Bankruptcy Act
-
మళ్లీ గాల్లో ఎగరనున్న ఆ బడా ఎయిర్ లైన్స్ కంపెనీ
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్దం అవుతుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ గాల్లో ఎగరనున్నాయని జలాన్ కల్రాక్ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. న్యూఢిల్లీ నుంచి ముంబైకి తన మొదటి విమానంతో దేశీయ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి అంతర్జాతీయ విమానాలు కూడా పనిచేస్తాయని కంపెనీ ఈ రోజు తెలిపింది. 100కి పైగా విమాన సేవలు గ్రౌండెడ్ క్యారియర్ పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. "జెట్ ఎయిర్వేస్ 2.0 2022 మొదటి తొలి త్రైమాసికంలో దేశీయ కార్యకలాపాలను పునఃప్రారంభించడం, క్యూ3/క్యూ4 2022 నాటికి స్వల్ప కాలిక అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మా ప్రణాళికలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో 50+ విమానాలు, 5 సంవత్సరాలలో 100+ పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని కన్సార్టియం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నట్లు" లండన్ కు చెందిన జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ అన్నారు.(చదవండి: ఈఎస్ఐసీ చందాదారులకు కేంద్రం శుభవార్త!) విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి "విమానయాన చరిత్రలో 2 సంవత్సరాలకు పైగా మూతబడిన ఒక విమానయాన సంస్థను పునరుద్ధరించబడటం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని శ్రీ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్. భారీ అప్పుల కారణంగా ఏప్రిల్ 2019లో అన్ని విమానాలను నిలిపి వేయాల్సి వచ్చింది. జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12000 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్రాక్-జలాన్ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది.(చదవండి: పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..) 1000కి పైగా ఉద్యోగాలు పునరాగమనం చేస్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. "జెట్ ఎయిర్ వేస్ ముంబైలోని తన 'గ్లోబల్ వన్' కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు" అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. "జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుంది. అలాగే వివధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 1000 మందికి పైగా ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేయాలని చూస్తున్నాము" అని కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన అన్నారు. -
ఎన్సీఎల్ఏటీ ముందుకు జెట్ ఎయిర్వేస్ దివాలా కేసు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ దివాలా విషయంలో జలాన్ కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలును నిలిపివేయాలని ఆ విమాన సంస్థ క్యాబిన్, గ్రౌండ్ సిబ్బంది ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. ఈ పరిష్కార ప్రక్రియలో తమ వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజన అంశాలు లేవని వివరించింది. తమ వాదనలు విని, తుది తీర్పు వెలువరించేంతవరకూ జూన్‌లో ఎస్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్ ఆమోదించిన కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలుపై స్టే ఇవ్వాలని ఎన్సీఎల్ఏటీని అభ్యర్థించింది. రుణ భారాల్లో కూరు కుపోయిన జెట్ ఎయిర్వేస్ రెండేళ్లుగా కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అద్దె యంత్రాల కోసం సోనాలికా యాప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా గ్రూప్ ‘సోనాలికా అగ్రో సొల్యూషన్స్’ పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలు, ట్రాక్టర్ల వంటివి అద్దెకిచ్చే వ్యక్తులను ఈ యాప్ ద్వారా రైతులతో అనుసంధానిస్తారు. రైతులు సైతం తమ వద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వాలనుకుంటే ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. -
మొండి పద్దులు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మొండి బాకీలు భారీగా పెరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. చాలా మటుకు బాకీలను దివాలా చట్టం వెలుపలే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారీ మొండిబాకీల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు తప్పనిసరైన అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘అత్యంత జాగ్రత్తగా రూపొందించిన, విజయవంతంగా నిర్వహిస్తున్న బ్యాడ్ బ్యాంకులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో మలేషియాకు చెందిన దానహర్త కూడా ఒకటి. మనకంటూ బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకునే క్రమంలో దానహర్త మోడల్‌ను అధ్యయనం చేయవచ్చు’ అని దువ్వూరి చెప్పారు. దివాలా చట్టం (ఐబీసీ) కోడ్ కింద కేసులు ఇప్పటికే పేరుకుపోయాయని, కొత్తగా వచ్చేవి న్యాయస్థానాలపై మరింత భారంగా మారతాయని తెలిపారు. కాబట్టి ఐబీసీ పరిధికి వెలుపలే చాలా మటుకు బాకీల పరిష్కారం చోటు చేసుకోవాల్సి రావచ్చని పేర్కొన్నారు. దివాలా చట్టంతో మొండిబాకీల సమస్య పరిష్కారం కాగలదని, బ్యాడ్ బ్యాంక్ అవసరం ఉండదని గతంలో భావించానని దువ్వూరి చెప్పారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ అభిప్రాయం సరికాదనిపిస్తోందని పేర్కొన్నారు. -
12,000 దివాలా కేసులు దాఖల్డు
న్యూఢిల్లీ: దివాలా చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 12,000 కేసులు దాఖలయ్యాయని కంపెనీ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. వీటిల్లో రూ.2 లక్షల కోట్ల సొమ్ములతో ముడిపడిన 4,500 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 1500 కేసులను విచారించనున్నారని, మరో 6,000 కేసులు విచారణ కోసం వరుసలో వేచి ఉన్నాయని వివరించారు. కేసుల పరిష్కారానికి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) చివరి అవకాశమని పేర్కొన్నారు. దివాలా కేసుల పరిష్కారానికి ఎన్సీఎల్టీ సాహసోపేతంగా వ్యవహరిస్తోందని వివరించారు. సీఐఐ, బ్రిటిష్ హై కమిషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రికవరీలో మంచి ఫలితాలు.... పెద్ద కేసులు పరిష్కారం కావడానికి 270కి మించిన రోజులు పడుతోందని, కొన్ని కేసులకు దీనికి రెట్టింపు సమయం కూడా పట్టొచ్చని, అయితే రికవరీ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయని వివరించారు. ఎస్సార్ కేసు విషయంలో రూ.42,000 కోట్లు రికవరీ అయ్యాయని తెలిపారు. ఐబీసీ అమల్లోకి రాకముందు పెద్ద కేసుల పరిష్కారానికి నాలుగు నుంచి ఐదేళ్లు పట్టేదని, ఇప్పుడు ఒకటి, రెండేళ్లలోనే కేసులు పరిష్కారమవుతున్నాయన్నారు. సీఒసీ కీలక పాత్ర.... దివాలా ప్రక్రియలో రుణదాతల కమిటీ(సీఓసీ)ది కీలకమైన బాధ్యత అని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ)చైర్మన్ ఎమ్.ఎస్. సాహూ వ్యాఖ్యానించారు. కంపెనీ మనుగడ సాగిస్తుందో, లేదో గుర్తించడం, తగిన రిజల్యూషన్ ప్లాన్‌ను రూపొందించడం వంటి కీలక బాధ్యతలను సీఓసీ నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు. -
‘బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల కోత ఉండదు’
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయా బ్యాంక్‌లను.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైట్లీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పడుతుందని.. ఫలితంగా రుణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయని ప్రకటించారు. కానీ బ్యాంకుల వద్ద ఉన్న ఎన్పీఏలు ఫలితంగా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. దివాల చట్టం సాయంతో రూ. 3లక్షల కోట్లను తిరిగి వ్యవస్థలోకి తెవడమే కాక ఎన్పీఏలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కింద డిసెంబరు 31 నాటికి రూ. 51,533కోట్లను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. దీని గురించి జైట్లీ ‘2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రూ. 65వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల రికాపిటలైజేషన్ కోసం కేటాయించాం. ఇందులో డిసెంబరు 31 నాటికి రూ. 51,533 కోట్లను బ్యాంకులకు ఇచ్చాం. ఎన్పీఏలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలను చవి చూస్తున్నాయి’ అని జైట్లీ తెలిపారు. -
రూ. 1.8 లక్షల కోట్లు దాటనున్న మొండిబాకీల రికవరీ
న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం (ఐబీసీ) ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.80 లక్షల కోట్ల పైగా మొండిబాకీల (ఎన్పీఏ) రికవరీ కాగలదని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద ఖాతాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుండగా, మరికొన్ని ఖాతాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ వంటి కేసులను ఉటంకిస్తూ ఇదే తీరు కొనసాగితే తాము నిర్దేశించుకున్న రూ. 1.80 లక్షల కోట్ల మొండిబాకీల రికవరీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2017–18లో బ్యాంకులు రూ. 74,562 కోట్లు రాబట్టుకోగలిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,551 కోట్లు రికవర్ చేసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించిన 12 భారీ మొండిబాకీ కేసుల పరిష్కారం ద్వారా కనీసం రూ. లక్ష కోట్ల పైగా రాగలవని బ్యాంకులు ఆశిస్తున్నాయి. ఆర్బీఐ రూపొందించిన భారీ ఎన్‌పీఏల్లోని ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్ పరిష్కార ప్రక్రియ ప్రస్తుతం తుది దశల్లో ఉంది. బినానీ సిమెంట్, జేపీ ఇన్ఫ్రాటెక్ పరిష్కార ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఎస్సార్ స్టీల్‌కి ఇచ్చిన సుమారు రూ. 49,000 కోట్ల రుణాల్లో దాదాపు 86 శాతం మొత్తాన్ని రాబట్టుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. -
ఎన్పీఏ సమస్య సత్వర పరిష్కారం కష్టమే!!
న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఇండియన్ బ్యాంకులు అతిపెద్ద మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యకు త్వరితగతిన పరిష్కారాన్ని చూడలేవని బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ తెలిపారు. దేశం పెట్టుబడుల కొరతను ఎదుర్కొంటోందని, జీడీపీలో ప్రస్తుత స్థూల పెట్టుబడుల వాటా 7.5–8 శాతం స్థిర వృద్ధికి సరిపోదని పేర్కొన్నారు. ఈయన 2017–18 వార్షిక నివేదికలో సంస్థ వాటాదారులకు రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ల కొరత, బ్యాంకుల ప్రస్తుత పరిస్థితి అనే రెండు ప్రధాన అంశాల కారణంగా దేశ జీడీపీ వృద్ధి నెమ్మదించిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ వార్షిక ప్రాతిపదికన 2017–18 ఆర్థిక సంవత్సరంలో నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో (6.7 శాతం) వృద్ధి చెందింది. 2016–17 ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.1 శాతం. 2013–14లో వృద్ధి కనిష్టంగా 6.4 శాతంగా నమోదయ్యింది. కొండలా భారీగా పేరుకుపోయిన ఎన్పీఏలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను నాశనం చేశాయని, లాభాలను హరించేశాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త దివాలా చట్టం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనివల్ల ఎన్పీఏల సమస్య సత్వర పరిష్కారాన్ని చూడలేదని తెలిపారు. జీడీపీపై పెట్టుబడుల కొరత ప్రభావాన్ని వివరిస్తూ.. ‘జీడీపీలో స్థూల స్థిర పెట్టుబడుల వాటా గత ఆరేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ప్రస్తుతం 31 శాతంగా ఉంది. 7.5–8 శాతం స్థిర వృద్ధికి ఇది సరిపోదు’ అని పేర్కొన్నారు. దేశీ మోటార్‌సైకిల్ విక్రయాల తగ్గుదల సంస్థపై ప్రభావం చూపదని, మరింత మంచి పనితీరును ప్రదర్శిస్తుందని రాహుల్ బజాజ్ తెలిపారు. -
ఎన్సీఎల్టీ ముందుకు వీడియోకాన్
ముంబై: దివాలా చట్టం (ఐబీసీ) కింద వీడియోకాన్ ఇండస్ట్రీస్ కేసును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బుధవారం నమోదు చేసుకుంది. ఈ కేసులో మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కేపీఎంజీకి చెందిన అనుజ్జైన్ను నియమించింది. 180 రోజుల్లోగా కంపెనీని జైన్ టర్న్ అరౌండ్ చేయాల్సి ఉంటుంది. అదనంగా మరో 90 రోజుల కాల వ్యవధి కోరవచ్చు. అప్పటికీ ఫలితం లేకుంటే కంపెనీ ఆస్తుల్ని వేలం వేస్తారు. కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన అన్ని దివాలా కేసులనూ కలిపి విచారించాలని ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో వీడియోకాన్ ఆశ్రయించింది. ఇందుకు ఎన్సీఎల్టీ అంగీకరించిందని వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ చెప్పారు. మొత్తం రూ.20,000 కోట్ల రుణాల్లో 70– 80 శాతం వరకు బ్యాంకులు వసూలు చేసుకోగలవన్నారు. మొత్తం ప్రక్రియ ఎలాంటి అవాంతరాల్లేకుండా 180 రోజుల్లోపు ముగిసిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘ముందుగా మూలధన అవసరాలను పరిష్కరించాలి. రుణదాతలందరి ప్రయోజనాల పరిరక్షణ బాధ్యతను దివాలా పరిష్కార నిపుణుడు తీసుకోవాలి. దీనికి మా సహకారం ఉంటుంది. కంపెనీకి చాలా ఆస్తులున్నాయి. విదేశీ చమురు క్షేత్రాల్లోనూ వాటాలు ఉన్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు మా గ్రూపునకు మంచివే’’ అని ధూత్ వివరించారు. -
దివాలా చట్ట సవరణలకు కేంద్రం ఓకే..
న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా దివాలా చట్టం (ఐబీసీ) సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో రుణాలిచ్చే ఇతరత్రా బ్యాంకులు, ఆర్థిక సంస్థల తరహాలోనే గృహాల కొనుగోలుదారులను కూడా ’ఆర్థిక రుణదాతల’ కింద వర్గీకరించేందుకు వీలు కానుంది. ఫలితంగా.. డిఫాల్ట్ అయ్యే కంపెనీల నుంచి వారు కూడా సత్వరం రీఫండ్లు పొందే వెసులుబాటు లభిస్తుంది. అలాగే, రుణాలిచ్చిన సంస్థలు .. బకాయీలను రాబట్టుకునే ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఈ మేరకు దివాలా చట్ట కమిటీ గత నెలలో చేసిన సిఫార్సులను ఈ ఆర్డినెన్స్‌లో పొందుపర్చినట్లు భావిస్తున్నారు. ఆర్డినెన్స్‌కి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. అయితే, రాష్ట్రపతి కూడా ఆమోదించే దాకా సవరణల గురించి వెల్లడించేందుకు లేదని ఆయన పేర్కొన్నారు. 2016 డిసెంబర్లో ఈ చట్టం అమల్లోకి రాగా.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసే బిడ్డర్ల అర్హతలకు సంబంధించిన మరిన్ని నిబంధనలతో నవంబర్‌లో కొత్తగా సెక్షన్ 29ఏ ని చేర్చారు. కమిటీ సిఫార్సులు .. దివాలా చట్ట కమిటీ గత నెలలో కార్పొరేట్ వ్యవహారాల శాఖకు పలు సిఫార్సులు చేసింది. రియల్టీ సంస్థల దివాలా పరిష్కార ప్రక్రియలో గృహాల కొనుగోలుదారులు కూడా పాలుపంచుకునే అధికారాలు కల్పిస్తూ.. వారిని కూడా అప్పు ఇచ్చిన ఆర్థిక రుణదాతల కింద వర్గీకరించాలని సూచించింది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకుండా చేతులెత్తేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి గృహ కొనుగోలుదారులు తమ డబ్బును సత్వరం రాబట్టుకునేందుకు ఈ సిఫార్సు తోడ్పడనుంది. -
ఎస్సార్ స్టీల్ కొనుగోలు రేసులో టాటా, ఆర్సెలర్ మిట్టల్
న్యూఢిల్లీ: రుణ బకాయిలు చెల్లించలేక దివాలా కోరల్లో చిక్కుకున్న ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు దేశీ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. ప్రధానంగా టాటా స్టీల్, ఆర్సెలర్ మిట్టల్‌తో పాటు ఎస్సార్ గ్రూప్ కూడా బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్సార్ స్టీల్ ఇండియాకు రుణాలిచ్చిన బ్యాంకులు ఇప్పటికే దివాలా చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రక్రియను(సీఐఆర్‌పీ) మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీని విక్రయించడం కోసం అక్టోబర్ 23న కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్లను ఆహ్వానించారు. తాము కూడా ఈఓఐను సమర్పించామని, పరిష్కార ప్రణాళికను నిర్దేశిత కాలవ్యవధిలోపే సమర్పిస్తామని ఎస్సార్ గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, బిడ్డింగ్‌లో పాల్గొనడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్నకు... దివాలా చట్టం ప్రకారం ప్రమోటర్లు(ఎస్సార్ గ్రూప్) కూడా దివాలా ప్రక్రియలో ఉన్న తమ సొంత కంపెనీ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) చేపడుతున్న ఈ దివాలా ప్రక్రియలో తమను నిలువరించేలా ఎలాంటి పరిమితులూ లేవని... అమెరికా, బ్రిటన్‌తో సహా అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో సైతం ఇదే విధానం అమల్లో ఉందని వివరించారు. మరోపక్క, బిడ్‌కు జతగా రష్యా ఆర్థిక సంస్థ వీటీబీ క్యాపిటల్ నుంచి నిధుల హామీ పత్రాన్ని కూడా ఎస్సార్ గ్రూప్ సమర్పించినట్లు సమాచారం. వీటీబీ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఇది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీటీబీ బ్యాంక్‌లో రష్యా ప్రభుత్వానికి మెజారిటీ (60.9 శాతం) వాటా ఉంది. కాగా, ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆసక్తి లేదని వేదాంత ప్రతినిధి స్పష్టం చేశారు. అప్పులు రూ.45 వేల కోట్లు... ఎస్సార్ స్టీల్ ఇండియాకు దేశంలో వార్షికంగా కోటి టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని పారదీప్‌లలో 2 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన బెనిఫికేషన్, పెల్లెట్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పటివరకూ తాము రూ.5 వేల కోట్లమేర పెట్టుబడులు పెట్టామని ఎస్సార్ స్టీల్ చెబుతోంది. ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటివరకూ రూ.16,000 కోట్లను సమీకరించినట్లు తెలిపింది. ప్రత్యక్షంగా 5 వేల మంది, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది. రూయాలకు చెందిన ఎస్సార్ గ్రూప్ ప్రమోట్ చేసిన మరో కంపెనీ ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, దివాలా ప్రక్రియను ఆమలు చేయాలంటూ ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశించిన 12 కంపెనీల తొలి జాబితాలో ఎస్సార్ స్టీల్ కూడా ఒకటి. దివాలా చట్టం ప్రకారం ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్‌పై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బకాయిల వసూలు కోసం ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్‌ను దాఖలు చేశాయి. బ్యాంకులకు ఎస్సార్ స్టీల్ చెల్లించాల్సిన రుణ బకాయిలు దాదాపు రూ.45,000 కోట్లుగా అంచనా. -
రుచి సోయాపై దివాలా కేసు
ఎన్సీఎల్టీని ఆశ్రయించిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ న్యూఢిల్లీ: భారీగా రుణ బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో వంట నూనెల తయారీ సంస్థ రుచి సోయా ఇండస్ట్రీస్‌పై బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాయి. స్టాం డర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా కేసు దాఖలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను పరిశీలించేందుకు రుచి సోయా ఇండస్ట్రీస్ బోర్డు ఇటీవలే ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజా పిటీషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 13 లోగా రుణాల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ పంపిన రెండో జాబితాలో రుచి సోయా సంస్థ ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కంపెనీ మొత్తం రుణాలు రూ. 12,232.22 కోట్లుగా ఉన్నాయి. రుచి సోయా ప్రధానంగా వంట నూనెల రిఫైనింగ్, విక్రయం, పవన విద్యుదు త్పత్తి మొదలైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో 74% వాటా వంట నూనెలదే ఉంది. -
దివాలా చట్టం’పై ఎస్సార్ స్టీల్‌కు చుక్కెదురు
♦ చర్యలు నిలిపివేయాలన్న అభ్యర్థనకు కోర్టు నో అహ్మదాబాద్: దివాలా చట్టం కింద చర్యలు నిలిపివేయాలంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్ స్టీల్‌కు చుక్కెదురైంది. కంపెనీ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టేసింది. ఎస్సార్ స్టీల్ రుణభారం రూ.42,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇలా మొండిబాకీల భారం పెరిగిపోయిన 12 కంపెనీలపై ఆర్బీఐ సూచనల మేరకు బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఎస్సార్ స్టీల్.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మిగతా మొండి బాకీల కంపెనీల తరహాలో తమ సంస్థను కూడా జమ కట్టరాదని కంపెనీ పేర్కొంది. రూ. 20,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో తమ కంపెనీ ఇంకా పనిచేస్తూనే ఉందని, రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు తుది దశలో ఉన్న తరుణంలో ఇలాంటి చర్యలు సరికాదని వాదించింది. ఆర్బీఐ గానీ సర్క్యులర్ జారీ చేయకపోయి ఉంటే ఎస్బీఐ కన్సార్షియం తమపై దివాలా చర్యలకు ఉపక్రమించేది కాదని తెలిపింది. మరోవైపు, ఎస్సార్ స్టీల్ వాస్తవాలను తొక్కిపెట్టి కోర్టును పక్కదోవ పట్టిస్తోందంటూ ఆర్బీఐ తరఫు న్యాయవాది డేరియస్ ఖంబాటా వాదించారు. ఎస్సార్ స్టీల్ ఒక దశలో తమ కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) పంపే విషయంలో సుముఖత వ్యక్తం చేసిందని, కానీ ఆ విషయాన్ని మాత్రం తమ పిటిషన్లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఒకవేళ సదరు అంశం వెల్లడించి ఉంటే న్యాయస్థానం పిటిషన్‌ను ముందుగానే కొట్టిపారేసి ఉండేదని వివరించారు. మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సింది.. పిటిషన్ కొట్టివేత దరిమిలా.. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను పూర్తి చేసేందుకు తమకు మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సిందని ఎస్సార్ స్టీల్ వ్యాఖ్యానించింది. ఈ దశలో దివాలా చర్యలు చేపడితే.. కంపెనీ కార్యకలాపాలు మరింతగా దెబ్బతింటాయని, మొండిబాకీ సమస్యకు పరిష్కారం ఇంకా జటిలం కాగలదని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఎన్సీఎల్టీ ముందు తమ వాదనలు వినిపిస్తామని ఎస్సార్ స్టీల్ తెలిపింది. -
మరో 3 సంస్థలపై దివాలా చర్యలు
♦ ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ♦ ఎలక్ట్రో స్టీల్‌పై బ్యాంకర్ల నిర్ణయం ముంబై: రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా మూడు ఉక్కు ఉత్పత్తి సంస్థలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటి ఖాతాలను దివాలా చట్టం కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి నివేదించాలని ఎస్బీఐ సారథ్యంలో గురువారం సమావేశమైన బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. భూషణ్ స్టీల్ రూ. 44,478 కోట్లు, ఎస్సార్ స్టీల్ రూ. 37,284 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ రూ. 10,274 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డాయి. ప్రధానంగా ఎన్సీఎల్టీలో దాఖలు చేసే కేసు పిటిషన్‌ను ఖరారు చేసేందుకే బ్యాంకులు సమావేశమైనట్లు సీనియర్ బ్యాంకర్ తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా దీనికి హాజరైనట్లు వివరించారు. భారీగా మొండి బాకీలు పేరుకుపోయాయని ఆర్బీఐ గుర్తించిన 12 ఖాతాల్లో ఈ మూడు కూడా ఉన్నాయి. సుమారు రూ. 37,248 కోట్లు బకాయిపడిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఐడీబీఐ బ్యాంకు సారథ్యంలోని కన్సార్షియం నేడు (శుక్రవారం) భేటీ కానుంది. వీటితో పాటు రుణగ్రస్త సంస్థల్లో ల్యాంకో ఇన్ఫ్రా, ఆమ్టెక్ ఆటో, అలోక్ ఇండస్ట్రీస్, మోనెట్ ఇస్పాత్ మొదలైనవి ఉన్నాయి. 6 నెలల్లో 55 ఖాతాల ఎన్పీఏలు పరిష్కరించుకోవాలి: ఆర్బీఐ న్యూఢిల్లీ: భారీగా రుణభారం పేరుకుపోయిన 55 ఖాతాలకు సంబంధించిన మొండిపద్దులను(ఎన్పీఏ) ఆరు నెలల్లోగా పరిష్కరించుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. లేని పక్షంలో ఆయా కేసుల్లో దివాలా చట్టం (ఐబీసీ) అమలుకు ఆదేశించాల్సి వస్తుందని పేర్కొంది. మొండి బాకీల్లో పావు శాతం వాటా ఉన్న 12 ఖాతాలకు సంబంధించి ఇటీవలే దివాలా ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.