఎన్నో సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వదు. గమ్యంవైపు సాగనివ్వదు. భయం గుప్పిట్లో జీవిస్తున్న మనిషికి నిజమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నది లేఖన సత్యం.
నిరీక్షణ..
యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగించువారికి నిత్యజీవాన్ని అనుగ్రహించుటకు రాబోతున్నారు.
ఆయన పునరుత్థానుడై ఉండకని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఎన్నడూ అవమానకరము కాదు.
‘‘విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువును గెలిచి నేడు వేంచెసె యజమానుడెల్ల ప్రయాసములు ఎడబాప స్వజనులను రక్షింప సమసె సిలువమీద... విజయంబు మానవుల పాపము నివృత్తిని విభుడొనరింపన్ కుజనులచే అతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువునుండి విజయుండై వేంచేసె’’ అంటూ కీర్తనలు పాడుచూ క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మిక ఆనందంతో, నిండు హృదయంతో దేవుని ప్రజలంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. (సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు).
— డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి
Comments
Please login to add a commentAdd a comment