రుచి సోయాపై దివాలా కేసు
ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారీగా రుణ బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో వంట నూనెల తయారీ సంస్థ రుచి సోయా ఇండస్ట్రీస్‌పై బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాయి. స్టాం డర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా కేసు దాఖలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను పరిశీలించేందుకు రుచి సోయా ఇండస్ట్రీస్ బోర్డు ఇటీవలే ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజా పిటీషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది డిసెంబర్ 13 లోగా రుణాల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలంటూ బ్యాంకులకు ఆర్‌బీఐ పంపిన రెండో జాబితాలో రుచి సోయా సంస్థ ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కంపెనీ మొత్తం రుణాలు రూ. 12,232.22 కోట్లుగా ఉన్నాయి. రుచి సోయా ప్రధానంగా వంట నూనెల రిఫైనింగ్, విక్రయం, పవన విద్యుదు త్పత్తి మొదలైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో 74% వాటా వంట నూనెలదే ఉంది.