న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్‌వేస్ తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్దం అవుతుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జెట్ ఎయిర్‌వేస్ విమానాలు మళ్లీ గాల్లో ఎగరనున్నాయని జలాన్ కల్‌రాక్ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. న్యూఢిల్లీ నుంచి ముంబైకి తన మొదటి విమానంతో దేశీయ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి అంతర్జాతీయ విమానాలు కూడా పనిచేస్తాయని కంపెనీ ఈ రోజు తెలిపింది.
100కి పైగా విమాన సేవలు
గ్రౌండెడ్ క్యారియర్ పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. "జెట్ ఎయిర్‌వేస్ 2.0 2022 మొదటి తొలి త్రైమాసికంలో దేశీయ కార్యకలాపాలను పునఃప్రారంభించడం, క్యూ3/క్యూ4 2022 నాటికి స్వల్ప కాలిక అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మా ప్రణాళికలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో 50+ విమానాలు, 5 సంవత్సరాలలో 100+ పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని కన్సార్టియం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నట్లు" లండన్ కు చెందిన జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ అన్నారు.(చదవండి: ఈఎస్‌ఐసీ చందాదారులకు కేంద్రం శుభవార్త!)
విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి
"విమానయాన చరిత్రలో 2 సంవత్సరాలకు పైగా మూతబడిన ఒక విమానయాన సంస్థను పునరుద్ధరించబడటం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని శ్రీ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్. భారీ అప్పుల కారణంగా ఏప్రిల్ 2019లో అన్ని విమానాలను నిలిపి వేయాల్సి వచ్చింది. జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఈ ఏడాది జూన్‌లో ఆమోదించింది.
ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్ క్యాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్ ఎయిర్‌వేస్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12000 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్‌రాక్-జలాన్ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.(చదవండి: పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..)
1000కి పైగా ఉద్యోగాలు
పునరాగమనం చేస్తున్న జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. "జెట్ ఎయిర్ వేస్ ముంబైలోని తన 'గ్లోబల్ వన్' కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు" అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. "జెట్ ఎయిర్‌వేస్ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుంది. అలాగే వివధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 1000 మందికి పైగా ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేయాలని చూస్తున్నాము" అని కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment