న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్‌తో వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కంపెనీ తమ చేతుల్లోంచి జారిపోకుండా రుయా కుటుంబం (ప్రమోటర్లు) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేసే దిశగా మొత్తం రూ.54,389 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. ఇందులో రూ.47,507 కోట్లు ముందస్తుగా నగదు రూపంలో చెల్లించేందుకు కూడా సిద్ధమని పేర్కొంది.
ఎస్సార్ స్టీల్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్ ఆఫర్ చేసిన రూ.42,202 కోట్ల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. దాదాపు రూ.49,000 కోట్ల రుణాలను వసూలు చేసుకునేందుకు బ్యాంకర్లు ఎస్సార్ స్టీల్‌ను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎస్సార్ స్టీల్ ఇండియా రుణదాతలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పూర్తి సెటిల్మెంట్ కోసం దాదాపు రూ. 54,389 కోట్లు చెల్లించేట్లుగా రుణదాతల కమిటీ (సీఓసీ)కి ఎస్సార్ స్టీల్ వాటాదారులు ప్రతిపాదన సమర్పించారు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక రుణదాతలకు మొత్తం రూ.49,395 కోట్లు, నిర్వహణపరమైన రుణదాతలకు రూ.4,976 కోట్లు, ఉద్యోగులకు మరో రూ.18 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకునేలా రుయాలు ఆఫర్ చేసినట్లు వివరించాయి. ఆర్సెలర్ మిట్టల్‌తో పాటు రష్యాకి చెందిన వీటీబీ క్యాపిటల్ మద్దతున్న న్యూమెటల్ సంస్థ కూడా ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు పోటీ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment