మరో 3 సంస్థలపై దివాలా చర్యలు
♦ ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్,
♦ ఎలక్ట్రో స్టీల్‌పై బ్యాంకర్ల నిర్ణయం
ముంబై: రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా మూడు ఉక్కు ఉత్పత్తి సంస్థలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటి ఖాతాలను దివాలా చట్టం కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి నివేదించాలని ఎస్‌బీఐ సారథ్యంలో గురువారం సమావేశమైన బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. భూషణ్ స్టీల్ రూ. 44,478 కోట్లు, ఎస్సార్ స్టీల్ రూ. 37,284 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ రూ. 10,274 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డాయి.
ప్రధానంగా ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేసే కేసు పిటిషన్‌ను ఖరారు చేసేందుకే బ్యాంకులు సమావేశమైనట్లు సీనియర్ బ్యాంకర్ తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా దీనికి హాజరైనట్లు వివరించారు. భారీగా మొండి బాకీలు పేరుకుపోయాయని ఆర్‌బీఐ గుర్తించిన 12 ఖాతాల్లో ఈ మూడు కూడా ఉన్నాయి. సుమారు రూ. 37,248 కోట్లు బకాయిపడిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఐడీబీఐ బ్యాంకు సారథ్యంలోని కన్సార్షియం నేడు (శుక్రవారం) భేటీ కానుంది. వీటితో పాటు రుణగ్రస్త సంస్థల్లో ల్యాంకో ఇన్‌ఫ్రా, ఆమ్‌టెక్ ఆటో, అలోక్ ఇండస్ట్రీస్, మోనెట్ ఇస్పాత్ మొదలైనవి ఉన్నాయి.
6 నెలల్లో 55 ఖాతాల ఎన్‌పీఏలు పరిష్కరించుకోవాలి: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: భారీగా రుణభారం పేరుకుపోయిన 55 ఖాతాలకు సంబంధించిన మొండిపద్దులను(ఎన్‌పీఏ) ఆరు నెలల్లోగా పరిష్కరించుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. లేని పక్షంలో ఆయా కేసుల్లో దివాలా చట్టం (ఐబీసీ) అమలుకు ఆదేశించాల్సి వస్తుందని పేర్కొంది. మొండి బాకీల్లో పావు శాతం వాటా ఉన్న 12 ఖాతాలకు సంబంధించి ఇటీవలే దివాలా ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే.