దసరా వచ్చేసింది. నిన్నగాక మొన్ననే పెళ్లయిన కూతురుని, కొత్త అల్లుడిని, అతని తాలూకు బంధువులను పండక్కి పిలవాలి. వాళ్లకు మర్యాదలు చేయాలి. దసరా అంటేనే కొత్త అల్లుళ్ల పండుగ కదా. అవునా! ఇది అల్లుళ్ల పండుగా!! ఒక్కసారిగా సాక్షాత్తు అమ్మవారు ఆలోచనలో పడింది. నేను సాక్షాత్తు తల్లిని. స్త్రీని. అటువంటి నా నవరాత్రులను ఏ రకంగా అల్లుళ్ల పండుగ అంటారు? నా బంగారు తల్లుల పండుగ అని ఎందుకు అనడం లేదు.. అని తనలో తాను అనుకుంటుండగా కొత్తగా పెళ్లయిన ఓ జంట అమ్మవారి ముందుకు వచ్చి, ‘‘తల్లీ ఈ పండుగ ఎవరి పండుగో నీ నోటి ద్వారా వినాలని ఉంది’’ అన్నారు. అందుకు ఆ అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ చిరునవ్వుతో ‘‘చిరంజీవినీ! ఇది మీ పండుగమ్మా! ఆడ పిల్లల పండుగ, నా ముద్దుగుమ్మల పండుగ’ అంది. ఆ తల్లి అలా ఎందుకు అందో అర్థం కాలేదు కొత్త పెళ్లికూతురికి. ప్రశ్నార్థకంగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి లలితా పరమేశ్వరి మందస్మిత వదనంతో.. ‘‘ఈ పండుగ ఆడపిల్లల పండుగ అని నేను ఎందుకు అన్నానో చెబుతాను. శ్రద్ధగా విను’’ అని చెప్పడం మొదలు పెట్టారు.దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కదా.
నేను తొమ్మిది అవతారాలలో మీకు దర్శనమిస్తాను. ప్రతి తల్లి ఒక చంటి పిల్లే. తన తనువు నుంచి జన్మించిన పసిపాపను ఆడించేటప్పుడు తల్లి ముద్దుముద్దు పదాలు మాట్లాడుతుంది. మరి ఆ తల్లి బాలా త్రిపుర సుందరేగా. ఆ తరవాత నేను శ్రీగాయత్రిగా దర్శనమిస్తాను. సూర్య గాయత్రి, లక్ష్మీ గాయత్రి అంటూ ప్రతి దేవతకు ఒక గాయత్రిని చెబుతారు. ఒక్కొక్కరినీ ఒక్కో రకంగా కీర్తించే విధానాన్ని గాయత్రి అంటారు. తల్లి కూడా తన పిల్లలను లాలించేటప్పుడు, పిల్లలతో అన్ని విషయాలలోను వ్యవహరించేటప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గాయత్రీదేవి అవతారం ఎత్తవలసిందే. అలా ప్రతి తల్లి ఒక గాయత్రీ మాతే కదా. ఇక అన్నపూర్ణ అవతారం. తల్లులందరూ అన్నపూర్ణమ్మలే. తల్లి గర్భంలో నుంచి పసిబిడ్డ భూమి మీద పడిన దగ్గర నుంచి పాలిచ్చి పెంచడంతో అన్నపూర్ణ అవతారం ఎత్తుతుంది. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడంలోనే కాదు, ఇంటిలోని వారందరికీ వారి రుచులకు తగ్గట్టుగా వండి అందరిచేత సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి అనిపించుకుంటారు నా కుమార్తెలు.
మరి ఇది ఆడపిల్లల పండుగ కాదా. ఏ ఇంట్లో ఆడ పిల్ల పుట్టినా ‘మా ఇంటి మహాలక్ష్మి’ అంటారు. వాళ్లు నిజంగానే మహాలక్ష్ములు. ఆదాయవ్యయాలు చూసుకుంటూ ఇంటికి సిరిసంపదలు సమకూరుస్తూ ఇంటì ని లక్ష్మీనివాసంగా మార్చేటప్పుడు ఆ ఆడపిల్ల సాక్షాత్తు మహాలక్ష్మి అవతారమేగా. ఇది ఆడపిల్లల పండుగ కాదంటారా! తరవాత నా అవతారం సరస్వతీదేవి. పుట్టిన బిడ్డలకు మొట్టమొదటి గురువు కన్నతల్లి. పాపాయి పుట్టినది మొదలు ఊ కొట్టించడం దగ్గర నుంచి ఉన్నతుడిగా తీర్చిదిద్దేవరకు ఆ తల్లి సరస్వతి అవతారంలోనే ఉంటుంది. చిట్టి చిట్టి పలుకుల చిట్టి చిలకమ్మ దగ్గర నుంచి, పెద్ద పెద్ద డిగ్రీలు అందుకునేవరకు ఆ తల్లి తన బిడ్డతో చదువుతూనే ఉంటుంది. అటువంటప్పుడు నా బిడ్డలు సరస్వతులే కదా. ఇది ఆడపిల్లల పండుగే! పిల్లలు తప్పు పనులు చేసినా, తప్పుడు మాటలు పలికినా అపర దుర్గాదేవి అవతారం ఎత్తుతుంది తల్లి. తప్పు చేసినది తన బిడ్డే అయినా దండిస్తుంది.
పిల్లలను సన్మార్గంలోకి మార్చే అపర దుర్గాదేవి అవతారం ఎత్తే నా బిడ్డలు సాక్షాత్తు దుర్గాదేవి అవతారమే కదా. అందుకే ఇది ఆడపిల్లల పండుగ. ఇక... మహిషాసుర మర్దిని. నేను మహిషుడనే దుర్మార్గుడిని సంహరించాను. నా బిడ్డలు కూడా అటువంటి మహిషాసురులెవరైనా వారి మీదకు వస్తే, వారంతా ‘మíß షాసుర మర్దిని’ అవతారాలే. వారిని కూడా ‘జయజయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే’ అంటూ స్తుతించవలసిందే. అందుకే నా బిడ్డలు అపర మహిషాసుర మర్దిని అవతారాలు. ఇన్ని అవతారాలు ఎత్తిన తరవాత వారంతా రాజరాజేశ్వరీ మాతగా స్థిరచిత్తంతో ఉండకపోరు. ఇన్ని అవతారాలు ఎత్తుతున్న నా బిడ్డలను గుర్తుచేసే దసరా పండుగ ఆడపిల్లల పండుగే కాని అల్లుళ్ల పండుగ కాదు కదా!’’ అంటూ చిరునవ్వుతో అంతర్థానమైపోయింది జగన్మాత.
– సృజన : వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment