Creditors
-
తండ్రి దహన సంస్కారాలు..అడ్డుకున్న కొడుకు అప్పులోళ్లు
సాక్షి,జగిత్యాల జిల్లా: కొడుకు అప్పుకట్టలేదని తండ్రి దహన సంస్కారాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటన మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో జరిగింది. కొంతకాలం నుంచి పలువురి వద్ద 1 కోటి 70 లక్షల రూపాయల దాకా పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తి అప్పు చేశాడు. అప్పు చెల్లించలేక శ్రీకాంత్ హైదరాబాద్ పారిపోయాడు. శ్రీకాంత్ తండ్రి పుల్లూరి నారాయణ శనివారం మృతి చెందాడు. అయితే తండ్రి దహన సంస్కారాల కోసం శ్రీకాంత్ తన స్వస్థలం మెట్‌పల్లికి ఆదివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అప్పులోళ్లు దహన సంస్కారాలు జరిగే చోటికి వచ్చారు. అప్పు తీర్చేవరకు తండ్రి శవానికి దహన సంస్కారాలు జరగనివ్వబోమని అడ్డుకున్నారు. దీంతో దహన కార్యక్రమం గంట పాటు నిలిచిపోయింది. చివరకు ఆస్తి అమ్మి అప్పులు చెల్లిస్తానని శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో అప్పుల వాళ్లు వెనుదిరిగారు. తర్వాత తండ్రి నారాయణ దహన సంస్కారాలు జరిగాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా -
ఆర్‌క్యాప్ లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్లు?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్ల వరకు ఉంటుందని ఇండిపెండెంట్ వాల్యూయర్లు తేల్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా పక్రియ ప్రారంభించే తేదీ నాటికి ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆస్తిపై అప్పులుపోను కొనుగోలుదారుకు అందే తుది విలువ అంచనానే లిక్విడేషన్ విలువ. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతల కమిటీ (సీఓసీ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ వాల్యూయర్లు– డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు ఇచ్చిన లిక్విడేషన్ విలువ వివరాలను రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ సమర్పించారు. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆర్క్యాప్కు డఫ్ అండ్ ఫెల్పŠస్ రూ.12,500 కోట్ల లిక్విడేషన్ విలువ కడితే, ఆర్బీఎస్ఏ విలువ రూ.13,200 కోట్లుగా ఉంది. ► రిలయన్స్ క్యాపిటల్ కోసం నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేశాయి. వీటి బిడ్డింగ్ విలువ తాజా లిక్విడేషన్ అంచనా విలువకంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. ► రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు అందుకున్న అత్యధిక బిడ్ విలువ చూస్తే... కాస్మియా ఫైనాన్షియల్, పిరమల్ గ్రూప్ కన్సార్టియంల ఆఫర్ రూ. 5,231 కోట్లు. ► హిందూజా రూ.5,060 కోట్లకు బిడ్ చేసింది. ► టొరెంట్, ఓక్ట్రీ బిడ్ల పరిమాణం వరుసగా రూ.4,500 కోట్లు, రూ.4,200 కోట్లుగా ఉంది. ► లిక్విడేషన్ విలువ– వాస్తవ బిడ్ విలువల మధ్య ఉన్న భారీ అంతరాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ బిడ్లను సవరించమని సీఓసీ బిడ్డర్లను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపాయి. రిలయన్స్ క్యాప్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ విలువలు ఇలా... రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారం విలువలో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఆ సంస్థ– జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాల లిక్విడేషన్ విలువలు చూస్తే.. డఫ్ అండ్ ఫెల్పŠస్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లిక్విడేషన్ విలువ రూ.7,000 కోట్లు. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.4,000 కోట్లు. ఆర్బీఎస్ఏ విషయంలో ఈ అంచనా వరుసగా రూ.7,500 కోట్లు, రూ.4,300 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతలు.. మొత్తం సంస్థకు అలాగే సంస్థలోని విభిన్న వ్యాపారాలకు వేర్వేరుగా బిడ్డింగ్‌ను పిలవడం జరిగింది. సంస్థ మొత్తం కొనుగోలుకు పైన పేర్కొన్న నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేయగా, సెక్యూరిటీస్, రియల్టీ, ఏఆర్సీలకు మూడు బిడ్లు వచ్చాయి. మూడు బిడ్ల విలువ కేవలం రూ.120 కోట్లుగా ఉంది. అయితే డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు తాజాగా ఇచ్చిన లిక్విడేషన్ విలువలు వరుసగా రూ.280 కోట్లు, రూ.240 కోట్లుగా ఉన్నాయి. కాగా, జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాలకు మాత్రం వేర్వేరుగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు. -
రాజమండ్రి ప్లాంటు రుణాలు తీరుతాయా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంతో కుంగిపోతున్న జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్ (జీఆర్‌ఈఎల్), అప్పుల ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. ఈ ప్రణాళికకు కంపెనీ రుణదాతలు ఆమోదం తెలిపారని పేర్కొంది. జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీకి రూ.2,353 కోట్ల రుణ భారం ఉంది. తొలుత దీన్లో రూ.1,412 కోట్లను చెల్లించేందుకు ఒక విధానాన్ని రూపొందించారు. రూ. 1,412కోట్లలో 20% చెల్లించేందుకు, ఇంకా తొలి ఏడాది వడ్డీల కోసం జీఎంఆర్ గ్రూప్ రూ.395 కోట్లు కేటాయిస్తుంది. మిగిలిన రూ. 1,130 కోట్ల రుణాన్ని 9% ఫ్లోటింగ్ వడ్డీతో వచ్చే 20 ఏళ్లలో చెల్లించనుంది. మొత్తం రూ. 2353 కోట్లలో రూ. 1,412 కోట్లు పోగా మిగిలిన రూ. 941 కోట్ల రుణాన్ని భవిష్యత్‌లో చెల్లుబడయ్యే సీఆర్‌పీఎస్‌గా (క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు) మార్చింది. ఈ షేర్లకు ఇప్పటినుంచి 17–20 ఏళ్ల మధ్య 0.1% వడ్డీతో చెల్లింపులు చేస్తారు. ఈ ప్రణాళిక కంపెనీకి, రుణదాతలకు మేలు చేస్తుందని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎండీ గ్రంధి కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తమ గ్రూప్ మొత్తం రుణాలు తగ్గేందుకు ఈ ప్రణాళిక ఉపకరిస్తుందన్నారు. రాజమండ్రి ప్లాంట్ పనిచేసేందుకు తగిన గ్యాస్ లభిస్తుందనే నమ్మకాన్ని జీఎంఆర్ వ్యక్తంచేస్తోంది. తద్వారా జీఆర్‌ఈఎల్ నిర్వహణ కొనసాగి సీఆర్‌పీఎస్‌లు డిఫాల్ట్ కాకుండా ఉంటాయని భావిస్తోంది. 2016లో జీఆర్‌ఈఎల్ వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణకు(ఎస్డీఆర్) వెళ్లింది. 2012లో ఈ ప్లాంట్ పూర్తయింది. కానీ గ్యాస్ సరఫరాలో కొరత కారణంగా కార్యకలాపాలు ఆలస్యమయ్యాయి. దీంతో వ్యయాలు పెరిగి రుణభారం ఎక్కువైంది. 2015లో సంస్థ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. -
రూ. 80 వేల కోట్ల రికవరీ..
న్యూఢిల్లీ: బ్యాంకుల రుణ బకాయిల వసూళ్లలో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) పాత్ర కీలకమవుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకర్ల రూ.80 వేల రికవరీకి ఎన్సీఎల్టీ దోహదపడిందని అన్నారు. మార్చి చివరినాటికి మరో రూ.70 వేల కోట్ల రికవరీ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అత్యంత విశ్వసనీయత కలిగిన వేదికగా ఎన్సీఎల్టీ అవతరించిందని జైట్లీ ప్రశంసించారు. ‘‘దివాలా కోడ్ – రెండేళ్లు’ అన్న అంశంపై జైట్లీ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే... ► వాణిజ్యానికి సంబంధించి దివాలా సమస్యలను పరిష్కరించలేని క్లిష్ట పరిస్థితులను కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్లింది. అయితే ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా స్పందించింది. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి పలు చర్యలు తీసుకుంది. దివాలా చట్టానికి పదునుపెట్టింది. ► 2016 చివర్లో ఎన్సీఎల్టీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ కేసులను విచారించడం ప్రారంభించింది. ఇప్పటికి 1,322 కేసుల విచారణను (అడ్మిట్) చేపట్టింది. అడ్మిషన్‌కు ముందే 4,452 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.2.02 లక్షల కోట్లు పరిష్కారమయినట్లు ఎన్సీఎల్టీ డేటా చెబుతోంది. విచారణా ప్రక్రియ ద్వారా 66 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.80 వేల కోట్ల రికవరీ జరిగింది. 260 కేసుల విషయంలో దివాలా చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ► భూషణ్ పవర్ అండ్ స్టీల్, ఎస్సార్ స్టీల్ ఇండియా వంటి 12 బడా కేసులు విచారణ ప్రక్రియ చివరిదశలో ఉంది. వీటిలో కొన్ని కేసుల పరిష్కారం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మరో రూ.70,000 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం. ఆయా కేసుల పరిష్కారంలో ఎటువంటి రాజకీయ లేదా ప్రభుత్వ ఒత్తిళ్లు లేవు. ► ఎన్పీఏ అకౌంట్లు తగ్గుతుండడం హర్షణీయం. రుణాల మంజూరు, చెల్లింపుల వ్యవస్థల్లో మార్పులను ఈ పరిణామం సూచిస్తోంది. దివాలా చట్టం– రుణదాత, గ్రహీత మధ్య సంబంధాల్లో కూడా సానుకూల మర్పును సృష్టించింది. ► ఖాయిలా పరిశ్రమల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ 1980లో ఖాయిలా పరిశ్రమ కంపెనీల చట్టం తీసుకువచ్చింది. ఇది తీవ్ర వైఫల్యం చెందింది. ఈ చట్టం పలు ఖాయిలా పరిశ్రమలకు రుణదాతల నుంచి రక్షణ కల్పించింది. బ్యాంకింగ్ రుణ బకాయిల వసూళ్లకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటయినా, అది అంత ఫలితమివ్వలేదు. ► 2008–2014 మధ్య బ్యాంకుల విచక్షణారహితంగా రుణాలను మంజూరుచేశాయి.వాటిలో ఎక్కువ మొండిబకాయిలుగా మారాయని ఆర్బీఐ రుణ నాణ్యతా సమీక్షలు పేర్కొంటున్నాయి. ► ఆయా అంశాలే ఎన్డీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు కారణమయ్యింది. 2016 మేలో పార్లమెంటు రెండు సభలూ ఐబీసీ (ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్)కి ఆమోదముద్ర వేశాయి. నేను చూసినంతవరకూ పార్లమెంటు ఆమోదించిన సత్వర చర్యల, అత్యంత ప్రయోజనకరమైన ఆర్థిక చట్టం ఇది. -
రుణదాతలకు ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ షేర్లు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీ రుణాలిచ్చిన సంస్థలకు రూ.7,400 కోట్ల విలువైన షేర్లు జారీ చేసింది. రుణాల కింద షేర్లను కేటాయించింది. ఇందులో ఎస్బీఐ గరిష్టంగా 37 శాతం షేర్లను పొందింది. రుణాలు చెల్లించడంలో విఫలమైన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ సంస్థను వేలం వేయగా, వేదాంత సంస్థ భారీగా బిడ్ వేసి కొనుగోలుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలక్ట్రోస్టీల్ను వేదాంత అనుబంధ సంస్థ వేదాంత స్టార్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకోనున్న చర్యల్ని కంపెనీ మంగళవారమే ప్రకటించింది. ఇందులో భాగంగానే 26 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు 740 కోట్ల షేర్లను కేటాయించింది. 739,91,32,055 షేర్లను (ఒక్కోటీ రూ.10 ముఖ విలువ కలిగినది) ప్రిఫరెన్షియల్/ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో రుణాలిచ్చిన ఆర్థిక సంస్థలకు జారీ చేయడం పూర్తయిందని కంపెనీ ప్రకటించింది. ఇందులో 271.61 కోట్ల షేర్లు ఎస్బీఐకే దక్కాయి. ఎస్బీఐ తర్వాత పీఎన్బీ 46.70 కోట్ల షేర్లను దక్కించుకుంది. కెనరా బ్యాంకుకు 38.13 కోట్ల షేర్లు, యూకో బ్యాంకుకు 37.17 కోట్ల షేర్లు లభించాయి. ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ సైతం ఎలక్ట్రోస్టీల్ షేర్లను పొందాయి. -
వేదాంత, కెయిర్న్ మెర్జర్ కు షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్
ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్..కెయిర్న్ ఇండియా విలీనానికి షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విలీన ప్రతిపాదనకు మదుపర్లు, సెక్యూర్డు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్నివేదాంత రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. గోవాలో గురువారం జరిగిన ప్రతిపాదన ఓటింగ్‌కు వేదాంత లిమిటెడ్ మదుపర్లు అనుమతినిచ్చారని తెలిపింది. ఈ మెర్జర్ ద్వారా దేశంలో అతిపెద్ద విభిన్నమైన సహజ వనరులను సంస్థగా అవతరించాలనేది అగర్వాల్ ప్రణాళిక. సవరించిన ఆఫర్ ప్రకారం10 రూపాయల ముఖ విలువ గల షేర్ కు నాలుగు ప్రిఫరెన్షియల్ షేర్లను మైనారిటీ వాటాదారులకు అందించనుంది. అయితే వేదాంత అసలు పరీక్షను సెప్టెంబర్ 12న ఎదుర్కోనుంది. విలీన ఒప్పందంపై స్టేక్ హోల్డర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు కెయిర్న్ ఇండియా ఆరోజునే సమావేశం నిర్వహించనుంది. అక్కడ అంగీకారం లభిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. కోటీశ్వరుడు అనిల్ అగర్వాల్ నేతృత్వంలో ముందుకు సాగుతున్న ఈ వ్యవహారంలో ఇటీవల వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ యొక్క వాటాదారులు మెర్జర్ ను అనుమతించిన విషయం తెలిసిందే.