సాక్షి, న్యూఢిల్లీ : అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో ఉగ్రసంస్థ లష్కరే తోయిబా దాడులకు తెగబడనుందన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కుల్గాంలోని వెసుమిర్ బజార్ వద్ద లష్కరే దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నిందని, లష్కరే ఉగ్రవాది మహ్మద్ నవీద్ అలియాస్ అబూ హంజాలా ఉగ్ర బృందానికి నేతృత్వం వహిస్తాడనే సమాచారంతో అధికారులు అమర్‌నాథ్ యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్ ఆస్పత్రి వెలుపల పోలీసు అధికారులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన క్రమంలో నవీద్ తప్పించుకుని పారిపోయాడు. ఇక అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర మూకలు విరుచుకుపడతారనే సమాచారంతో భద్రతను ముమ్మరం చేసిన అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన ఎన్‌ఎస్‌జీ కమాండోలను నియోగించారు. వీరికి అత్యంతాధునిక ఆయుధాలను అప్పగించారు.
అమర్‌నాథ్ యాత్రకు పటిష్ట భద్రతను కల్పించే క్రమంలో సీఆర్‌పీఎఫ్ సైతం ప్రత్యేక మోటార్‌సైకిల్ బృందాన్ని యాత్ర మార్గంలో మోహరించింది. మరోవైపు అమర్‌నాథ్ యాత్రికులను తరలించే ప్రతి వాహనానికి ప్రభుత్వం ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌ను జతచేసి జాయింట్ కంట్రోల్ రూం నుంచి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment