Bhushan Steel
-
మరో కుంభకోణం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌కు సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్‌కు భారీ ఎత్తున కుచ్చు టోపీ పెట్టిన కంపెనీ మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకును కూడా ముంచేసింది. రూ.238 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఫోరెన్సిక్ ఆడిట్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రూ.238.30 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు, కంపెనీ, దాని డైరెక్టర్లు ఈ మేర ఫండ్స్ మళ్లించినట్లు తెలిపింది. ఈ మేరకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించింది. రుణదాతల బ్యాంకుల కన్సార్టియం నుంచి నిధులను సేకరించేందుకు భూషణ్ పవర్ అండ్ స్టీల్స్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని, అకౌంట్ బుక్స్‌ను తారుమారు చేసిందని పంజాబ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. దీంతో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు గురువారం 6 శాతం పతనమయ్యాయి. -
భూషణ్ పవర్ అండ్ స్టీల్ మరో భారీ కుంభకోణం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయల స్కాంలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలహాబాద్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ (బిపిఎస్ఎల్) రూ .1,774.82 కోట్లకు ముంచేసిందంటూ అలహాబాదు బ్యాంకు శనివారం ప్రకటించింది. భూషణ స్టీల్ కంపెనీకి సంబంధించి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత, అలహాబాద్ బ్యాంకులో ఇంత పెద్ద భారీ కుంభకోణం వెలుగు చూడటం బ్యాంకింగ్ వర్గాలను విస్మయ పర్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఈ స్కాంను గుర్తించామని రెగ్యులేటరీ సమాచారంలో అలహాబాదు బ్యాంకు వెల్లడించింది. దీంతో స్యూ మోటో ప్రాతిపదికన కంపెనీ, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేశామని పేర్కొంది. అక్రమంగా నిధులను మళ్లించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అలహాబాద్ బ్యాంకు నివేదించింది. ఇప్పటికే 900.20 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి, అక్రమ పద్ధతుల్లో బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసి కన్సార్షియం బ్యాంకులను మోసం చేసినట్టుగా గుర్తించినట్టు తెలిపింది. కాగా దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఇటీవల పీఎన్బీ వెల్లడించింది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్బీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మరో షాక్!!
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ ఫ్రాడ్ నుంచి తేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)కి మరో షాక్ తగిలింది. తాజాగా దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ (బీపీఎస్ఎల్) సంస్థ దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఖాతాల్లో అంకెల గారడీతో బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందిన బీపీఎస్ఎల్.. ఆ నిధులను దుర్వినియోగం చేసిందని ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైనట్లు పీఎన్బీ పేర్కొంది. ‘ఫోరెన్సిక్ ఆడిట్ విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన నిధుల మళ్లింపు అభియోగాలతో బీపీఎస్ఎల్, దాని డైరెక్టర్లపై సీబీఐ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీన్ని ఆర్బీఐకి నివేదించాం‘ అని పేర్కొంది. అయితే, ఈ ఖాతాకు సంబంధించి నిబంధనల ప్రకారం ఇప్పటికే రూ. 1,932 కోట్ల మేర కేటాయింపులు జరిపినట్లు పీఎన్బీ తెలిపింది. బీపీఎస్ఎల్ దేశీయంగా చండీగఢ్‌లోని పీఎన్బీ కార్పొరేట్ బ్రాంచ్ నుంచి రూ. 3,192 కోట్లు, విదేశీ శాఖల (దుబాయ్, హాంకాంగ్) నుంచి రూ.614 కోట్లు రుణాలుగా తీసుకుంది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్బీ వివరించింది. వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు పీఎన్బీని దాదాపు రూ. 13,500 కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే. -
భూషణ్ స్టీల్ కోసం టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ పోటీ
న్యూఢిల్లీ: రుణాల ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలను ఎదుర్కొంటున్న భూషణ్ పవర్ అండ్ స్టీల్ కొనుగోలు కోసం టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లిబర్టీ హౌస్ రెండో విడత బిడ్లు దాఖలు చేశాయి. రుణదాతల కమిటీకి ఇవి తమ బిడ్లను సమర్పించాయి. సవరించిన బిడ్లను దాఖలు చేసేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వారం పాటు గడువును పొడిగిస్తూ ఈ నెల 6న వెసులుబాటు కల్పించింది. రుణదాతల కమిటీ తాజాగా వచ్చిన బిడ్లను మదింపు చేస్తోందని, ఈ నెల 17న తమ నిర్ణయాన్ని ఎన్సీఎల్టీకి తెలియజేయనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రుణదాతల కమిటీ లేవనెత్తిన పలు అంశాలను పరిష్కరించినట్టు లిబర్టీ హౌస్ ప్రతినిధి తెలిపారు. అయితే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒక్కటే రూ.19,700 కోట్లకు సవరించిన బిడ్ వేసినట్టు తెలుస్తోంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కోసం టాటా స్టీల్, సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటన్‌కు చెందిన లిబర్టీ హౌస్ తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకులకు భూషణ్ పవర్ రూ.45,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ సింఘాల్ అరెస్ట్
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను ఎస్ఎఫ్ఐఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) అరెస్ట్ చేసింది. రూ.2,000 కోట్లకుపైగా నిధులు స్వాహా చేసిన కేసులో ఆయన నిందితుడు. సంస్థ నిధుల అవకతవకలకు సంబంధించి ఎస్ఎఫ్ఐఓ అరెస్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి సింఘాల్ అని ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. భూషణ్ స్టీల్‌కు అనుబంధంగా ఉన్న వివిధ కంపెనీల్లో వినియోగానికి గాను పొందిన రూ.2,000 కోట్ల విషయంలో సింఘాల్ అవకతవకలకు పాల్పడ్డారని ఆర్థికశాఖ పేర్కొంటోంది. బ్యాంకులు దివాలా ప్రక్రియను ప్రారంభించిన 12 బడా కేసుల్లో భూషణ్ స్టీల్ ఒకటి. ఎన్సీఎల్టీ ముందు చేరిన ఈ కంపెనీని ఇటీవలే టాటా స్టీల్ బిడ్ వేసి దక్కించుకుంది. -
ఎస్ఎఫ్ఐవో ఫస్ట్ యాక్షన్: భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ అరెస్ట్
న్యూఢిల్లీ: బ్యాంకులసీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్, వైస్ ఛైర్మన్ నీరాజ్ సింఘాల్‌ను ఢిల్లీలో గురువారం అరెస్ట్ చేసింది. దాదాపు 2వేల కోట్ల మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఆయన్నుఅరెస్ట్ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. అనంతరం ఆయన్నుకోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఆగస్టు 14వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు చెప్పింది. దేశీయ బ్యాంకింగ్ రంగ మొండి బకాయిల్లో 25 శాతానికి పైగా చెల్లించాల్సి ఉన్న 12 కంపెనీల్లో భూషణ్ స్టీల్ లిమిటెడ్ కూడా ఒకటి . వేలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసిన కంపెనీలపై దివాలా కోడ్ ప్రయోగించాలని గతంలో బ్యాంకులను ఆర్బిఐ ఆదేశించింది. గత ఏడాది దివాలా చట్టం తీసుకొచ్చిన తరువాత ఎస్ఎఫ్ఐఓ అరెస్ట్ చేసిన తొలి వ్యక్తి సింఘాల్. అప్పటి మేనేజ్మెంట్ ద్వారా సేకరించిన వేలాది కోట్ల రూపాయలను సంస్థ ప్రమోటర్లు మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందనీ, అలాగే డైరెక్టర్లు, ప్రమోటర్లు విచారణకు సహకరించడంలేదని ఆరోపించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా నీరజ్ సింఘాల్ అక్రమాలతో భూషణ్ స్టీల్ లిమిటెడ్కంపెనీ దివాలాకు కారకుడయ్యాడని , 80పైగా నకిలీ కంపెనీలతో పేరుతో నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు ‘భూషణ’ం
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా తీసిన భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ లావాదేవీతో పీఎస్‌బీల మొండిబాకీలు (ఎన్పీఏ) సుమారు రూ. 35,000 కోట్ల మేర తగ్గుతాయని ఆయన తెలియజేశారు. ఒక్కో పీఎస్బీ ఎన్పీఏలు సుమారు రూ.500 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల దాకా తగ్గగలవని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆయన తెలిపారు. అలాగే, పీఎస్బీలకు 6 కోట్ల పైగా షేర్లు కూడా దాఖలుపడతాయని, ఇది కూడా ప్రయోజనకరమైన విషయమేనని ఆయన పేర్కొన్నారు. టాటా స్టీల్ తన అనుబంధ సంస్థ ద్వారా భూషణ్ స్టీల్‌లో 72.65 శాతం వాటాలను వేలంలో రూ.36,400 కోట్లు వెచ్చించి దక్కించుకున్న సంగతి తెలిసిందే. విక్రయంపై స్టేకి ఎన్సీఎల్ఏటీ నిరాకరణ.. భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్ కొనుగోలు చేయడంపై స్టే విధించేందుకు నేషనల్ కంపెనీ లా అïప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. దివాలా పరిష్కార ప్రక్రియ యథాప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడి దివాలా పరిష్కార ప్రక్రియ ముగింపు ఉంటుందని తెలిపింది. భూషణ్ స్టీల్‌తో లాభమే: టాటా స్టీల్ ఉక్కు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటే సుదీర్ఘ కాలం పట్టేసే నేపథ్యంలో.. భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేయడం తమకు ప్రయోజనకరమేనని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ చెప్పారు. టేకోవర్ విషయంలో నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామన్నారు. -
టాటా స్టీల్ గూటికి భూషణ్ స్టీల్
న్యూఢిల్లీ: దివాలా తీసిన భూషణ్ స్టీల్‌ను (బీఎస్ఎల్) కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తయినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. వేలంలో తమ అనుబంధ సంస్థ బామ్నిపాల్ స్టీల్ (బీఎన్‌పీఎల్) ద్వారా భూషణ్ స్టీల్‌లో 72.65 శాతం వాటాలు కొన్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భూషణ్ స్టీల్ రుణ దాతలకు రూ. 35,200 కోట్ల చెల్లింపు ప్రక్రియను.. ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తామని టాటా స్టీల్ వివరించింది. నిర్వహణపరమైన రుణదాతలకు వచ్చే ఏడాది వ్యవధిలో రూ.1,200 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ కొనుగోలు కోసం ఈక్విటీ రూపంలో రూ. 159 కోట్లు, అంతర్–కార్పొరేట్ రుణం కింద రూ.34,974 కోట్లు సమకూర్చుకున్నట్లు టాటా స్టీల్ తెలిపింది. పరిష్కార ప్రణాళిక ప్రకారం బీఎస్ఎల్ డైరెక్టర్ల బోర్డులో బీఎన్‌పీఎల్ నామినీలను నియమించినట్లు వివరించింది. -
టాటా స్టీల్ చేతికి భూషణ్ స్టీల్ !
న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియలో ఉన్న భూషణ్ స్టీల్ కంపెనీని బిడ్డింగ్‌లో దక్కించుకున్నామని టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ తెలిపింది. ఎంత ధరకు ఈ కంపెనీని చేజిక్కించుకున్న వివరాలను టాటా స్టీల్ వెల్లడించలేదు. అయితే రూ.35,000 కోట్లకు (అంతా నగదులోనే )భూషణ్ స్టీల్ టాటా స్టీల్ పరం కానున్నదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. భూషణ్ స్టీల్ విజయవంతమైన రిజల్యూషన్ అప్లికెంట్‌గా రుణదాతల కమిటీ తమను నిర్ణయించిందని టాటా స్టీల్ పేర్కొంది. భూషణ్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వంటి సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని వివరించింది. రూ.48,100 కోట్ల రుణాల చెల్లింపుల్లో విఫలమైనందుకు రుణ దాతల కమిటీ భూషణ్ స్టీల్‌పై ఎన్సీఎల్టీలో దివాలా ప్రక్రియను ప్రారంభించింది. భూషణ్ స్టీల్ కొనుగోలుకు ఆసక్తి గల కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. టాటా స్టీల్‌తో పాటు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థతో కలసి భూషణ్ స్టీల్ ఉద్యోగులు బిడ్లు దాఖలు చేశారు. చివరకు విజయవంతమైన బిడ్డర్‌గా టాటా స్టీల్ నిలిచింది. భూషణ్ స్టీల్ చేరికతో టాటా స్టీల్ భారత్‌లోనే అతి పెద్ద ఉక్కు కంపెనీగా అవతరించనున్నది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను తోసిరాజని టాటా స్టీల్ ఈ స్థానానికి ఎగబాకుతుంది. -
టాటా స్టీల్ చేతికి భూషణ్ స్టీల్
సాక్షి, ముంబై: మొత్తానికి భూషణ్ స్టీల్ విక్రయానికి మార్గం సుగమమైంది. సుమారు రూ.50వేల కోట్ల రుణభారంతో సతమతమవుతూ.. దివాలా చట్ట పరిధిలోకి చేరిన భూషణ్ స్టీల్ కొనుగోలుకి వేసిన బిడ్ గెలుపొందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో టాటా స్టీల్ తాజాగా తెలియజేసింది. ఈ మేరకు మార్చి 22న భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) కు చెందిన క్రెడిట్ కమిటీల (కోసీ) నిర్ణయం తీసుకుందని టాటాస్టీల్ పేర్కొంది. అయితే ఈ డీల్ రెగ్యులేషన్ కమిటీ ఆమోదానికి లోబడి ఉంటుందని తెలిపింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తదితర నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించాల్సి ఉందని టాటాస్టీల్ పేర్కొంది. రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో భూషణ్ స్టీల్‌పై బ్యాంకులు దివాలా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో వార్షికంగా 5.6 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న భూషణ్ స్టీల్ కొనుగోలుకి పలు సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే అనూహ్యంగా టాటా గ్రూప్ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ రూ. 35వేల కోట్ల బిడ్‌తో ఒక్కసారిగా ముందుకొచ్చింది. తద్వారా ఈ బిడ్‌లో ముందంజలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (బిడ్ వాల్యూరూ. 29,700 కోట్లు) వెనక్కి నెట్టేసింది. కాగా.. ప్రస్తుతం టాటా స్టీల్, భూషణ్ స్టీల్ షేర్లు నష్టాల్లోకదులుతున్నాయి. -
భూషణ్ స్టీల్ మాకు రూ.900 కోట్లివ్వాలి
న్యూఢిల్లీ: నిర్మాణరంగ దిగ్గజ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) భూషణ్ స్టీల్ నుంచి బకాయిల వసూలు కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించింది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న భూషణ్ స్టీల్ నుంచి తనకు రావాల్సిన బకాయిలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. క్యాపిటల్ గూడ్స్‌ను సరఫరా చేసినందుకు సంస్థ నుంచి తమకు రూ.900 కోట్లు రావాల్సి ఉందని ఎల్ అండ్ టీ న్యాయవాది ట్రిబ్యునల్‌ను కోరారు. తమను సెక్యూర్డ్ క్రెడిటర్‌గా గుర్తించాలని కోరారు. దీనిపై అభిప్రాయం తెలియజేయాలని దివాలా పరిష్కార నిపుణులను ట్రిబ్యునల్ ఆదేశించింది. భూషణ్ స్టీల్‌లో నియంత్రిత వాటా కొనుగోలుకు తాము అధిక బిడ్డర్‌గా నిలిచినట్టు టాటా స్టీల్ ప్రకటించిన నేపథ్యంలో ఎల్అండ్టీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం గమనార్హం. చైర్మన్‌ని ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐవో: రూ.1,000 కోట్ల నిధుల స్వాహా ఆరోపణలకు సంబంధించి భూషణ్ స్టీల్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ సింఘాల్‌ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) గురువారం ప్రశ్నించింది. ఎస్ఎఫ్ఐవో గతేడాది నుంచి కంపెనీలో నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ జరుపుతోంది. భూషణ్ స్టీల్ దాదాపు రూ. 44,000 కోట్ల మేర బ్యాంకులకు బాకీ పడింది. మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన 12 కంపెనీలపై దివాలా చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ సూచించిన సంస్థల్లో ఇది కూడా ఉంది. -
భూషణ్ స్టీల్ రేసు నుంచి లిబర్టీ హౌస్ అవుట్
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ టేకోవర్ కోసం లిబర్టీ హౌస్ దాఖలు చేసిన బిడ్‌ను రుణదాతల కమిటీ (సీఓసీ) తిరస్కరించింది. బిడ్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 8 అని, కానీ ఇంగ్లండ్‌కు చెందిన లిబర్టీ హౌస్ ఈ నెల 20న బిడ్‌ను దాఖలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుకే రుణదాతల కమిటీ లిబర్టీ బిడ్‌ను తిరస్కరించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక భూషణ్ స్టీల్ రేసులో టాటా స్టీల్, జీఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలే మిగిలాయి. బుధవారం జరిగిన సమావేశంలో ఈ రెండు కంపెనీల బిడ్ల వివరాలను సీఓసీకి నివేదించడం జరిగిందని, న్యాయ సలహాదారులు ఈ బిడ్లను మదింపు చేస్తున్నారని సమాచారం. వచ్చే నెల 6న జరిగే సీఓసీ సమావేశంలో భూషణ్ స్టీల్ ఎవరి పరమయ్యేది వెల్లడవుతుంది. అయితే సంబంధిత పరిణామాలపై వ్యాఖ్యానించడానికి రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) మహేందర్ కుమార్ నిరాకరించారు. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ రుణ దాతలకు రూ.45,000 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. రుణ దాతలకు రూ.17,000 కోట్లు, భూషణ్ స్టీల్ కార్యకలాపాల కోసం రూ.7,200 కోట్లు ఇవ్వడానికి టాటా స్టీల్ ఆఫర్ చేసిందని సమాచారం. -
భూషణ్ స్టీల్ రేసులో టాటా స్టీల్ !
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన భూషణ్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు బిడ్లు సమర్పించాయి. వీటితో పాటు భూషణ్ స్టీల్‌కంపెనీ సొంత ఉద్యోగుల కన్సార్షియమ్ కూడా బిడ్‌ను సమర్పించిందని భూషణ్ స్టీల్ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. జేఎస్‌డబ్ల్యూ, పిరమళ్ ఎంటర్‌ప్రైజెస్‌లు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడి జేఎస్‌డబ్ల్యూ లివింగ్ ప్రైవేట్‌గా బిడ్‌ను దాఖలు చేశాయని పేర్కొంది. ఈ కంపెనీల రిజల్యూషన్ ప్లాన్ల వివరాలకు సంబంధించిన ఒక సవివరమైన నివేదికను ఆర్పీ(రిజల్యూషన్ ప్రొఫెషనల్) రుణదాతల కమిటీ (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్)కు ఇటీవలే∙సమర్పించారని భూషణ్ స్టీల్ తెలిపింది. ఎన్సీఎల్టీకి ఆర్బీఐ నివేదించిన 12 మొండి బకాయిల ఖాతాల్లో భూషణ్ స్టీల్ ఒకటి. ఈ కంపెనీ బ్యాంక్‌లకు రూ.44,478 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో భూషణ్ స్టీల్ షేర్ 20% అప్పర్ సర్క్యూట్ తాకి, రూ.53.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.202 కోట్లు పెరిగి రూ.1,219 కోట్లకు ఎగసింది. కాగా భూషణ్ స్టీల్ కొనుగోలు కోసం అన్ని కంపెనీల కన్నా అధికంగా టాటా స్టీల్ రూ.36,000 కోట్లు కోట్ చేసిందని, రెండో స్థానంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బిడ్ కన్నా టాటా స్టీల్ బిడ్ రూ.10,000 కోట్లు అధికమని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో టాటా స్టీల్ షేర్ 5.8 శాతం నష్టపోయి, రూ.648 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 9 శాతం పతనమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,834 కోట్లు ఆవిరైంది. -
మరో 3 సంస్థలపై దివాలా చర్యలు
♦ ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ♦ ఎలక్ట్రో స్టీల్‌పై బ్యాంకర్ల నిర్ణయం ముంబై: రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా మూడు ఉక్కు ఉత్పత్తి సంస్థలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటి ఖాతాలను దివాలా చట్టం కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి నివేదించాలని ఎస్బీఐ సారథ్యంలో గురువారం సమావేశమైన బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. భూషణ్ స్టీల్ రూ. 44,478 కోట్లు, ఎస్సార్ స్టీల్ రూ. 37,284 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ రూ. 10,274 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డాయి. ప్రధానంగా ఎన్సీఎల్టీలో దాఖలు చేసే కేసు పిటిషన్‌ను ఖరారు చేసేందుకే బ్యాంకులు సమావేశమైనట్లు సీనియర్ బ్యాంకర్ తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా దీనికి హాజరైనట్లు వివరించారు. భారీగా మొండి బాకీలు పేరుకుపోయాయని ఆర్బీఐ గుర్తించిన 12 ఖాతాల్లో ఈ మూడు కూడా ఉన్నాయి. సుమారు రూ. 37,248 కోట్లు బకాయిపడిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఐడీబీఐ బ్యాంకు సారథ్యంలోని కన్సార్షియం నేడు (శుక్రవారం) భేటీ కానుంది. వీటితో పాటు రుణగ్రస్త సంస్థల్లో ల్యాంకో ఇన్ఫ్రా, ఆమ్టెక్ ఆటో, అలోక్ ఇండస్ట్రీస్, మోనెట్ ఇస్పాత్ మొదలైనవి ఉన్నాయి. 6 నెలల్లో 55 ఖాతాల ఎన్పీఏలు పరిష్కరించుకోవాలి: ఆర్బీఐ న్యూఢిల్లీ: భారీగా రుణభారం పేరుకుపోయిన 55 ఖాతాలకు సంబంధించిన మొండిపద్దులను(ఎన్పీఏ) ఆరు నెలల్లోగా పరిష్కరించుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. లేని పక్షంలో ఆయా కేసుల్లో దివాలా చట్టం (ఐబీసీ) అమలుకు ఆదేశించాల్సి వస్తుందని పేర్కొంది. మొండి బాకీల్లో పావు శాతం వాటా ఉన్న 12 ఖాతాలకు సంబంధించి ఇటీవలే దివాలా ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఈ మూడింటి భవితవ్యం తేలేది నేడే!
ముంబై : భారీగా రుణాలు ఎగవేసి, తమకు గుదిబండలా మారిన సంస్థలపై బ్యాంకులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆర్బీఐ ఆదేశాలతో పలుమార్లు సమావేశమైన బ్యాంకర్లు వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు భారీగా ఎగనామం పెట్టిన మూడు సంస్థలు ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ భవితవ్యాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు నిర్ణయించనుంది. మొండిబకాయిల విషయంలో విజయ్ మాల్యా కంటే ఘనులు మరో 12 మంది ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు ఇటీవలే గుర్తించిన సంగతి తెలిసిందే. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. కానీ వారి పేర్లను ఆర్బీఐ వెల్లడించలేదు. ఈ మేరకు పలుమార్లు సమావేశమైన బ్యాంకులు, చర్యలకు రంగంలోకి దిగాయి. 12 సంస్థల మొండిబకాయిల్లో సగానికి పైగా రుణాలు ఈ మూడు సంస్థల వద్దనే ఉన్నట్టు కూడా బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో 12 సంస్థల వద్దనే 25 శాతం అంటే రెండు లక్షల కోట్లు మొండిబకాయిలుంటే, ఇక ఏకంగా ఈ మూడు సంస్థలే లక్ష రూపాయలకు పైగా రుణాలు మొండిబకాయిలుగా కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సంస్థల భరతం పట్టాలని బ్యాంకులు నిర్ణయించినట్టు తెలిసింది. నేడు బ్యాంకర్లు, రుణగ్రస్తులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో బ్యాంకులకు వచ్చిన నష్టాలు, తీసుకోబోయే చర్యలను చర్చించనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మూడు స్టీల్ కంపెనీలను సీల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఈ దిగ్గజ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియానే ఇచ్చింది. జాయింట్ లెండర్స్ ఫోరమ్ కు ఇది పిలుపునిచ్చింది. కార్పొరేట్ దివాలాను ఫైల్ చేయడం కోసం లెండర్లు కచ్చితంగా కన్సోర్టియంను కోరవచ్చని ఓ ఎస్ బీఐ సీనియర్ అధికారి చెప్పారు. బ్యాంకులు ఎస్సార్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.45వేల కోట్లు, భూషణ్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.47వేల కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కు ఇచ్చిన రుణాలు రూ.11వేలు కోట్లుగా ఉన్నాయి. బుధవారమే దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కార్పొరేట్ దివాలా కింద ఓ అప్లికేషన్ కూడా దాఖలు చేశారు.