Electrosteel Steels
-
శ్రీకాళహస్తి పైప్స్, ఎలక్ట్రోస్టీల్ బోర్లా- థైరోకేర్ జూమ్
రెండు కంపెనీల విలీనానికి ఆయా బోర్డులు ఆమోదముద్ర వేసిన వార్తలతో శ్రీకాళహస్తి పైప్స్, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వెరసి శ్రీకాళహస్తి పైప్స్, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ షేర్లు పతనంకాగా.. థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్ దూకుడు చూపుతోంది. వివరాలు చూద్దాం.. విలీన ఎఫెక్ట్ విలీన ముసాయిదా ప్రతిపాదనలపై అటు శ్రీ కాళహస్తి పైప్స్(ఎస్పీఎల్), ఇటు ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్(ఈసీఎల్) బోర్డులు ఆమోదముద్ర వేశాయి. సోమవారం సమావేశమైన బోర్డు ఇందుకు అనుమతించినట్లు రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. విలీనంలో భాగంగా ఎస్పీఎల్ వాటాదారులు తమ వద్ద గల ప్రతీ 10 షేర్లకుగాను 59 ఈసీఎల్ షేర్లను పొందనున్నట్లు తెలియజేశాయి. ఈ వార్తలతో ఎన్ఎస్ఈలో తొలుత ఎస్పీఎల్ షేరు 18 శాతం కుప్పకూలింది. రూ. 109కు చేరింది. ప్రస్తుతం 14.5 శాతం పతనంతో రూ. 114 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈసీఎల్ సైతం తొలుత 13 శాతం తిరోగమించి రూ. 20ను తాకింది. ప్రస్తుతం 8.2 శాతం నష్టంతో రూ. 21.30 వద్ద ట్రేడవుతోంది. థైరోకేర్ టెక్నాలజీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 171 శాతం జంప్‌చేసినట్లు థైరోకేర్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 37 శాతం పెరిగినట్లు తెలియజేసింది. కోవిడ్- పీసీఆర్, కోవిడ్- యాంటీబాడీ పరీక్షలు ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. ఈ కాలంలో 4 లక్షలకుపైగా కోవిడ్- 19.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేసింది. దీంతో థైరోకేర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 17 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 910 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 15 శాతం లాభంతో రూ. 890 వద్ద ట్రేడవుతోంది. -
రుణదాతలకు ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ షేర్లు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీ రుణాలిచ్చిన సంస్థలకు రూ.7,400 కోట్ల విలువైన షేర్లు జారీ చేసింది. రుణాల కింద షేర్లను కేటాయించింది. ఇందులో ఎస్బీఐ గరిష్టంగా 37 శాతం షేర్లను పొందింది. రుణాలు చెల్లించడంలో విఫలమైన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ సంస్థను వేలం వేయగా, వేదాంత సంస్థ భారీగా బిడ్ వేసి కొనుగోలుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలక్ట్రోస్టీల్ను వేదాంత అనుబంధ సంస్థ వేదాంత స్టార్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకోనున్న చర్యల్ని కంపెనీ మంగళవారమే ప్రకటించింది. ఇందులో భాగంగానే 26 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు 740 కోట్ల షేర్లను కేటాయించింది. 739,91,32,055 షేర్లను (ఒక్కోటీ రూ.10 ముఖ విలువ కలిగినది) ప్రిఫరెన్షియల్/ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలకు జారీ చేయడం పూర్తయిందని కంపెనీ ప్రకటించింది. ఇందులో 271.61 కోట్ల షేర్లు ఎస్బీఐకే దక్కాయి. ఎస్బీఐ తర్వాత పీఎన్బీ 46.70 కోట్ల షేర్లను దక్కించుకుంది. కెనరా బ్యాంకుకు 38.13 కోట్ల షేర్లు, యూకో బ్యాంకుకు 37.17 కోట్ల షేర్లు లభించాయి. ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ సైతం ఎలక్ట్రోస్టీల్ షేర్లను పొందాయి. -
మూడు సంస్థలపై ఎన్సీఎల్టీకి ఎస్బీఐ
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో రుణాలు బాకీపడిన మూడు సంస్థలపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తాజాగా దివాలా చట్టం కింద రుణాల రికవరీ ప్రక్రియ ప్రారంభించింది. ఉక్కు తయారీ సంస్థలు మోనెట్ ఇస్పాత్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, విద్యుత్ పంపిణీ సంస్థ జ్యోతి స్ట్రక్చర్స్ ఇందులో ఉన్నట్లు సమాచారం. రుణాల రికవరీ కోసం మోనెట్ ఇస్పాత్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్బీఐ కేసు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకులకు భారీగా బాకీ పడ్డాయని ఆర్బీఐ గుర్తించిన 12 సంస్థల్లో ఈ మూడు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన మొండిబకాయీల్లో దాదాపు నాలుగో వంతు ఈ సంస్థలు కట్టాల్సినదే ఉంది. -
ఈ మూడింటి భవితవ్యం తేలేది నేడే!
ముంబై : భారీగా రుణాలు ఎగవేసి, తమకు గుదిబండలా మారిన సంస్థలపై బ్యాంకులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆర్బీఐ ఆదేశాలతో పలుమార్లు సమావేశమైన బ్యాంకర్లు వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్యాంకులకు భారీగా ఎగనామం పెట్టిన మూడు సంస్థలు ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ భవితవ్యాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు నిర్ణయించనుంది. మొండిబకాయిల విషయంలో విజయ్ మాల్యా కంటే ఘనులు మరో 12 మంది ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు ఇటీవలే గుర్తించిన సంగతి తెలిసిందే. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. కానీ వారి పేర్లను ఆర్బీఐ వెల్లడించలేదు. ఈ మేరకు పలుమార్లు సమావేశమైన బ్యాంకులు, చర్యలకు రంగంలోకి దిగాయి. 12 సంస్థల మొండిబకాయిల్లో సగానికి పైగా రుణాలు ఈ మూడు సంస్థల వద్దనే ఉన్నట్టు కూడా బ్యాంకులు గుర్తించాయి. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో 12 సంస్థల వద్దనే 25 శాతం అంటే రెండు లక్షల కోట్లు మొండిబకాయిలుంటే, ఇక ఏకంగా ఈ మూడు సంస్థలే లక్ష రూపాయలకు పైగా రుణాలు మొండిబకాయిలుగా కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సంస్థల భరతం పట్టాలని బ్యాంకులు నిర్ణయించినట్టు తెలిసింది. నేడు బ్యాంకర్లు, రుణగ్రస్తులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో బ్యాంకులకు వచ్చిన నష్టాలు, తీసుకోబోయే చర్యలను చర్చించనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ మూడు స్టీల్ కంపెనీలను సీల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఈ దిగ్గజ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియానే ఇచ్చింది. జాయింట్ లెండర్స్ ఫోరమ్ కు ఇది పిలుపునిచ్చింది. కార్పొరేట్ దివాలాను ఫైల్ చేయడం కోసం లెండర్లు కచ్చితంగా కన్సోర్టియంను కోరవచ్చని ఓ ఎస్ బీఐ సీనియర్ అధికారి చెప్పారు. బ్యాంకులు ఎస్సార్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.45వేల కోట్లు, భూషణ్ స్టీల్ కు ఇచ్చిన రుణాలు రూ.47వేల కోట్లు, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కు ఇచ్చిన రుణాలు రూ.11వేలు కోట్లుగా ఉన్నాయి. బుధవారమే దీనిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కార్పొరేట్ దివాలా కింద ఓ అప్లికేషన్ కూడా దాఖలు చేశారు.