
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీ రుణాలిచ్చిన సంస్థలకు రూ.7,400 కోట్ల విలువైన షేర్లు జారీ చేసింది. రుణాల కింద షేర్లను కేటాయించింది. ఇందులో ఎస్‌బీఐ గరిష్టంగా 37 శాతం షేర్లను పొందింది. రుణాలు చెల్లించడంలో విఫలమైన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ సంస్థను వేలం వేయగా, వేదాంత సంస్థ భారీగా బిడ్ వేసి కొనుగోలుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలక్ట్రోస్టీల్‌ను వేదాంత అనుబంధ సంస్థ వేదాంత స్టార్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకోనున్న చర్యల్ని కంపెనీ మంగళవారమే ప్రకటించింది.
ఇందులో భాగంగానే 26 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు 740 కోట్ల షేర్లను కేటాయించింది. 739,91,32,055 షేర్లను (ఒక్కోటీ రూ.10 ముఖ విలువ కలిగినది) ప్రిఫరెన్షియల్/ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంలో రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలకు జారీ చేయడం పూర్తయిందని కంపెనీ ప్రకటించింది. ఇందులో 271.61 కోట్ల షేర్లు ఎస్‌బీఐకే దక్కాయి. ఎస్‌బీఐ తర్వాత పీఎన్‌బీ 46.70 కోట్ల షేర్లను దక్కించుకుంది. కెనరా బ్యాంకుకు 38.13 కోట్ల షేర్లు, యూకో బ్యాంకుకు 37.17 కోట్ల షేర్లు లభించాయి. ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ సైతం ఎలక్ట్రోస్టీల్ షేర్లను పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment