నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు.
నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి.
ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.
ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment