Essar Steel
-
ఎస్సార్ ఆస్తుల జప్తు కుదరదు
లండన్: ఒక ఆర్బ్రిట్రేషన్ కేసులో ఎస్సార్ స్టీల్ పేరెంట్ కంపెనీ, ఆ కంపెనీ ప్రమోటర్ కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల జప్తునకు ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న యత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మార్చి 30న లండన్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు అనుమతించాలన్న ఆర్సెలర్‌మిట్టల్ పిటిషన్‌ను లండన్ అప్పీలేట్ కోర్ట్ కొట్టివేసింది. 2019లో మారిషస్‌లో దివాలా చట్రంలోకి వెళ్లిన ఎస్సార్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించి 1.5 బిలియన్ డాలర్ల ఆర్బ్రిట్రేషన్ కేసులో ‘తమ ప్రయోజనాలకు కలిగిన నష్టాలను భర్తీ చేయాలని, ఈ విషయంలో ఎస్సార్, రవి రుయా, ప్రశాంత్ రుయాల ఆస్తులను జప్తు చేయాలని ’ కోరుతూ ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న న్యాయపోరాటాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎస్సార్ చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఆర్సెలర్‌మిట్టల్ యూఎస్ఏ (ఏఎంయూఎస్ఏ) అప్పీల్ గెలుపొందడానికి తగిన అంశాలను కలిగిలేదని ఆ సంస్థ (ఆర్సెలర్ మిట్టల్) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ న్యూయీ నేతృత్వంలోని లండన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏప్రిల్ 21న పేర్కొంది. -
భారత ఉక్కు రంగంలోకి ‘ఆర్సెలర్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఎట్టకేలకు భారత ఉక్కు రంగంలోకి అరంగేట్రం చేసింది. రచ్చ గెలిచిన లక్ష్మీనివాస్ మిట్టల్ ఇంట గెలవడానికి చాలా సమయం పట్టింది. చాలా ఏళ్ల సమయం, ప్రయాసల అనంతరం ఆయన ఉక్కు కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ మన దేశంలోకి అడుగిడింది. భారత్‌లో ఉక్కు కంపెనీని ఏర్పాటు చేయాలన్న ఎల్ఎన్ మిట్టల్ కల ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ టేకోవర్ ద్వారా సాకారమయింది. ఈ టేకోవర్ ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యిందని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అతి పెద్ద దివాలా రికవరీ... ఎస్సార్ స్టీల్ కంపెనీని రూ.42,000 కోట్లకు ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి సుప్రీం కోర్టు గత నెలలోనే ఆమోదం తెలిపింది. దివాలా చట్టం కింద (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–ఐబీసీ) పరిష్కారమైన అతి పెద్ద రికవరీ ఇదే. నిప్పన్ స్టీల్ కంపెనీతో కలిసి ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ (ఆర్సెలర్ మిట్టల్ /నిప్పన్ స్టీల్ (ఏఎమ్/ఎన్ఎస్ ఇండియా)) ఇకపై ఎస్సార్ స్టీల్‌ను నిర్వహిస్తుంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ చైర్మన్‌గా అదిత్య మిట్టల్ (ప్రస్తుత ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ ) వ్యవహరిస్తారు. ఈ జేవీలో ఆర్సెలర్ మిట్టల్‌కు 60 శాతం, నిప్పన్ స్టీల్ కంపెనీకి 40 శాతం చొప్పున వాటాలున్నాయి. లగ్జెంబర్గ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్... భారత్‌లో అడుగిడాలని చాలా ఏళ్ల కిందటే ప్రయత్నాలు ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిశాల్లో 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భూ సేకరణ, పర్యావరణ, ఇతర అనేక అవరోధాల కారణంగా ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. -
ఎస్సార్ స్టీల్.. ఆర్సెలర్‌దే!!
న్యూఢిల్లీ: దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆర్సెలర్‌మిట్టల్ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. బిడ్ మొత్తాన్ని ఫైనాన్షియల్ రుణదాతలు (బ్యాంకులు మొదలైనవి), ఆపరేషనల్ రుణదాతలు (సరఫరాదారులు మొదలైన వర్గాలు) సమానంగా పంచుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. బాకీలు రాబట్టుకోవడంలో మొదటి ప్రాధాన్యత ఫైనాన్షియల్ రుణదాతలకే ఉంటుందని, రుణదాతల కమిటీ (సీవోసీ) తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి లేదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణదాతలకు సమాన హోదా ఉండబోదని స్పష్టం చేసింది. 2018 అక్టోబర్ 23న ఆర్సెలర్‌మిట్టల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలంటూ న్యాయస్థానం.. పరిష్కార ప్రణాళికను సీవోసీకి తిప్పిపంపగలదే తప్ప, రుణదాతల కమిటీ తీసుకున్న వ్యాపారపరమైన నిర్ణయాన్ని మార్చజాలదని సుప్రీం కోర్టు తెలిపింది. పరిష్కార ప్రణాళికను రూపొందించేందుకు దివాలా కోడ్‌లో నిర్దేశించిన 330 రోజుల గడువును కూడా సడలించింది. సీవోసీ పరిష్కార ప్రణాళిక అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని సూచించింది. ఎస్సార్స్టీల్ వేలం ద్వారా వచ్చే నిధులను రుణదాతలంతా సమాన నిష్పత్తిలో పంచుకోవాలన్న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను సవాల్ చేస్తూ బ్యాంకులు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేస్తాం: ఆర్సెలర్‌మిట్టల్ సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన ఆర్సెలర్‌మిట్టల్.. సాధ్యమైనంత త్వరగా ఎస్సార్ స్టీల్ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, బిడ్ చేసిన ఆర్సెలర్ మిట్టల్, దాని భాగస్వామ్య సంస్థ నిప్పన్ స్టీల్‌కు ఎస్సార్ స్టీల్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థను దక్కించుకుంటున్నాయని పేర్కొంది. బ్యాంకులకు ఊరట.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్, ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ తదితర సంస్థలకు సుప్రీం కోర్టు తీర్పు ఊరటనివ్వనుంది. స్టాన్‌చార్ట్ డీబీఎస్ బ్యాంక్ వంటి ఆపరేషనల్ రుణదాతలకు ప్రాధాన్యం తగ్గనుంది. ఎస్బీఐకు ఎస్సార్ స్టీల్ అత్యధికంగా రూ. 15,430 కోట్లు బాకీ పడింది. రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్ణయం ప్రకారం ఎస్సార్ స్టీల్ వేలం ద్వారా వచ్చే నిధుల పంపకాలకు సంబంధించి బ్యాంకుల్లాంటి సెక్యూర్డ్ రుణదాతలు తమకు రావాల్సిన బకాయిల్లో 90% దాకా, రూ. 100 కోట్ల పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్ రుణదాతలు తమకు రావాల్సిన దాంట్లో 20.5% దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని తోసిపుచ్చిన ఎన్సీఎల్ఏటీ.. బ్యాంకులకు 60.7% మేర, రూ. 100 కోట్లు పైగా రుణాలిచ్చిన ఆపరేషనల్ రుణదాతలు 59.6% దాకా క్లెయిమ్ చేసుకునే వీలు కల్పించింది. దీన్నే సవాలు చేస్తూ బ్యాంకులు.. సుప్రీంను ఆశ్రయించాయి. రెండేళ్ల తర్వాత ఒక కొలిక్కి.. ఎస్సార్ స్టీల్ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. భారీ డిఫాల్టర్లకు సంబంధించి రెండేళ్ల క్రితం ఆర్బీఐ ప్రకటించిన తొలి జాబితాలోని 12 సంస్థల్లో ఇది కూడా ఉంది. దీంతో బాకీలను రాబట్టుకునేందుకు ఆర్థిక సంస్థలు.. దివాలా స్మృతి (ఐబీసీ) కింద అప్పట్నుంచి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ తర్వాత ఇది అనేక మలుపులు తిరిగింది. దివాలా తీసి, వేలానికి వచ్చిన తమ సంస్థ చేజారిపోకుండా తిరిగి దక్కించుకునేందుకు ప్రమోటర్లయిన రుయా కుటుంబం వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నించింది. ఆర్సెలర్‌మిట్టల్ ఆఫర్ చేసిన రూ. 42,000 కోట్ల కన్నా ఎక్కువగా రూ. 54,389 కోట్లు కడతాము, వేలాన్ని నిలిపివేయాలంటూ కోరింది. కానీ ఎన్సీఎల్టీ దీన్ని తోసిపుచ్చింది. దివాలా స్మృతికే సవాలుగా నిల్చిన ఈ కేసు ఫలితం .. ఇలాంటి మిగతా కేసులపైనా ప్రభావం చూపనుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఆర్సెలర్‌మిట్టల్‌కు మళ్లీ బ్రేక్!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో వేలానికొచ్చిన ఎస్సార్ స్టీల్ చేజారిపోకుండా ఆ సంస్థ ప్రమోటర్లు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. బిడ్డింగ్‌లో దీన్ని దక్కించుకున్న ఆర్సెలర్‌మిట్టల్ సంస్థను తిరస్కరించాల్సిందిగా ఎస్సార్ స్టీల్‌లో మెజారిటీ వాటాలు ఉన్న ఎస్సార్ స్టీల్ ఆసియా హోల్డింగ్స్ (ఈఎస్‌ఏహెచ్‌ఎల్) .. తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్ఏటీ) ఆశ్రయించింది. ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఆర్సెలర్ మిట్టల్ ప్రమోటరు లక్ష్మి నివాస్ మిట్టల్ .. దివాలా తీసిన తన సోదరుల కంపెనీలతో సంబంధాలను దాచిపెట్టారని ఈఎస్‌ఏహెచ్‌ఎల్ ఆరోపించింది. ఈ సంస్థలకు లక్ష్మి నివాస్ మిట్టల్ ప్రమోటరుగా ఉన్నందున ఎస్సార్ స్టీల్‌కు ఆర్సెలర్‌మిట్టల్ బిడ్‌ను తిరస్కరించాలని కోరింది. ఈ పిటీషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా ఆర్సెలర్మిట్టల్ను ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసింది. -
ఎస్సార్ స్టీల్ టేకోవర్‌కు షరతులతో కూడిన ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ టేకోవర్‌కు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి ఎన్సీఎల్టీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దీంతో స్వదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఎస్సార్ స్టీల్ టేకోవర్ కోసం ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ అండ్ సుమిటొమో మెటల్ కార్ప్‌లు రూ.42,000 కోట్ల ఆఫర్‌ను ఇచ్చాయి. ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల అప్పీల్ నేపథ్యంలో తుది ఉత్తర్వులకు లోబడి ఆర్సెలర్, నిప్పన్ల రిజల్యూషన్ ప్లాన్‌కు ఆమోదం ఆధారపడి ఉంటుందని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27న జరగనున్నది. -
ఆర్సెలర్ మిట్టల్ ప్రణాళికపై తేల్చండి
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ విషయంలో ఆర్సెలర్ మిట్టల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికపై ఈ నెల 11 లోపు తుది నిర్ణయం వెలువరించాలని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) సోమవారం ఆదేశించింది. 11వతేదీ నాటికి ఎటువంటి ఆదేశాలు వెలువరించకపోతే, రికార్డులు తెప్పించుకుని తామే ఐబీసీ చట్టంలోని సెక్షన్ 31కింద ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ స్పష్టంచేసింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. రుణ దాతలందరి వాదనలనూ పూర్తిగా వినే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఆపరేషనల్ క్రెడిటర్ల (సరఫరాదారులు, కాంట్రాక్టర్లు, కస్టమర్లు) వాదనలను మాత్రమే విని వీలైనంత తొందరగా ఆదేశాలివ్వాలని, మరో వంక ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారు పరిమిత వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని, మొత్తం మీద ఈ ప్రక్రియ ఐదు రోజుల్లో ముగించాలని ఆదేశించింది. ఎస్టార్ స్టీల్ కంపెనీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుమారు రూ.51 వేల కోట్ల మేర బకాయిలుండగా, ఐబీసీ చట్టంలోని దివాలా ప్రక్రియ కింద కంపెనీని సొంతం చేసుకునేందుకు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ రూ.42,000 కోట్లతో బిడ్ వేసింది. ఆర్సెలర్ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం కూడా తెలిపింది. అయితే, తాము రూ.54,389 కోట్ల మేర చెల్లిస్తామని ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు అడ్డుపుల్ల వేయడంతో ఈ ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఎన్సీఎల్టీలో ప్రశాంత్ రుయా పిటిషన్ ఇప్పటికే ఆలస్యమైన ఎస్సార్ స్టీల్ దివాలా పరిష్కార ప్రక్రియను మరింత జాప్యం చేసే దిశగా ఎస్సార్ గ్రూపు డైరెక్టర్ ప్రశాంత్ రుయా ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌ను పక్కన పెట్టాలంటూ అప్లికేషన్ వేశారు. ఎస్సార్ స్టీల్ మాజీ డైరెక్టర్ దిలీప్ ఊమెన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్ భట్నాగర్, ప్రశాంత్ రుయా కలసి ఈ పిటిషన్ వేశారు. రుచి సోయా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ... ఎస్సార్ స్టీల్ విషయంలో ఎస్సార్ గ్రూపు ప్రమోటర్లు వేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ గత నెల 29న కొట్టివేసింది. ఈ నేపథ్యంలో వీరు మళ్లీ ఎన్సీఎల్టీ తలుపుతట్టడం గమనార్హం. ఆర్‌కామ్ ‘దివాలా పిటిషన్’పై ఎరిక్సన్ అభ్యంతరం రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పిటిషన్‌పై ఎరిక్సన్ తన అభ్యంతరాన్ని ఫిబ్రవరి 8 నాటికి తెలియజేసేందుకు ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. ఎన్సీఎల్ఏటీ లేదా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆర్‌కామ్ ఆస్తులను విక్రయిచేందుకు, మూడో పక్షానికి లేదా మరొకరికి హక్కులు కట్టబెట్టడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. టీడీశాట్‌లో ఆర్‌కామ్‌కు స్వల్ప ఊరట టెలికం వివాదాల పరిష్కార మండలి (టీడీశాట్)లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు ఊరట లభించింది. ఆర్‌కామ్‌కు కేటాయించిన అదనపు స్ప్రెక్ట్రమ్కుగాను రూ.2,000 కోట్లను వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆర్‌కామ్‌కు రూ.2,000 కోట్లను తిరిగిచ్చేయాలని టెలికం శాఖను ఆదేశించింది. -
ఎస్సార్ స్టీల్‌పై ఎస్సార్ గ్రూపు న్యాయపోరాటం?
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ కోసం తీసుకున్న రుణాలన్నింటినీ తాను తీర్చివేసేందుకు సిద్ధమంటూ ఎస్సార్ గ్రూపు రూ.54,389 కోట్లతో ముందుకు రాగా, దీనికి బదులు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ రూ.42,000 కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ చేసిన ఆఫర్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తమ ఆఫర్‌ను అనుమతిస్తే బ్యాంకులు రుణాలపై నష్టపోవాల్సిన అవసరం లేదంటూ రుణదాతల కమిటీ నిర్ణయాన్ని ఎస్సార్ గ్రూపు న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్సార్ గ్రూపు ప్రమోటర్లు అయిన రుయాలు గతంలో ఏజిస్ అమెరికా కార్యకలాపాలను రూ.4,200 కోట్లకు, ఏజిస్ను రూ.2,000 కోట్లకు, ఎస్సార్ ఆయిల్‌ను రూ.72,000 కోట్లకు, ఈక్వినాక్స్‌ను రూ.2,400 కోట్లకు విక్రయించడం ద్వారా గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకున్న విషయం గమనార్హం. ఇప్పుడు ఎస్సార్ స్టీల్ కోసం తీసుకున్న రుణాలు రూ.54,389 కోట్లను తీర్చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తే మొ త్తం రుణ భారం రూ.1.25 లక్షల కోట్ల మేర తగ్గించుకున్నట్టు అవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్‌ను ఎట్టకేలకు ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ దక్కించుకుంది. దీంతో భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి ఆర్సెలర్ మిట్టల్‌కు అవకాశం లభించినట్లయింది. ఈ డీల్‌కు సంబంధించి తాము దాఖలు చేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు ఎస్సార్ స్టీల్ రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదముద్ర వేసినట్లు ఆర్సెలర్ మిట్టల్ శుక్రవారం వెల్లడించింది. బ్యాంకర్లకు సమర్పించిన పరిష్కార ప్రణాళిక ప్రకారం.. కంపెనీ రుణభారం సెటిల్మెంట్ కోసం రూ. 42,000 కోట్లు ముందుగా చెల్లించనున్నట్లు, ఆ తర్వాత కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తిని పెంచుకోవడం మొదలైన వాటి కోసం మరో రూ.8,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. మరోవైపు, ఆర్సెలర్ మిట్టల్‌తో కలిసి ఎస్సార్ స్టీల్‌ను సంయుక్తంగా నిర్వహించనున్నట్లు జపాన్‌కి చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమితొమో మెటల్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఎంసీ) వెల్లడించింది. ఈ డీల్‌కు అవసరమైన నిధులను ఈక్విటీ, రుణం రూపంలో సమకూర్చుకోనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలను రాబట్టుకునేందుకు దివాలా చట్టం కింద ఎస్సార్ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేసిన సంగతి తెలిసిందే. న్యూమెటల్, వేదాంత మొదలైన దిగ్గజాలు కూడా పోటీపడిన ఈ వేలం ప్రక్రియ అనేక మలుపులు తిరిగింది. చివరికి అత్యధికంగా కోట్ చేసిన బిడ్డరుగా అక్టోబర్ 19న ఆర్సెలర్ మిట్టల్ పేరును సీవోసీ ప్రకటించింది. అయితే, కంపెనీని చేజారిపోకుండా కాపాడుకునేందుకు ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లయిన రుయా కుటుంబం దాదాపు రూ.54,389 కోట్లతో బాకీలను పూర్తిగా కట్టేస్తామంటూ ఆఖరు నిమిషంలో అక్టోబర్ 25న పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించింది. కానీ, అదే రోజున ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌కు రుణదాతలు తుది ఆమోద ముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల ప్రతిపాదనను బ్యాంకులు కనీసం పరిశీలించాయా లేదా అన్నది కూడా తెలియరాలేదని వివరించాయి. -
ఆర్సెలర్ మిట్టల్ చేతికి ఎస్సార్ స్టీల్!
సాక్షి, ముంబై: రుణ భారంతో కుదేలైన ఎస్సార్ స్టీల్ ను ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్ ఈ స్టీల్స్ ను రూ.42,000కోట్లకు దక్కించుకున్నారు. ఆర్సెలర్ మిట్టల్, భాగస్వామి జపాన్ నిస్సాన్ స్టీల్ అండ్ సుమిటోమోకు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (బ్యాంకుల రుణదాతల కమిటీ ) లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. రూ.49వేల కోట్ల బకాయిలను తాము చెల్లించాల్సి ఉందని మిట్టల్ తెలిపారు. ముందుగా అప్పులను తీర్చుందుకు 42వేల కోట్లను, మరో ఎనిమిదివేల కోట్ల రూపాయల నిర్వాహక పెట్టుబడులను సంస్థకు సమకూర్చనుంది. ఎస్సార్ స్టీల్‌ను దివాలానుంచి బయటపడేందుకు గాను రుణదాతలకు రూ. 54,389 కోట్లు, 47,507 కోట్ల రూపాయల నగదు చెల్లింపులకు ఆర్సెలర్ అంగీకరించిన తర్వాత రోజు ఈ అభివృద్ధి జరిగింది. -
మొత్తం రుణం మేమే కట్టేస్తాం!!
న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్‌తో వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కంపెనీ తమ చేతుల్లోంచి జారిపోకుండా రుయా కుటుంబం (ప్రమోటర్లు) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేసే దిశగా మొత్తం రూ.54,389 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. ఇందులో రూ.47,507 కోట్లు ముందస్తుగా నగదు రూపంలో చెల్లించేందుకు కూడా సిద్ధమని పేర్కొంది. ఎస్సార్ స్టీల్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్ ఆఫర్ చేసిన రూ.42,202 కోట్ల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. దాదాపు రూ.49,000 కోట్ల రుణాలను వసూలు చేసుకునేందుకు బ్యాంకర్లు ఎస్సార్ స్టీల్‌ను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎస్సార్ స్టీల్ ఇండియా రుణదాతలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పూర్తి సెటిల్మెంట్ కోసం దాదాపు రూ. 54,389 కోట్లు చెల్లించేట్లుగా రుణదాతల కమిటీ (సీఓసీ)కి ఎస్సార్ స్టీల్ వాటాదారులు ప్రతిపాదన సమర్పించారు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక రుణదాతలకు మొత్తం రూ.49,395 కోట్లు, నిర్వహణపరమైన రుణదాతలకు రూ.4,976 కోట్లు, ఉద్యోగులకు మరో రూ.18 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకునేలా రుయాలు ఆఫర్ చేసినట్లు వివరించాయి. ఆర్సెలర్ మిట్టల్‌తో పాటు రష్యాకి చెందిన వీటీబీ క్యాపిటల్ మద్దతున్న న్యూమెటల్ సంస్థ కూడా ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు పోటీ పడుతోంది. -
ఎస్సార్ స్టీల్: అప్పులు చెల్లించాకే బిడ్
సాక్షి,న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రుణ సంక్షోభంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్‌ను దక్కించుకునే రేసులో ఉన్న బిడ్డర్లు ఆర్సెలర్ మిట్టల్, నూమెటల్కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇరు కంపెనీల బిడ్స్ చెల్లుతాయన్న కోర్టు నుమెటల్‌కు భారీ ఊరట నిచ్చింది. దీనిపై సీవోసీ (కమిటీ ఆఫ క్రెడిటర్స్) అంగీకరించిన తరువాత మాత్రమే ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ జోక్యం చేసుకుంటాయని తెలిపింది. మెజారిటీ (66శాతం) సీవోసీ సభ్యులు ఈ ప్రక్రియకు అంగీకరించాలనీ, లేదంటే లిక్విడేషన్‌కు వెళుతుందని సుప్రీం స్పష్టం చేసింది. అయితే ఈ వేలానికి ముందు రెండు వారాలలో బకాయిలను క్లియర్ చేయాలని ఇరు సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. రోహిన్టన్ నారిమన్, ఇందుహల్హోత్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాల్చింది. అలాగే ఈ రెండు కంపెనీల బిడ్లపై ఎస్సార్ స్టీల్ రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకోవాలని, ఎనిమిది వారాల్లో అత్యుత్తమ బిడ్‌ను ఎంపిక చేయాలని సూచించింది. అంతేకాక 270 రోజుల్లో దివాలా ప్రక్రియ గడువు పూర్తి కావాలని తెలిపింది. ఆర్సెలార్ మిట్టల్ తన అనుబంధ విభాగమైన ఉత్తమ్ గాల్వాకు బకాయిపడిన మొత్తం రూ.7,000 కోట్లు. దీంతో ఉత్తమ్ గాల్వా రుణదాతలకు బకాయిలు చెల్లించేందుకు ఆర్సెలార్ మిట్టల్ ఇప్పటికే రూ.7 వేల కోట్లను తన ఎస్ర్కో ఖాతాలో డిపాజిట్ చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్ 29ఎ ప్రకారం.. బకాయి పడిన కంపెనీలకు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదు. మొత్తం 30 బ్యాంకులు, ఇతర రుణదాతలకు ఎస్సార్ స్టీల్ రూ.49,000 కోట్లు బకాయి పడటంతో సంస్థపై దివాలా పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే దివాలా పరిష్కారానికి చేరువవుతున్న నేపథ్యంలో సంస్థ బకాయిలను ఆస్తుల పునర్వ్యవస్థీకరణ సంస్థల(ఎఆర్‌సి)కు విక్రయించాలన్న ప్రతిపాదనను ఎస్బిఐ ఉపసంహరించుకుంది. ఎస్బిఐకి ఎస్సార్ స్టీల్ రూ.13,000 బకాయిపడింది. -
ఎస్సార్ స్టీల్‌కు ఆర్సెలర్ మిట్టల్ తాజా బిడ్
న్యూఢిల్లీ: భారీ రుణాల్లో కూరుకుపోయిన ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆర్సెలర్ మిట్టల్ సోమవారం ఉదయం తాజా బిడ్ దాఖలు చేసింది. జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ అండ్ సుమిటోమో మెటల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ బిడ్ దాఖలు చేసినట్లు తెలిసింది. బిడ్ విలువ ఎంతన్నది అధికారికంగా తెలియనప్పటికీ, ఈ మొత్తం రూ.42,000 కోట్లు ఉండవచ్చని వినిపిస్తోంది. ఎస్సార్ స్టీల్ రుణ దాతలకు తిరిగి చెల్లింపులు చేయటానికి ఆర్సెలర్ మిట్టల్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సార్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (ఈఎస్‌ఐఎల్) క్రెడిటార్స్ కమిటీకి ఈ మేరకు సవరించిన బిడ్‌ను సమర్పించినట్లు ఆర్సెలర్ మిట్టల్ తెలియజేసింది. గత అనుబంధ సంస్థలు... ఉత్తమ్ గాల్వా, కేఎస్ఎస్ పెట్రోన్ల రూ.7,000 కోట్ల బకాయిల చెల్లింపులకు కూడా తాజా ఆర్సెలర్ మిట్టల్ బిడ్ ఆఫర్ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. సంబంధిత రూ. 7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్ 11లోగా చెల్లించేస్తే ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌కు పరిశీలనార్హత ఉంటుందని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బకాయిలు రూ.49,000 కోట్లు... సుమారు రూ. 49,000 కోట్ల మొండిబాకీలను రాబట్టుకునేందుకు ఎస్సార్ స్టీల్‌ను బ్యాంకులు వేలం వేస్తున్నాయి. తొలి రౌండులో రష్యా సంస్థ న్యూమెటల్, ఆర్సెలర్‌మిట్టల్ బిడ్లు వేసినప్పటికీ.. డిఫాల్ట్ అయిన సంస్థలతో వాటి ప్రమోటర్లకు లావాదేవీలున్నాయన్న కారణంతో సీవోసీ సదరు బిడ్లను తిరస్కరించింది. న్యూమెటల్‌లో ఎస్సార్ స్టీల్ ప్రమోటరు రవి రుయా కుమారుడు రేవంత్ రుయాకు వాటాలున్నాయన్న కారణంతో ఆ సంస్థ బిడ్‌ను తిరస్కరించింది. బ్యాంకులకు బాకీ పడ్డ ఉత్తమ్ గాల్వా, కేఎస్ఎస్ పెట్రోన్‌లలో వాటాలు ఉన్నందున ఆర్సెలర్ మిట్టల్ బిడ్ తిరస్కరణకు గురైంది. దీంతో సీవోసీ రెండో విడత బిడ్లను ఆహ్వానించింది. వేదాంత కూడా మూడవ బిడ్డర్‌గా ఉంది. -
ఎస్సార్ స్టీల్ ట్విస్ట్: రేసులో వేదాంత
సాక్షి,న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో పీకల్లోతున కూరుకుపోయి దివాలా దిశగా అడుగులు వేస్తున్న దేశీయ ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్ బిడ్డింగ్ రేసులో తాజాగా మరోదిగ్గజం చేరింది.ఇప్పటికే అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ ఈ రేసులో ముందుండగా ఇపుడు వేదాంతా వచ్చి చేరింది. రెండవ రౌండ్ బిడ్డింగ్ ప్రక్రియలో ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బిడ్ల దాఖలుకు సోమవారమే తుది గడువు. ఫిబ్రవరి 12నాటి మొదటి దశలో బిడ్డింగ్‌లో ఆర్సెలార్ మిట్టల్, మారిషస్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యుమెతాల్తో కలిసి జెస్ డబ్ల్యూ రెండు సంస్థలు ప్రధానంగా నిలవగా ఇపుడు వేదాంతా దీనికోసం పోటీ పడుతున్న దిగ్గజాల సరసన చేరింది. అయితే మొదటి దశ బిడ్డింగ్‌లో ఐబిసి చట్టాల ప్రకారం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రెండు సంస్థల బిడ్లను తిరస్కరించాయి. కాగా దివాలా చట్టం కింద తొలి విడతలో చర్యలు చేపట్టేందుకు రిజర్వు బ్యాంకు గుర్తించిన 12 కంపెనీల్లో ఎస్సార్ స్టీల్ ఒకటి. గుజరాత్లో ప్రధాన ఉత్పత్తి కేంద్రం ఉన్న ఎస్సార్స్టీల్ సంవత్సరానికి 9.6 మిలియన్ టన్నుల నామమాత్రపు సామర్ధ్యం కలిగివుంది. అయితే భారీగా పెరిగిన ముడి ఇనుము ధరలు, ఉత్పత్తి వ్యయాలు కంపెనీకి ప్రతిబంధకం మారాయి. -
దివాలా చట్టం’పై ఎస్సార్ స్టీల్‌కు చుక్కెదురు
♦ చర్యలు నిలిపివేయాలన్న అభ్యర్థనకు కోర్టు నో అహ్మదాబాద్: దివాలా చట్టం కింద చర్యలు నిలిపివేయాలంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్ స్టీల్‌కు చుక్కెదురైంది. కంపెనీ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టేసింది. ఎస్సార్ స్టీల్ రుణభారం రూ.42,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇలా మొండిబాకీల భారం పెరిగిపోయిన 12 కంపెనీలపై ఆర్బీఐ సూచనల మేరకు బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఎస్సార్ స్టీల్.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మిగతా మొండి బాకీల కంపెనీల తరహాలో తమ సంస్థను కూడా జమ కట్టరాదని కంపెనీ పేర్కొంది. రూ. 20,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో తమ కంపెనీ ఇంకా పనిచేస్తూనే ఉందని, రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు తుది దశలో ఉన్న తరుణంలో ఇలాంటి చర్యలు సరికాదని వాదించింది. ఆర్బీఐ గానీ సర్క్యులర్ జారీ చేయకపోయి ఉంటే ఎస్బీఐ కన్సార్షియం తమపై దివాలా చర్యలకు ఉపక్రమించేది కాదని తెలిపింది. మరోవైపు, ఎస్సార్ స్టీల్ వాస్తవాలను తొక్కిపెట్టి కోర్టును పక్కదోవ పట్టిస్తోందంటూ ఆర్బీఐ తరఫు న్యాయవాది డేరియస్ ఖంబాటా వాదించారు. ఎస్సార్ స్టీల్ ఒక దశలో తమ కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) పంపే విషయంలో సుముఖత వ్యక్తం చేసిందని, కానీ ఆ విషయాన్ని మాత్రం తమ పిటిషన్లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఒకవేళ సదరు అంశం వెల్లడించి ఉంటే న్యాయస్థానం పిటిషన్‌ను ముందుగానే కొట్టిపారేసి ఉండేదని వివరించారు. మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సింది.. పిటిషన్ కొట్టివేత దరిమిలా.. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను పూర్తి చేసేందుకు తమకు మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సిందని ఎస్సార్ స్టీల్ వ్యాఖ్యానించింది. ఈ దశలో దివాలా చర్యలు చేపడితే.. కంపెనీ కార్యకలాపాలు మరింతగా దెబ్బతింటాయని, మొండిబాకీ సమస్యకు పరిష్కారం ఇంకా జటిలం కాగలదని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఎన్సీఎల్టీ ముందు తమ వాదనలు వినిపిస్తామని ఎస్సార్ స్టీల్ తెలిపింది. -
ఎస్సార్ స్టీల్‌కు గట్టి ఎదురుదెబ్బ
మొండిబకాయిల విషయంలో ఎస్సార్ గ్రూపుకు చెందిన ఎస్సార్ స్టీల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వు బ్యాంకుకు వ్యతిరేకంగా ఎస్సార్ స్టీల్ నమోదుచేసిన ఫిర్యాదును గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. జూలై 14న తన ఆదేశాలను రిజర్వులో పెట్టిన కోర్టు, సోమవారం రోజు ఫిర్యాదును తోసిపుచ్చుతున్నట్టు పేర్కొని, బ్యాంకులకు ఊరటనిచ్చింది. దివాలా చట్టం కింద ఈ స్టీల్ దిగ్గజంతో పాటు మరో 11 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై బ్యాంకులు సైతం చర్యలకు దిగాయి. దీంతో ఆర్బీఐ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎస్సార్ స్టీల్ జూలై 4న కోర్టుకు ఎక్కింది. అయితే హైకోర్టులో ఈ కంపెనీకి ఎలాంటి ఊరట లభించలేదు. రూ.5 వేల కోట్ల కంటే అధికంగా రుణాన్ని తీసుకొని చెల్లించకుండా నాన్చుతున్న మాల్యా కంటే ఘనులు 12 మంది ఉన్నట్టు ఆర్బీఐ గుర్తించింది. వీరిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మొండి బకాయిల్లో ఈ సంస్థల వాటా 25 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఆర్బీఐ సర్క్యూలర్‌కు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కిన ఎస్సార్ స్టీల్, తమ రుణాల పునరుద్ధరణ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఈ చర్యలు చేపట్టడం సమ్మతం కాదని తెలిపింది. తమతో పాటు రుణాలు చెల్లించకుండా ఉన్న మరో 11 సంస్థలతో సమానంగా తమల్ని చూడటం లేదని ఎస్సార్ స్టీల్ కోర్టులో పేర్కొంది. అంతేకాక తమ కంపెనీ మంచి పనితీరు కనబరుస్తుందని, వార్షిక టర్నోవర్ కూడా రూ.20వేల కోట్లగా ఉందని పేర్కొంది. అయితే ఈ వాదలనకు సమ్మతించని కోర్టు, ఎస్సార్ స్టీల్ ఫిర్యాదును కొట్టిపారేసింది. ఎస్సార్ స్టీల్ కంపెనీ రుణం సుమారు రూ.42వేల కోట్ల మేర ఉన్నాయి. ఆర్బీఐ తరుఫున వాదనలు వినిపించిన సెంట్రల్ బ్యాంకు కౌన్సిల్ డారియస్ కంబత్, 2016 మార్చి 31న రూ.31,671 కోట్లగా ఉన్న ఎస్సార్ స్టీల్ నిరర్థక ఆస్తులు, ఈ ఏడాది మార్చి వరకు రూ.32,864 కోట్లకు పెరిగినట్టు కోర్టులో తెలిపారు. 2016 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాలు లక్ష కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఇతర లెండర్లను తీసుకుంటే, ఇవి 10 లక్షల కోట్ల వరకు ఉంటాయి. ఈ మొండిబకాయిలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో బ్యాంకులు త్వరగా మేలుకుని, దివాలా చట్టం కింద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. -
మరో 3 సంస్థలపై దివాలా చర్యలు
♦ ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ♦ ఎలక్ట్రో స్టీల్‌పై బ్యాంకర్ల నిర్ణయం ముంబై: రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా మూడు ఉక్కు ఉత్పత్తి సంస్థలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటి ఖాతాలను దివాలా చట్టం కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి నివేదించాలని ఎస్బీఐ సారథ్యంలో గురువారం సమావేశమైన బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. భూషణ్ స్టీల్ రూ. 44,478 కోట్లు, ఎస్సార్ స్టీల్ రూ. 37,284 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ రూ. 10,274 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డాయి. ప్రధానంగా ఎన్సీఎల్టీలో దాఖలు చేసే కేసు పిటిషన్‌ను ఖరారు చేసేందుకే బ్యాంకులు సమావేశమైనట్లు సీనియర్ బ్యాంకర్ తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా దీనికి హాజరైనట్లు వివరించారు. భారీగా మొండి బాకీలు పేరుకుపోయాయని ఆర్బీఐ గుర్తించిన 12 ఖాతాల్లో ఈ మూడు కూడా ఉన్నాయి. సుమారు రూ. 37,248 కోట్లు బకాయిపడిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఐడీబీఐ బ్యాంకు సారథ్యంలోని కన్సార్షియం నేడు (శుక్రవారం) భేటీ కానుంది. వీటితో పాటు రుణగ్రస్త సంస్థల్లో ల్యాంకో ఇన్ఫ్రా, ఆమ్టెక్ ఆటో, అలోక్ ఇండస్ట్రీస్, మోనెట్ ఇస్పాత్ మొదలైనవి ఉన్నాయి. 6 నెలల్లో 55 ఖాతాల ఎన్పీఏలు పరిష్కరించుకోవాలి: ఆర్బీఐ న్యూఢిల్లీ: భారీగా రుణభారం పేరుకుపోయిన 55 ఖాతాలకు సంబంధించిన మొండిపద్దులను(ఎన్పీఏ) ఆరు నెలల్లోగా పరిష్కరించుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. లేని పక్షంలో ఆయా కేసుల్లో దివాలా చట్టం (ఐబీసీ) అమలుకు ఆదేశించాల్సి వస్తుందని పేర్కొంది. మొండి బాకీల్లో పావు శాతం వాటా ఉన్న 12 ఖాతాలకు సంబంధించి ఇటీవలే దివాలా ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఈ మూడింటి భవితవ్యం తేలేది నేడే!
ముంబై : భారీగా రుణాలు ఎగవేసి, తమకు గుదిబండలా మారిన సంస్థలపై బ్యాంకులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆర్బీఐ ఆదేశాలతో పలుమార్లు సమావేశమైన బ్యాంకర్లు వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు భారీగా ఎగనామం పెట్టిన మూడు సంస్థలు ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ భవితవ్యాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు నిర్ణయించనుంది. మొండిబకాయిల విషయంలో విజయ్ మాల్యా కంటే ఘనులు మరో 12 మంది ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు ఇటీవలే గుర్తించిన సంగతి తెలిసిందే. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. కానీ వారి పేర్లను ఆర్బీఐ వెల్లడించలేదు. ఈ మేరకు పలుమార్లు సమావేశమైన బ్యాంకులు, చర్యలకు రంగంలోకి దిగాయి. 12 సంస్థల మొండిబకాయిల్లో సగానికి పైగా రుణాలు ఈ మూడు సంస్థల వద్దనే ఉన్నట్టు కూడా బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో 12 సంస్థల వద్దనే 25 శాతం అంటే రెండు లక్షల కోట్లు మొండిబకాయిలుంటే, ఇక ఏకంగా ఈ మూడు సంస్థలే లక్ష రూపాయలకు పైగా రుణాలు మొండిబకాయిలుగా కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సంస్థల భరతం పట్టాలని బ్యాంకులు నిర్ణయించినట్టు తెలిసింది. నేడు బ్యాంకర్లు, రుణగ్రస్తులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో బ్యాంకులకు వచ్చిన నష్టాలు, తీసుకోబోయే చర్యలను చర్చించనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మూడు స్టీల్ కంపెనీలను సీల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఈ దిగ్గజ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియానే ఇచ్చింది. జాయింట్ లెండర్స్ ఫోరమ్ కు ఇది పిలుపునిచ్చింది. కార్పొరేట్ దివాలాను ఫైల్ చేయడం కోసం లెండర్లు కచ్చితంగా కన్సోర్టియంను కోరవచ్చని ఓ ఎస్ బీఐ సీనియర్ అధికారి చెప్పారు. బ్యాంకులు ఎస్సార్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.45వేల కోట్లు, భూషణ్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.47వేల కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కు ఇచ్చిన రుణాలు రూ.11వేలు కోట్లుగా ఉన్నాయి. బుధవారమే దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కార్పొరేట్ దివాలా కింద ఓ అప్లికేషన్ కూడా దాఖలు చేశారు.