ఔరంగజేబు పాలన వద్దు! | Modi congratulates Congress for 'Aurangzeb rule' | Sakshi
Sakshi News home page

ఔరంగజేబు పాలన వద్దు!

Published Tue, Dec 5 2017 2:13 AM | Last Updated on Wed, Sep 5 2018 3:33 PM

Modi congratulates Congress for 'Aurangzeb rule' - Sakshi

ధర్మపూర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఎన్నికను మొఘల్‌ పాలకుల వారసత్వ పాలనతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. మాకు ఔరంగజేబు పాలన వద్దంటూ పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభల్లో సోమవారం ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ సిగ్గు లేకుండా అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తోందని తప్పుపట్టారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవినీతి బురదలో కూరుకుపోయాయని.. అయితే తన నేతృత్వంలో గుజరాత్‌లో, కేంద్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు.
 
‘బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయడానికి రాజకీయ పార్టీలు 17 సార్లు ఆలోచిస్తాయి. అలాంటిది కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సిగ్గు వదిలేసింది. అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ.. దివాలాకోరుతనాన్ని ప్రదర్శిస్తోంది’ అని వల్సాద్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ విధానాలు, వారి భవిష్యత్తు నాయకుల శక్తి సామర్థ్యాలు ఈ నిర్ణయంతోనే మనకు అర్థమవుతున్నాయని ఆయన ఎద్దేవాచేశారు. ‘మొఘలుల పాలనలో ఎన్నికలు జరిగాయా? జహంగీర్‌ తర్వాత షాజహాన్‌ వచ్చాడు. అప్పుడు ఎన్నికలు జరిగాయా? షాజహాన్‌ తర్వాత ఔరంగజేబు అనేది అందరికీ తెలుసు’ అని కాంగ్రెస్‌ నేత మణి శంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మోదీ విమర్శలు చేశారు. ‘ఏక కుటుంబ పాలనను కాంగ్రెస్‌ పార్టీ అంగీకరిస్తుందా..? మాకు ఈ ఔరంగజేబు పాలన వద్దు.. మాకు దేశమే ముఖ్యం. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే మా హైకమాండ్‌’ అని ప్రధాని పేర్కొన్నారు.
 
‘గుజరాత్‌లో బీజేపీని ఓడించగలిగితే.. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు తమ మాట వింటారని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచిస్తోంది.అయితే అందుకు మీరు అనుమతిస్తారా? గుజరాత్‌ అభివృద్ధి ప్రయాణాన్ని మీరు అడ్డుకుంటారా?’ అని మోదీ ప్రశ్నించగా.. లేదు అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ప్రచారంలో రాహుల్‌ తరచూ దేవాలయాల సందర్శనపై మోదీ విమర్శలు కురిపించారు. ‘ఇంతకుముందు.. లౌకిక వాదులుగా చెప్పుకునేందుకు వారు పోటీ పడేవారు. తాను లౌకిక వాదినని ఒకరు చెబితే, మరొకరు తాను నాలుగు కిలోలు ఎక్కువ లౌకిక వాదినని, మూడో వ్యక్తి ఆరు కిలోల ఎక్కువ లౌకికవాదినని చెప్పుకునేవారు. గుజరాత్‌ ఎన్నికలకు ముందు ఆ పోటీ ఏమైంది. హిందూ ఓట్ల కోసమే వారు ఆలయాల్ని సందర్శిస్తున్నారని ప్రజలు గ్రహించగలరు’ అని ప్రధాని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement