మందపల్లి గ్రామం
విశాఖ ఏజెన్సీలో మళ్లీ అలజడి మొదలైంది. కొయ్యూరు గూడెంకొత్తవీధి మండలాల సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య సోమవారం రెండుసార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని ప్రచారం జరుగుతున్నా వాటిని పోలీసులు నిర్ధారించడం లేదు. తాజా ఎదురు కాల్పులతో మన్యం మరోసారి భయం గుప్పెట్లోకి వెళ్లింది.
గూడెంకొత్తవీధి/కొయ్యూరు: పోలీసులు–మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుసుకున్న గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గాలికొండ ఏరియా కమిటీకి చెందిన జగన్ ఆధ్వర్యంలో 30 మంది మావోయిస్టులు పుట్టకోట నుంచి మండపల్లి వైపునకు వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో మందపల్లి మీదుగా కూంబింగ్ చేసుకువస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తొలుత మావోయిస్టులే పోలీసులపై కాల్పులను జరిపినట్టు తెలిసింది.దీనికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు ప్రారంభించారు. సుమారు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దీని తరువాత భారీగా వచ్చిన పోలీసులు సమీప ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరోసారి పోలీసులు–మావోయిస్టుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. తరువాత పోలీసు బలగాలు నలుదిక్కులా వెళ్లి కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని నిర్ధారించలేదు. ఒకే రోజు రెండుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో మండపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
భారీగా మావోయిస్టులు..
సుమారు 30 మంది మావోయిస్టులు కాల్పుల్లో పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారిలో ఒకరు లేదా ఇద్దరైనా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలు ఉంటాయ ని ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోను గాలిస్తున్నారు.
వంటపాత్రలు స్వాధీనం..
ఇదిలా ఉంటే సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు వంట చేసేందుకు ఉపయోగించే వంటపాత్రలను, పచ్చని షీట్లను, విప్లవసాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏం జరుగుతుందోనని మందపల్లి గ్రామస్తులు ఆందోళనతో ఉన్నారు.
గతంలో..
ఈ ఏడాది జూన్‌లో ప్రస్తుతం ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గరలో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మండలం గుల్లవల్లి ప్రాం తంలో ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ప్లీనరి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం తెలియడంతో పోలీసులు కూంబింగ్ ఉధృతం చేశారు.అప్పట్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నారు. దానిలో అక్కిరాజు హరిగోపాల్ అలియస్ ఆర్కే ఉన్నారని వార్తలు వచ్చాయి. సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే మందపల్లి ప్రాంతంలో ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గంగన్న అలియస్ బస్వరాజు పున్నయ్య 15 రోజుల పాటు మావోయిస్టులకు శిక్షణ ఇచ్చినట్టుగా వార్తలు రావడంతో అప్పట్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు అదే ప్రాంతానికి సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment