ఈ మూడింటి భవితవ్యం తేలేది నేడే!
ఈ మూడింటి భవితవ్యం తేలేది నేడే!
Published Thu, Jun 22 2017 8:45 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
ముంబై : భారీగా రుణాలు ఎగవేసి, తమకు గుదిబండలా మారిన సంస్థలపై బ్యాంకులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆర్బీఐ ఆదేశాలతో పలుమార్లు సమావేశమైన బ్యాంకర్లు వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు భారీగా ఎగనామం పెట్టిన మూడు సంస్థలు ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ భవితవ్యాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు నిర్ణయించనుంది. మొండిబకాయిల విషయంలో విజయ్ మాల్యా కంటే ఘనులు మరో 12 మంది ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు ఇటీవలే గుర్తించిన సంగతి తెలిసిందే. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. కానీ వారి పేర్లను ఆర్బీఐ వెల్లడించలేదు. ఈ మేరకు పలుమార్లు సమావేశమైన బ్యాంకులు, చర్యలకు రంగంలోకి దిగాయి.
12 సంస్థల మొండిబకాయిల్లో సగానికి పైగా రుణాలు ఈ మూడు సంస్థల వద్దనే ఉన్నట్టు కూడా బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో 12 సంస్థల వద్దనే 25 శాతం అంటే రెండు లక్షల కోట్లు మొండిబకాయిలుంటే, ఇక ఏకంగా ఈ మూడు సంస్థలే లక్ష రూపాయలకు పైగా రుణాలు మొండిబకాయిలుగా కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సంస్థల భరతం పట్టాలని బ్యాంకులు నిర్ణయించినట్టు తెలిసింది. నేడు బ్యాంకర్లు, రుణగ్రస్తులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో బ్యాంకులకు వచ్చిన నష్టాలు, తీసుకోబోయే చర్యలను చర్చించనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ఈ మూడు స్టీల్ కంపెనీలను సీల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఈ దిగ్గజ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియానే ఇచ్చింది. జాయింట్ లెండర్స్ ఫోరమ్ కు ఇది పిలుపునిచ్చింది. కార్పొరేట్ దివాలాను ఫైల్ చేయడం కోసం లెండర్లు కచ్చితంగా కన్సోర్టియంను కోరవచ్చని ఓ ఎస్ బీఐ సీనియర్ అధికారి చెప్పారు. బ్యాంకులు ఎస్సార్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.45వేల కోట్లు, భూషణ్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.47వేల కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కు ఇచ్చిన రుణాలు రూ.11వేలు కోట్లుగా ఉన్నాయి. బుధవారమే దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కార్పొరేట్ దివాలా కింద ఓ అప్లికేషన్ కూడా దాఖలు చేశారు.
Advertisement
Advertisement