
న్యూఢిల్లీ: దివాలా చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 12,000 కేసులు దాఖలయ్యాయని కంపెనీ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. వీటిల్లో రూ.2 లక్షల కోట్ల సొమ్ములతో ముడిపడిన 4,500 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. 1500 కేసులను విచారించనున్నారని, మరో 6,000 కేసులు విచారణ కోసం వరుసలో వేచి ఉన్నాయని వివరించారు. కేసుల పరిష్కారానికి ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) చివరి అవకాశమని పేర్కొన్నారు. దివాలా కేసుల పరిష్కారానికి ఎన్‌సీఎల్‌టీ సాహసోపేతంగా వ్యవహరిస్తోందని వివరించారు. సీఐఐ, బ్రిటిష్ హై కమిషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రికవరీలో మంచి ఫలితాలు....
పెద్ద కేసులు పరిష్కారం కావడానికి 270కి మించిన రోజులు పడుతోందని, కొన్ని కేసులకు దీనికి రెట్టింపు సమయం కూడా పట్టొచ్చని, అయితే రికవరీ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయని వివరించారు. ఎస్సార్ కేసు విషయంలో రూ.42,000 కోట్లు రికవరీ అయ్యాయని తెలిపారు. ఐబీసీ అమల్లోకి రాకముందు పెద్ద కేసుల పరిష్కారానికి నాలుగు నుంచి ఐదేళ్లు పట్టేదని, ఇప్పుడు ఒకటి, రెండేళ్లలోనే కేసులు పరిష్కారమవుతున్నాయన్నారు.
సీఒసీ కీలక పాత్ర....
దివాలా ప్రక్రియలో రుణదాతల కమిటీ(సీఓసీ)ది కీలకమైన బాధ్యత అని ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ)చైర్మన్ ఎమ్.ఎస్. సాహూ వ్యాఖ్యానించారు. కంపెనీ మనుగడ సాగిస్తుందో, లేదో గుర్తించడం, తగిన రిజల్యూషన్ ప్లాన్‌ను రూపొందించడం వంటి కీలక బాధ్యతలను సీఓసీ నిర్వర్తించాల్సి ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment