న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ విషయంలో ఆర్సెలర్ మిట్టల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికపై ఈ నెల 11 లోపు తుది నిర్ణయం వెలువరించాలని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్ బెంచ్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) సోమవారం ఆదేశించింది. 11వతేదీ నాటికి ఎటువంటి ఆదేశాలు వెలువరించకపోతే, రికార్డులు తెప్పించుకుని తామే ఐబీసీ చట్టంలోని సెక్షన్ 31కింద ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ స్పష్టంచేసింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. రుణ దాతలందరి వాదనలనూ పూర్తిగా వినే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.
ఆపరేషనల్ క్రెడిటర్ల (సరఫరాదారులు, కాంట్రాక్టర్లు, కస్టమర్లు) వాదనలను మాత్రమే విని వీలైనంత తొందరగా ఆదేశాలివ్వాలని, మరో వంక ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారు పరిమిత వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని, మొత్తం మీద ఈ ప్రక్రియ ఐదు రోజుల్లో ముగించాలని ఆదేశించింది. ఎస్టార్ స్టీల్ కంపెనీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుమారు రూ.51 వేల కోట్ల మేర బకాయిలుండగా, ఐబీసీ చట్టంలోని దివాలా ప్రక్రియ కింద కంపెనీని సొంతం చేసుకునేందుకు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ రూ.42,000 కోట్లతో బిడ్ వేసింది. ఆర్సెలర్ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం కూడా తెలిపింది. అయితే, తాము రూ.54,389 కోట్ల మేర చెల్లిస్తామని ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు అడ్డుపుల్ల వేయడంతో ఈ ప్రక్రియలో జాప్యం నెలకొంది.
ఎన్‌సీఎల్‌టీలో ప్రశాంత్ రుయా పిటిషన్
ఇప్పటికే ఆలస్యమైన ఎస్సార్ స్టీల్ దివాలా పరిష్కార ప్రక్రియను మరింత జాప్యం చేసే దిశగా ఎస్సార్ గ్రూపు డైరెక్టర్ ప్రశాంత్ రుయా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌ను పక్కన పెట్టాలంటూ అప్లికేషన్ వేశారు. ఎస్సార్ స్టీల్ మాజీ డైరెక్టర్ దిలీప్ ఊమెన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్ భట్నాగర్, ప్రశాంత్ రుయా కలసి ఈ పిటిషన్ వేశారు. రుచి సోయా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ... ఎస్సార్ స్టీల్ విషయంలో ఎస్సార్ గ్రూపు ప్రమోటర్లు వేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ అహ్మదాబాద్ బెంచ్ గత నెల 29న కొట్టివేసింది. ఈ నేపథ్యంలో వీరు మళ్లీ ఎన్‌సీఎల్‌టీ తలుపుతట్టడం గమనార్హం.
ఆర్‌కామ్ ‘దివాలా పిటిషన్’పై ఎరిక్సన్ అభ్యంతరం
రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పిటిషన్‌పై ఎరిక్సన్ తన అభ్యంతరాన్ని ఫిబ్రవరి 8 నాటికి తెలియజేసేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతించింది. ఎన్‌సీఎల్‌ఏటీ లేదా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆర్‌కామ్ ఆస్తులను విక్రయిచేందుకు, మూడో పక్షానికి లేదా మరొకరికి హక్కులు కట్టబెట్టడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది.
టీడీశాట్‌లో ఆర్‌కామ్‌కు స్వల్ప ఊరట
టెలికం వివాదాల పరిష్కార మండలి (టీడీశాట్)లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు ఊరట లభించింది. ఆర్‌కామ్‌కు కేటాయించిన అదనపు స్ప్రెక్ట్రమ్‌కుగాను రూ.2,000 కోట్లను వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆర్‌కామ్‌కు రూ.2,000 కోట్లను తిరిగిచ్చేయాలని టెలికం శాఖను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment