ఔరంగజేబు హయాంలో నిషేధం
ఔరంగజేబు పాలనకు ముందు భారత్‌లో కేవలం దీపావళికి మాత్రమే కాదు, పెళ్లిళ్లు, పండగలు, ఇతర వేడుకల్లో సైతం బాణసంచా కాల్చే అలవాటు ఉండేది. కులమతాలకు అతీతంగా సంపన్నులు, సామాన్యులు యథాశక్తి బాణసంచా కాల్చి ఆనందించేవారు. బీజపూర్ పాలకుడు అదిల్ షా 1609లో తన కూతురి పెళ్లివేడుకల సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్పించాడు. అప్పట్లోనే ఆ బాణసంచా విలువ రూ.80 వేలు అంటే, ఏ రీతిలో బాణసంచా కాల్పులు జరిగాయో ఊహించుకోవాల్సిందే! ఔరంగజేబు సోదరుడు దారా షికో పెళ్లి వేడుకల్లోనూ ఇలాగే భారీస్థాయిలో బాణసంచా కాల్పులు జరిగాయి.
ఆ వేడుకలకు సంబంధించిన పెయింటింగ్ ఇప్పటికీ సజీవంగా ఉంది. సోదరుడిని అడ్డుతొలగించుకున్న ఔరంగజేబు 1658లో అధికారానికి వచ్చాడు. కొంతకాలం దీపావళి వేడుకలను అతగాడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ వేడుకల్లో బాణసంచా కాల్చడం ఎందుకో అతడికి హిందూమతానికి మాత్రమే సంబంధించిన కార్యక్రమంగా అనిపించింది. ఇక అంతే... దీపావళి రోజున బాణసంచా కాల్చనే కాల్చరాదంటూ 1667లో హుకుం జారీ చేశాడు. అప్పటి నుంచి అతడి పాలన ముగిసేంత వరకు... అంటే, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జనాలు బాణసంచా లేకుండానే దీపావళి జరుపుకున్నారు.
- కూర్పు: పన్యాల జగన్నాథ దాసు